Abn logo
Aug 23 2021 @ 03:17AM

Grama, Ward Sachivalayam ఉద్యోగుల కుటుంబాలకు Jagan Govt షాక్‌..

  • చిరుద్యోగిపై చావుదెబ్బ
  • పర్మినెంట్‌ కాకముందే సంక్షేమానికి చెక్‌
  • బియ్యం కార్డు రద్దు చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు
  • పథకాల రద్దుపై పెరుగుతున్న ఆందోళన
  • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఎసరు!


తాత్కాలికం అయితేనేం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంబరపడాలో... లేక ఇస్తున్న రూ.15 వేల జీతంతో కుటుంబాన్ని నడపడానికి అష్టకష్టాలు పడుతుంటే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కట్‌ చేస్తున్నందుకు దిగాలు పడాలో అర్థం కాని దురవస్థ... రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబాలు అంతర్మథనం ఇది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటున్న ఈ సిబ్బందిని పర్మినెంట్‌ చేసేందుకు వారి చేత పిల్లిమొగ్గలు వేయిస్తున్న వైసీపీ సర్కార్‌... తాజాగా ఆ కుటుంబాలకు అందుతున్న సంక్షేమ ఫలాలకూ చెక్‌ పెడుతుండటంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా తెల్ల రేషన్‌కార్డులో సభ్యులై ఉంటే వెంటనే ఆయా కార్డులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తెల్ల కార్డులు కలిగి ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలోనే 11 వేలకు పైచిలుకు అలాంటి కార్డులు ఉన్నాయని ఆ జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.35 లక్షల సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు రేషన్‌తో పాటు సంక్షేమ పథకాలు దూరమవుతాయన్న ఆందోళన ఆ కుటుంబాల్లో నెలకొంది. సమీప భవిష్యత్తులో ఈ రద్దుల పద్దులో తమను కూడా చేరుస్తారేమోనన్న అనమానాలు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లోనూ బలపడుతున్నాయి. 


బిడ్డ ఉద్యోగంతో సంక్షేమానికి దూరం...

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఏ కుటుంబమైనా సంతోషంగానూ, కుటుంబానికి ఆసరాగా ఉంటారని భరోసాగానూ ఉంటుంది. అయితే సచివాలయ ఉద్యోగుల విషయంలో అందుకు భిన్నంగా ఉంది. ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ ఉద్యోగమంటూ ఎగిరి గంతేశారు. చిన్న ఉద్యోగమైనా రెండేళ్ల తర్వాత పర్మినెంట్‌ అవుతుందని సంతోషపడ్డారు. అయితే అప్రెంటి్‌సషిప్‌ పేరుతో చెల్లిస్తున్న రూ.15 వేల జీతం ఉద్యోగి ఖర్చులకే చాలని పరిస్థితి ఏర్పడింది. ఆ ఉద్యోగి కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు. వైసీపీ సర్కార్‌ చేస్తున్న జిమ్మిక్కులతో తమ బిడ్డ ఈ ఉద్యోగంలో ఎందుకు చేరాడా? అని అందోళన చెందే వారు ఎక్కువయ్యారని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల ‘వైట్‌ రేషన్‌కార్డుల రద్దు’ ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సామాజిక పెన్షన్‌, అమ్మఒడి, చేయూత, ఆసరా, చేదోడు, తదితర అనేక నగదు బదిలీ సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందుతున్నాయి.  రైస్‌కార్డు రద్దు ఆదేశాలతో తమకు ఇక సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయన్న ఆందోళన నెలకొంది. వాస్తవానికి రైస్‌కార్డుతో సంక్షేమ పథకాలు ముడిపెట్టేది లేదని ఇప్పటికే ప్రభుత్వ స్పష్టం చేసింది. అయినా ప్రతి సంక్షేమ పథకంలో దరఖాస్తు చేసేటప్పుడు రైస్‌కార్డుదారులా? కాదా? అనేది పరిశీలిస్తున్నారు. దీనితో సంక్షేమ పథకాలు రైస్‌కార్డు దారులకు తప్పకుండా అందుతాయన్న నమ్మకం మరింత బలపడింది. అసలు రేషన్‌కార్డే లేకపోతే తమ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆ కుటుంబాల ఆందోళన. పైగా నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయం పొందుతున్న వారందరినీ సంక్షేమ పథకాలకు అనర్హులుగా స్పష్టం చేస్తూ నిబంధనలున్నాయి. దీని మాటున ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా చరమగీతం పాడునున్నట్లు తెలిసింది.

ఆందోళనలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు... 

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సంక్షేమ పథకాలకు అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 4 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. వైసీపీ ప్రభుత్వాన్ని అనేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. వీటికితోడు సంక్షేమ పథకాల భారమూ క్రమేపీ పెరుగుతోంది. దీనిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలను వెతుకుతున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు సంక్షేమ ఫలాలు నిలిపేయాలని నిర్ణయించుకుందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నాలుగు లక్షల మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 20 లక్షల మంది వివిధ సంక్షేమ ఫలాలకు దూరం అవుతారు.

చిన్న ఉద్యోగిపై పెద్ద దెబ్బ... 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగం చాలా చిన్నది. అటెండర్‌కు ఎక్కువ, జూనియర్‌ అసిస్టెంట్‌కు తక్కువ కేడర్‌లో ఉన్న రికార్డు అసిస్టెంట్‌ స్థాయి పోస్టు ఇది. నియామకాల ప్రహసనాన్ని దాటుకుని ఉద్యోగంలో చేరిన సిబ్బందితో ప్రభుత్వం వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరుతో వారు నిరంతరం అభద్రతతోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సహజంగా పదోన్నతి సమయంలో డిపార్టుమెంటల్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం పర్మినెంట్‌ కావాలంటే డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు కచ్చితంగా పాసవ్వాలని లింక్‌ పెట్టారు. దీంతో ఇప్పటికే పోటీ పరీక్షల్లో ఉద్యోగం పొందిన తమకు మళ్లీ పరీక్షలేంటంటూ వారంతా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఇటీవల కంప్యూటర్‌ బేస్డ్‌ ఎసె్‌సమెంట్‌ సిస్టమ్‌ (సీబీఏఎస్‌) అంటూ ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. పలు కొత్త సబ్జెక్టులను చదివి, పరీక్షల్లో పాసయితేనే పర్మినెంట్‌ చేస్తామంటూ నిబంధనలు పెట్టారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో  వెనక్కి తగ్గారు. తాజాగా సంక్షేమ కార్యక్రమాలను నిలిపేసి చిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం చావు దెబ్బ కొడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.