దీన స్థితిలో ప్రభుత్వాసుపత్రులు... ప్రసవానికి వణుకుతున్న గర్భిణులు

ABN , First Publish Date - 2020-05-26T01:02:04+05:30 IST

పురిటి నొప్పులతో జోగులాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చేరింది ఓ మహిళ. తీరా ప్రసవమయ్యాక, ఆమె చేతిలో మృతశిశువును పెట్టారు వైద్యులు. మరో గర్భిణి బిడ్డతో సహా కన్నుమూసింది. ఇదే ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు వరసగా నాలుగు చోటుచేసుకున్నాయి. దీంతో... ఇలా ఎందు కు జరుగుతోందో తెలుసుకునేందుకు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పరిశీలకురాలు సుజాత... పలు కీలక వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించారు.

దీన స్థితిలో ప్రభుత్వాసుపత్రులు... ప్రసవానికి వణుకుతున్న గర్భిణులు

గద్వాల : పురిటి నొప్పులతో జోగులాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చేరింది ఓ మహిళ. తీరా ప్రసవమయ్యాక, ఆమె చేతిలో మృతశిశువును పెట్టారు వైద్యులు. మరో గర్భిణి బిడ్డతో సహా కన్నుమూసింది. ఇదే ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు వరసగా నాలుగు చోటుచేసుకున్నాయి. దీంతో... ఇలా ఎందు కు జరుగుతోందో తెలుసుకునేందుకు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పరిశీలకురాలు సుజాత... పలు కీలక వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. 


ఆ నివేదిక ప్రకారం... ప్రభుత్వాస్పత్రుల్లో ఘోరంగా ఉన్న సదుపాయాలు, వైద్యుల మధ్య తీవ్ర సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అంతేకాదు... గర్భిణులకు అందని పోషకాహారం.. ఈ కారణాలు జిల్లాలో గర్భిణులకు శాపాలుగా పరిణమిస్తున్నాయి. జోగులాంబ గద్వాలలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యుల పరిస్థితి ఎలా ఉందనే దానిపై ప్రత్యేక కథనం... ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి,  ఒక గర్భిణికి పరీక్షలు నిర్వహించడం నుంచి ప్రసవం చేయడం వరకూ ప్రసూతి విభాగానికి ఉండాల్సిన ఎన్నో పరికరాలు, యంత్రాలు... ఇటు గద్వాల ప్రభుత్వ పెద్దాస్పత్రిలో, అటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కనిపించడం లేదు.


గర్భిణులకు ప్రతి నెల స్కానింగ్‌ చేయాలి, కడుపులో బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడో, సహజ ప్రసవం సాధ్యమో కాదో.. బిడ్డ అసలు ఎదుగుతున్నాడో లేదో తెలుసుకునేందుకు ఇది అత్యవసరం. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ స్కానింగ్‌ యంత్రాలే లేవు.  రక్త హీనత గుర్తించడానికి సౌకర్యాల్లేవు. ప్రసవం సమయంలో గర్భిణికి అవసరమయ్యే రక్తనిల్వల్లో అన్ని గ్రూపులూ అందుబాటులో లేవు. స్వయంగా గద్వాల జిల్లా ఆసుపత్రిలోనే అధునాతన ఆపరేషన్‌ థియేటర్‌ లేక కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవానికి వచ్చిన ఎనిమిది మంది మహిళలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఒక కేసులో తల్లీబిడ్డలు మృతిచెందగా, మరో కేసులో కడుపులోనే బిడ్డ మృతి చెంది, తల్లి ప్రాణాపాయ పరిస్థితికి చేరిన ఘటనలు జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 11 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రి ఉన్నాయి.


ప్రాథమిక ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు చేస్తారు. క్లిష్టతరమైన(క్రిటికల్‌) ప్రసవాలను జిల్లా ఆస్పత్రికి పంపిస్తారు. ఈ ప్రసవాలు ఎలా చేయాలనేదానిపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో చాలామంది మహిళలు ప్రసవ సమయాల్లో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక్కడ చాలా ప్రసవాలు సాధారణ కాన్పులే. దాదాపు ముప్ఫై శాతానికిపైగా గర్భిణుల్లో అనేక రకాల బీపీ, రక్త హీనత, రెండో, మూడో కాన్పు సమయంలో సమస్యలు చోటుచేసుకుంటుంటాయి. అయితే ఆ ఇబ్బందులను సరిచేయడానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ అశించిన స్థాయిలో లేవు. ప్రసవ సమయంలో ఉండాల్సిన అత్యవసరమైన పరికరాలు, సిబ్బంది, థియేటర్లు తదితర వసతి ఉంటే ధైర్యంగా అపరేషన్‌కు ముందుకు సాగుతామని గద్వాల ఆస్పత్రి పరింటెండెంట్‌ డాక్టర్‌ శోభారాణి పేర్కొనడం విశేషం.   

Updated Date - 2020-05-26T01:02:04+05:30 IST