చెన్నాయగుంటను చెరబట్టారు

ABN , First Publish Date - 2021-08-23T04:34:51+05:30 IST

తిరుపతిలో భూ మాఫియా కోరలు చాస్తోంది. ఇదివరకు వివాదాస్పద భూములపై కన్నేసే సెటిల్‌మెంట్‌ బ్యాచ్‌.. ఇప్పుడు ప్రభుత్వ స్థలాల ఆక్రమణకూ దిగుతోంది.

చెన్నాయగుంటను చెరబట్టారు
ప్రభుత్వ స్థలంలో షెడ్లపై అంబేడ్కర్‌ బొమ్మతో జెండాల ఏర్పాటు

రూ.వంద కోట్ల స్థలం కబ్జా

అధికార పార్టీ పేరుతో ప్లాట్ల విక్రయాలు

అంబేడ్కర్‌ బొమ్మను అడ్డంపెట్టుకుని షెడ్ల నిర్మాణం 


తిరుపతి, ఆంధ్రజ్యోతి 


తిరుపతిలో భూ మాఫియా కోరలు చాస్తోంది. ఇదివరకు వివాదాస్పద భూములపై కన్నేసే సెటిల్‌మెంట్‌ బ్యాచ్‌.. ఇప్పుడు ప్రభుత్వ స్థలాల ఆక్రమణకూ దిగుతోంది. పవిత్రమైన అంబేడ్కర్‌ బొమ్మను అడ్డు పెట్టుకుని కొందరు, అధికార పార్టీ కీలక నేతల అనుచరుల పేరుతో మరికొందరు కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరి చర్యతో అర్బన్‌ పరిధిలో దాదాపు 9 ఎకరాల ప్రభుత్వం స్థలం చూస్తుండగానే కబ్జా కోరల్లోకి వెళ్లిపోతోంది. ప్రస్తుత మార్కెట్‌లో దీని విలువ రూ100 కోట్లపైనే ఉంటుందని అంచనా. అంతటి భారీ కబ్జా పర్వం సాగిన తీరిదీ. 


తిరుపతి అర్బన్‌ మండలం అక్కారంపల్లి గ్రామ లెక్కదాఖలా కొంకా చెన్నాయగుంట 173/3 సర్వే నెంబరులో 2.5 ఎకరాలు, 173/4 సర్వేనెంబరులోని 6.7 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. నగరానికి తూర్పువైపున ఉండే ఈ స్థలాన్ని కబ్జా చేయాలని రెండేళ్ల కిందటి వరకు ఎవరూ అనుకోలేదు. డీబీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుతో ఈ స్థలానికి విలువ పెరగడంతో కబ్జారాయుల కన్ను పడింది. తొలుత కొందరు దళిత నాయకులు ఆ స్థలంలోకి ప్రవేశించారు. అధికారపార్టీ అండతో షెడ్లు నిర్మించేశారు.  పవిత్రమైన అంబేడ్కర్‌ చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీలు,  ఇంటికో అంబేడ్కర్‌ జెండాలను తగిలించేశారు. దీనికి ఆనుకునే 173/4 సర్వే నెంబరులో ఉన్న 6.7ఎకరాల భూమి అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకి.. గతంలో ప్రభుత్వానికి మధ్య హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఇది పూర్తిగా చెన్నాయగుంట చెరువుకు సంబంధించిన భూమి అని.. ప్రైవేట్‌ వ్యక్తులకు చెందినది కాదనేది రెవెన్యూ అధికారుల వాదన. 


భలే మంచి చౌక బేరం


అనంతపురం జిల్లా ఎమ్మెల్యే నుంచి 173/4 సర్వే నెంబరులోని 6.7ఎకరాలను తాము కొన్నామని ఓ యువనేత అనుచరుడు, మరో మహిళా నాయకురాలు కలిసి ఈ భూమిని రెండు భాగాలుగా విభజించి అమ్మకానికి పెట్టేశారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. డీబీఆర్‌ రోడ్డు మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా అటువైపున్న భూములు రోడ్డు పక్కన అంకణం రూ.2లక్షలుంటే.. కొంచెం లోపలకైనా కూడా పట్టా భూమి రూ.లక్షకు తగ్గడం లేదు. కానీ, 173/4లో భూమిని అంకణం రూ30వేల నుంచి రూ50 వేలకు అమ్మేస్తున్నారు. తమ దగ్గర కొన్నవారికి బాండు పేపరులో రాసిస్తామని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది. తక్కువ రేటుకే వస్తుండటంతో ఇప్పటికే 50 మందికి పైగా ఆ స్థలాల్లో ప్లాట్లను కొన్నట్లు సమాచారం.  ఒకేసారి నగదు చెల్లించి, వెంటనే ఇల్లు కట్టుకునేవారికి మరికొంత తగ్గింపు ధరలతోనే ప్లాట్లను ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరికోసం హైక్లాస్‌ రియల్‌ దళారులను రంగంలోకి దింపినట్టు సమాచారం. దీంతో సదరు ప్రాంతం కొనుగోలుదారులు, హడావుడిగా షెడ్లు నిర్మించేవారితో సందడిగా కనిపిస్తోంది. మరోవైపు కొందరు కార్పొరేటర్లు కూడా ఆ స్థలం కబ్జా పర్వంలో భాగస్వామ్యం అయినట్టు సమాచారం. కార్పొరేటర్లూ స్థలాలు కొన్నారని, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొనుగోలుదారులను మభ్యపెడుతున్నట్టు తెలుస్తోంది.


పోలీసు సాయం కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ 


తిరుపతి అర్బన్‌ పరిధిలో 9 ఎకరాల భూమి అంటే ఆషామాషీ కాదు. అంత విలువైన భూమిని కబ్జారాయళ్లకు వదిలేసి రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆక్రమణలు తొలగించేందుకు పోలీసుల సహాయం కోరామని, వారు రాగానే తొలిగిస్తామని చెబుతున్నారు. మూడు నెలలుగా సాగుతున్న ఆక్రమణలు తొలగించేందుకు పోలీసులపై నెపం నెట్టడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణంగా కనిపిస్తోంది. సుమారు రూ100 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం అయిపోతుంటే విపక్షాలు కూడా నోరుమెదపకపోవడం విడ్డూరంగా ఉంది. 


ఆక్రమణలను తొలగిస్తాం 

173/3లోని రెండున్నర ఎకరాలు, 173/4 సర్వే నెంబరులోని 6.7 ఎకరాలు ప్రభుత్వ భూమి. 173/3 సర్వే నెంబరులో అక్రమ నిర్మాణాలు వెలిశాయని మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ సిబ్బందితో విచారణ చేయించాం. వాటిని తొలిగించేందుకు పోలీసుల రక్షణ కావాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశాం. 173/4 సర్వేనెంబరులోనూ ఎవరైనా విక్రయాలు జరిపితే అవి చెల్లుబాటుకావు. అది చెరువు స్థలం. విక్రయించేందుకు ఎలాంటి అధికారం లేదు. 

- వెంకటరమణ, తిరుపతి అర్బన్‌ తహసీల్దారు

Updated Date - 2021-08-23T04:34:51+05:30 IST