ఫోకస్‌.. బోగస్‌!

ABN , First Publish Date - 2021-07-28T08:25:50+05:30 IST

రాష్ట్రంలో రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చు పెట్టకపోగా, ఆ పేరు మీద జనం నుంచి వసూలు చేస్తున్న..

ఫోకస్‌.. బోగస్‌!

రహదారుల నిర్వహణపై సర్కారు కట్టుకథలు

రూ.2 వేల కోట్ల ‘కేటాయింపు’ ఓ మిథ్య

మంజూరు కాని రుణం పేరిట హడావుడి

పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి సెస్‌

రోడ్ల నిర్వహణ కోసమే జనం నుంచి వసూలు

ఏటా రూ.600 కోట్లు వచ్చినా.. గోతులే గతి

ఆ మొత్తాన్నీ దారి మళ్లించారనే అనుమానం

‘సెస్‌’ సొమ్ములుండగా అప్పు తేవడం ఎందుకో?

రహదారుల నిర్వహణపై సర్కారు వారి చిత్రాలు


చేపా చేపా ఎందుకు ఎండలేదు? అంటే...  చాంతాడంత కథ చెప్పిందట! ‘రోడ్లు ఎందుకిలా ఉన్నాయి?’... అని అడిగితే సర్కారు వారు కూడా ఇవే కట్టు కథలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఏం చేశారో చెప్పకుండా... అవి చంద్రబాబు గోతులని, ఇప్పుడే కాదు... ఏడెనిమిదేళ్లుగా రోడ్లపై ఫోకస్‌ లేదని  రోడ్ల కథను ఆసక్తికరమైన ‘మలుపులు’ తిప్పుతున్నారు. ఈ ముఖ్యమంత్రి రోడ్లపై బాగా ఫోకస్‌ పెట్టారని, రూ.2వేల కోట్లు మంజూరు చేశారని గొప్పగా చెప్పారు. ఆ రెండు వేల కోట్లు మంజూరు చేశారా? విడుదల చేశారా? అందులో ఎంత ఖర్చు పెట్టారు? అంటే... అంతా తుస్స్‌! 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చు పెట్టకపోగా, ఆ పేరు మీద జనం నుంచి వసూలు చేస్తున్న సెస్సునూ తన ‘ప్రాధాన్యాల’ మేరకు ఇతర ఖర్చులకు మళ్లిస్తోందని స్పష్టంగా తేలిపోయింది. వైసీపీ సర్కారు ‘రోడ్‌ సెస్‌’ పేరిట ప్రతి లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూపాయి చొప్పున వసూలు చేస్తోంది. ‘ఈ డబ్బులతో రోడ్లు బాగు చేస్తాం’ అని చెప్పింది. ఇలా సగటున నెలకు రూ.50 కోట్లు... ఏటా రూ.600 కోట్లు పోగేసుకుంటోంది. అంటే... ఈ రెండేళ్లలో రూ.1200 కోట్లు రోడ్‌ సెస్‌ రూపంలో జనం నుంచి వసూలు చేసింది. ఆ డబ్బులను ఖర్చు చేసి ఉంటే... కచ్చితంగా రోడ్లకు ఈ దుస్థితి వచ్చేదే కాదు. రహదారుల అభివృద్ధికి కేటాయించాల్సిన ఆ సొమ్ము ఏమైంది? ఎక్కడ ఖర్చుపెట్టారు? అని రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును ప్రశ్నించినప్పుడు‘‘ఆ అకౌంట్‌ నుంచే ఖర్చు చేయాలని ఏమీ ఉండదు. ప్రభుత్వానికి ప్రాధాన్యతలుంటాయి. 


ఈ సెస్సు ద్వారా  వచ్చే నిధుల ఆధారంగా రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. ‘సెస్‌’ అంటే.. నిర్దిష్టంగా ఏ ప్రయోజనాల కోసం విధిస్తున్నారో, దాని కోసమే వాడాలి. కానీ.. ఇక్కడేమో ఆ ఖాతా నుంచే ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి ప్రాధాన్యతలుంటాయని చెప్పడం గమనార్హం. అంటే.. రహదారి భద్రత అనేది సర్కారువారి ప్రాధాన్య జాబితాలో లేదన్న మాట! సెస్సు ద్వారా వసూలు చేసిన సొమ్మును రోడ్ల రిపేర్లకు కాకుండా ఎందుకు ఖర్చు పెట్టారు? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.


అదే ఖర్చు చేస్తే అప్పు ఎందుకు?

మద్యంపై అదనపు పన్ను వేసి.. దానిని హామీగా చూపించి అప్పు తెచ్చి.. ఆ సొమ్ముతో ‘అమ్మఒడి’లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పుకుంది. ప్రజలందరికీ అవసరమైన రోడ్లు బాగు చేసేందుకూ అప్పులే గతి అని ఇప్పుడు చెబుతోంది. అది కూడా... పెట్రోలు, డీజిల్‌పై విధించే సెస్‌ ఆదాయాన్ని హామీగా చూపించి రూ.2వేల కోట్లు అప్పు తెస్తారట! సెస్‌ ద్వారా ఏటా వసూలు అవుతున్న రూ.600కోట్లు, బడ్జెట్‌లో కేటాయిస్తున్న రూ.350 కోట్లు... మొత్తం రూ.950 కోట్లు ఖర్చు పెడితే రహదారులను అద్భుతంగా నిర్వహించవచ్చునని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. బ్యాక్‌లాగ్‌ వర్క్‌కు కూడా అవకాశం ఉండదని, ఎప్పటి రోడ్లు అప్పుడు బాగు చేయవచ్చునని పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న నిధులను అసలు పనికి వాడకుండా, వాటిని  ఆధారంగా చూపి అప్పుకు వెళ్లడంలోని ఆంతర్యం ఏమిటి? అప్పులు చేయడం, వాటికి మళ్లీ నెలనెలా వడ్డీలు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనమేంటి? అంటే.. పెట్రోలు, డీజిల్‌పై వ సూలు చేస్తున్న సెస్సును దారి మళ్లించి, ఎలా ఖరుపెడుతున్నారో చెప్పకుండా ఇప్పుడు కొత్తగా రుణం మాటను తెరమీదకు తీసుకొస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రాని రుణంపై గొప్పలు

‘‘ఏడెనిమిదేళ్లుగా రోడ్లపై ఫోకస్‌ లేదు. ఈ ముఖ్యమంత్రే దీనిపై దృష్టి సారించారు. రోడ్ల మెయింటెనెన్స్‌కు రూ.2వేల కోట్లు కేటాయించారు’’ అని గొప్పగా చెబుతున్నారు. ఈ మాటలు మేడిపండులా ఎంత అందంగా ఉన్నాయో కదా! పొట్ట విప్పి చూస్తే అసలు విషయం బయటపడుతుంది. ఈ సీఎం బాగా ‘ఫోకస్‌’ పెట్టడం ఒక మిథ్య! ‘రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చుకుని రోడ్లు బాగు చేసుకోండి’ అని చెప్పడమే ఈ సర్కారు పెట్టిన ‘ఫోకస్‌’! పెట్రోల్‌, డీజిల్‌పై వసూలయ్యే రోడ్‌సెస్సులో 50శాతం ఎస్ర్కో కింద చూపిస్తూ రుణం తీసుకోబోతున్నామని, అది రోడ్ల నిర్వహణకు ఉపయోగిస్తామని ఆర్‌అండ్‌బీ చెబుతోంది. ఇప్పటి వరకు ఈ రుణం ఖరారు కాలేదు. ‘‘ప్రైవేటు బ్యాంకుల నుంచే రుణం తీసుకోవాలని ఆర్థికశాఖ చెప్పింది. ఒక్కో బ్యాంకు రూ.100 కోట్లు లేదా 200 కోట్లు మాత్రమే ఇచ్చేలా ఉన్నాయి. అది వర్కవుట్‌ కాదు. అందుకే మళ్లీ జాతీయ బ్యాంకుల నుంచే రుణం తీసుకోవాలని ఆర్థికశాఖకు చెప్పాం. ఐదు బ్యాంకులతో మాట్లాడాం. మూడు సానుకూలంగా స్పందించాయి. అందులో ఏదో ఒకటి సమ్మతించినా రుణం వస్తుంది. అప్పుడు  రహదారుల మరమ్మతులు, నిర్వహణ టెండర్లను పూర్తిచేస్తాం’’ అని అధికారికంగా చెప్పారు. ఇదీ అసలు విషయం! ఖరారు కాని రుణాన్ని సర్కారు కేటాయింపు కింద చూపడం, ఒకేసారి రూ.2 వేల కోట్లు కేటాయించారని అధికారులతో చెప్పించడంపై సీనియర్‌ బ్యూరోక్రాట్లు ముక్కున వేలేసుకుంటున్నారు.


కృష్ణబాబు కష్టాలు!

ఎక్కడైనా ప్రభుత్వం రోడ్ల పనులకు టెండర్లు పిలిస్తే.. వాటిని దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు పోటీ పడతారు. కానీ.. ఏపీలో సీన్‌ రివర్స్‌. ‘మీ పనులు మేం చెయ్యం బాబోయ్‌’ అని పారిపోతున్నారు. పెండింగ్‌ బిల్లులకు దిక్కులేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ‘ఖరారు కాని రుణం’ ఆధారంగా ఇప్పటికి 403 వర్క్‌లకు టెండర్లు పిలిచారు. ఇందులోని అసలు సంగతి బోధపడిన కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. వారిని మెప్పించి టెండర్లు వేయించేందుకు ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అష్టకష్టాలు పడుతున్నారు. ‘నమ్మకంతో రండి. మీకు నష్టం రాదు. ట్రెజరీ, సీఎ్‌ఫఎమ్‌ఎస్‌ ద్వారా కాకుండా నేరుగా బ్యాంకుల ద్వారానే బిల్లుల చెల్లింపు ఉంటుంది’ అని సరికొత్త పద్ధతిలో హామీ  ఇస్తున్నా... కాంట్రాక్టర్లకు నమ్మకం కలగడంలేదు. 

Updated Date - 2021-07-28T08:25:50+05:30 IST