ఇలాగైతే కష్టం!

ABN , First Publish Date - 2021-04-09T08:13:51+05:30 IST

విశాఖలోని మిందిలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉన్న గోదాముతో పాటు ఇతర బహుళ జాతి సంస్థల గోడౌన్ల కూల్చివేత విషయంలో అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని తేటతెల్లమైంది...

ఇలాగైతే కష్టం!

  • విశాఖకు ఏ పరిశ్రమలూ రావు.. వ్యక్తిగత కక్షతో గోదాముల కూల్చివేతా?
  • పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన
  • ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్‌ గోడౌన్‌ కూల్చివేతకు 4 నెలల ముందే ప్రణాళిక!
  • అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌కూ తీవ్ర నష్టం
  • భద్రతా చర్యలు తీసుకోకుండా రసాయనాల గోదామూ ధ్వంసం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖలోని మిందిలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉన్న గోదాముతో పాటు ఇతర బహుళ జాతి సంస్థల గోడౌన్ల కూల్చివేత విషయంలో అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారని తేటతెల్లమైంది. ‘మున్సిపల్‌ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను కూలగొడతాం..’ అంటూ ఏపీఐఐసీ, ఆటోనగర్‌ ఐలా అధికారులు గోదాం గేట్లకు నోటీసులు అంటించారు. నిజంగా ఆ చట్టం ప్రకారమే చర్యలు చేపడితే.. తొలుత ఆ అక్రమ నిర్మాణం తాలూకు భవన యజమానికి నోటీసివ్వాలి. ఒకవేళ అందులో ఎవరైనా అద్దెకు ఉన్నట్లయితే వారికి కూడా సమాచారమివ్వాలి. ఖాళీ చేసేందుకు తగిన సమయమివ్వాలన్నది నిబంధన. కానీ మిందిలో ఏపీఐఐసీ అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించలేదు. యజమానిని, గోదాములు అద్దెకు తీసుకున్న వారిని లోపలకు రానివ్వకుండా గేట్లు వేసి.. పోలీసు అధికారులను కాపలా పెట్టి మరీ నిర్మాణాలను కూలగొట్టారు. లోపల విలువైన సామగ్రి ఉందని, వాటిని తీసుకోవడానికి కొంత వ్యవధి ఇవ్వాలని కోరినా ఆటోనగర్‌ ఐలా కమిషనర్‌ శామ్యూల్‌ అంగీకరించలేదు. తమ చేతుల్లో ఏమీ లేదన్నారు. ఇది కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లతో అత్యుత్సాహంతో చేసిన పనేనని మున్సిపల్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇది న్యాయసమ్మతం కాదని, ముమ్మాటికీ అన్యాయమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.


ఇలాగైతే పరిశ్రమలు వస్తాయా?

మిందిలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రింటింగ్‌ ప్రెస్‌ గోడౌన్‌తో పాటు అమెజాన్‌, హోమ్‌టౌన్‌, బిగ్‌ బాస్కెట్‌, విష్ణు కెమికల్స్‌, మైలాన్‌ సంస్థలు నడుస్తున్న గోదాములను సైతం అధికారులు కూల్చివేశారు. అమెజాన్‌కు రోజూ మూడు లారీలతో సరకులు వస్తాయి. అలాగే హోమ్‌టౌన్‌, బిగ్‌ బాస్కెట్లకు కూడా రోజూ సరుకులు తెస్తారు. అమెజాన్‌ సంస్థ మింది గోడౌన్‌ నుంచే ఇటు శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు, అటు ఒడిశాకు కూడా సరుకులు పంపుతుంటుంది. అమెజాన్‌లో ఈ ప్రాంత వాసులు బుక్‌ చేసుకున్న వస్తువులన్నీ ఈ గోదాము నుంచే వెళ్తాయి. ఏపీఐఐసీ అధికారులు బుధవారం గోడౌన్‌ను కూల్చివేయడం, సరుకుల లారీలను అనుమతించకపోవడంతో ఆయా సంస్థల కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఆ సంస్థకు చెందిన వేల మంది వినియోగదారులకు సకాలంలో సరుకులు అందకపోవడంతో.. వారందరికీ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఎదురైంది. ఇక బిగ్‌ బాస్కెట్‌కు వస్తే.. వారి సరుకుల్లో కొన్ని ఒకరోజు ఆలస్యమైనా పాడైపోయి నష్టం వస్తుంది. ఇక ఫార్మా కంపెనీలకు చెందిన రసాయనాలను ఇక్కడ నిల్వ చేశారు. 

వాటికి భద్రత లేకుండా పొక్లెయిన్లతో గోడను కూల్చడం వల్ల రసాయనాలపై ఎండ పడి, రసాయన చర్య మొదలైంది. అవి పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. అక్రమ నిర్మాణమంటూ అనాలోచితంగా, కక్షపూరితంగా వ్యవహరించిన అధికారుల తీరుపై పారిశ్రామిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు నష్టం వాటిల్లేలా ఇలాంటి చర్యలకు దిగితే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారని నిలదీస్తున్నాయి.


ఏం చేయడానికైనా వెనుకాడరు..

విశాఖ సంపదపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు.. తమ స్వలాభం కోసం ఏం చేయడానికైనా వెనకాడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎన్నో ఏళ్లు కష్టపడి సమకూర్చుకున్న సంపదను అడ్డగోలుగా కొట్టేయడానికి చట్టంలోని లొసుగులు ఉపయోగించుకుని అధికారుల ద్వారా ఇలా కూల్చివేయించడం న్యాయం కాదని పారిశ్రామిక సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. దీనిపై ఎవరు ప్రశ్నించినా వారిపై కక్ష గట్టి చర్యలు చేపట్టే ప్రమాదం ఉందని, అందుకే తాము ముందుకు రాలేకపోతున్నామని పలువురు వాపోయారు.



రాజకీయ, వ్యక్తిగత కక్షలతో విశాఖపట్నంలో పలు సంస్థలు నడుస్తున్న గోదాములను ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు కూల్చివేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ‘ఆంధ్రజ్యోతి’పై పగపెంచుకుని.. ఆ సంస్థ ప్రింటింగ్‌ ప్రెస్‌ గోదామునే కాకుండా పక్కనే ఉన్న మరికొన్ని బహుళ జాతి సంస్థల గోడౌన్లను కూడా కూల్చివేయడాన్ని పారిశ్రామిక వర్గాలు తప్పుబడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏపీఐఐసీ అధికారులు ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో విశాఖకు పరిశ్రమలు రావడం 

కష్టమని హెచ్చరిస్తున్నాయి.






నోటీసు నంబర్లలో తేడాలు..

గత ఏడాది డిసెంబరులో ఒకసారి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి నోటీసులు జారీ చేసినట్లు గోదాము గేటుకు నోటీసులు అంటించారు. అయితే నోటీసులు జారీ చేసినప్పుడు దానికో నంబరు వేస్తారు. అందులో మొదట ఎన్నో నోటీసో సీరియల్‌ నంబరుతోపాటు పక్కన సంవత్సరం కూడా ఉంటుంది. ఇక్కడ డిసెంబరు 15న జారీచేసిన నోటీసుకు 07/2020/ఐలా-ఏఎన్‌ అని, ఫిబ్రవరిలో జారీచేసిన నోటీసుకు 18/2020/ఐలా-ఏఎన్‌ అని నంబర్లు వేశారు. అంటే వీటిని గత ఏడాదే తయారు చేసుకున్నారని నిర్ధారణ అవుతోంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 25న జారీచేసినట్లు గ్రీన్‌ ఇంకుతో తేదీ వేసి.. కూల్చివేతకు ముందురోజు గేటుకు అంటించారు. అంటే కూల్చివేతకు 4 నెలల ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని, పై నుంచి ఆదేశాలు రాగానే బుధవారం ఉదయం కూల్చివేశారన్న మాట!


Updated Date - 2021-04-09T08:13:51+05:30 IST