చెప్పేదొకటి... చేసేదొకటి.. అస్మదీయులకే వైసీపీ చేయూత..

ABN , First Publish Date - 2020-09-19T16:43:30+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరులో అస్మదీయులకే అధికార పార్టీ నేతలు అవకాశం కలిస్తున్నారు. ఏదైనా పథకం ద్వారా లబ్ధి పొందాలంటే స్థానికంగా వుండే వైసీపీ నాయకులతో సిఫారసు చేయించుకోవాలి. లేదంటే అర్హుల జాబితాల్లో పేరు ఉండదు.

చెప్పేదొకటి... చేసేదొకటి.. అస్మదీయులకే వైసీపీ చేయూత..

సంక్షేమ పథకాల మంజూరులో రాజకీయ వివక్ష

కుంటిసాకులతో పక్కనపడేస్తున్న గ్రామ/వార్డు వలంటీర్లు, కార్యదర్శులు

అంతా ఇష్టారాజ్యం.. అన్యాయమని పలువురి ఆవేదన

అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం

ఇదే సమయంలో అనర్హులు లబ్ధిదారులుగా ఎంపిక


రోలుగుంట(విశాఖపట్టణం): ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరులో అస్మదీయులకే అధికార పార్టీ నేతలు అవకాశం కలిస్తున్నారు.  ఏదైనా పథకం ద్వారా లబ్ధి పొందాలంటే స్థానికంగా వుండే వైసీపీ నాయకులతో సిఫారసు చేయించుకోవాలి. లేదంటే అర్హుల జాబితాల్లో పేరు ఉండదు. గ్రామ/వార్డు స్థాయిల్లో పెత్తనం చెలాయిస్తున్న నాయకులు మౌఖికంగా లేదా లేఖ రూపంలో సిఫారసు చేస్తేనే పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామని పలు మండలాల్లో గ్రామ వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు తెగేసి చెబుతున్నారు.


‘మా పార్టీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే మా ప్రభుత్వ ధ్యేయం...’ అంటూ రాష్ట్రంలో అధికారంలో వున్న పెద్దలు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రాజకీయంగా అధికార పార్టీ (వైసీపీ)కి అనుకూలంగా లేని వారికి ప్రభుత్వ పథకాలు మంజూరు కాకుండా కిందిస్థాయి సిబ్బంది కొర్రీలు వేస్తున్నారు. పథకం మంజూరుకు నిర్దేశించిన అర్హతలన్నీ వుండి, సంబం ధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్నా...అర్హుల జాబితాల్లో పేర్లు వుండడం లేదని మండల, డివిజన్‌, జిల్లా స్థాయి స్పందన కార్యక్రమాల్లో అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.


ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న చేదోడు, జగనన్న చేయూత, కాపునేస్తం...వంటి పథకాల కింద లబ్ధి పొందడానికి శత శాతం అర్హత వున్నప్పటికీ వైసీపీ నాయకుల సిఫారసు లేదని మంజూరుకాని పరిస్థితి చాలాచోట్ల తలెత్తింది. దీంతో ఆయా లబ్ధిదారులు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘‘మీరు గత ఎన్నికల్లో మా పార్టీకి ఓటు వేయలేదు. ఇది మా ప్రభుత్వం. మేం ప్రవేశపెట్టిన పథకాలను మీకు ఎందుకు మంజూ రుచేయాలి?’ అంటూ కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు అంటుండడంతో లబ్ధిదారులకు దిక్కు తోచడం లేదు. ఒకవేళ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు

జగనన్న చేయూత పథకం కోసం రోలుగుంట పంచాయతీ పరిధిల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో 21 మంది అనర్హులంటూ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి...వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. గ్రామంలో మిగిలిన మహిళలకు చేయూత సాయం అందడంతో తమకు ఎందుకు అన్యాయం చేశారంటూ సచివాలయ సిబ్బందిని నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయం నుంచి...రోలుగుంట సచివాలయ ఉద్యోగులను, పంచాయతీ కార్యదర్శిని వివరణ అడగ్గా...ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి లేదని ఆయా మహిళలే చెప్పారంటూ నమ్మశక్యంగానీ సమాధానం ఇచ్చారు.


కుట్టు మిషన్‌ లేని వారికి చేదోడు?

అర్హులైన లబ్ధిదారులకు పథకాలు మంజూరు చేయకపోవడం ఒక ఎత్తైతే...అస్మదీయులకు అనర్హు లైనా లబ్ధిదారులుగా ఎంపిక చేసి పథకాలు మంజూ రు చేస్తున్నారు. రోలుగుంట మండలంలో జగనన్న చేదోడు పథకం మంజూరైన వారిలో 50 శాతం మందికి కుట్టుమిషన్లు లేవు. మిగిలిన వారిలో సగం మంది కేవలం సొంత అవసరాల కోసమే మిషన్లు వాడుతుం టారు తప్ప టైలరింగ్‌ వారి వృత్తి కాదు. అయినప్పటికీ మండలంలో 294 మందికి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ అయ్యాయి. కొన్నిచోట్ల గ్రామ వలంటీర్లకు డబ్బులు ఇచ్చి, మరికొన్నిచోట్ల అధికార పార్టీ నేతల సిఫారసుతో పథకాలు మంజూరు చేయించుకుంటున్నారని తెలిసింది. ఈ విషయం మండల స్థాయి అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.


ఆందోళనలు చేసినా పట్టించుకోని అధికారులు

మండలంలోని కుసర్లపూడిలో 31 మంది దర్జీలు జగనన్న చేదోడు పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా టీడీపీ మద్దతుదారులంటూ సచివాలయ సిబ్బంది వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. తరువాత వీరు గ్రామ సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేశారు. రెండో దఫాలో దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పథకం మంజూరుకాలేదు. అలాగే రోలుగుంట, శరభవరం, వడ్డిప తదితర గ్రామాల్లో చాలామంది రజకులకు చేదోడు పథకం మంజూరు చేయలేదు. మండల పరిషత్‌, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేసినా అధికారులు స్పదించలేదు.


టీడీపీ సానుభూతిపరుడినంటూ...: గగనం ప్రసాద్‌, టైలర్‌, కుసర్లపూడి

మూడున్నర దశాబ్దాల నుంచి టైలరింగ్‌ చేస్తున్నాను. తాత ముత్తాతల నుంచి ఇదే మా వృత్తి. టైలరింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. జగనన్న చేదోడు పథకం కోసం దరఖాస్తు చేయగా...టీడీపీ సానుభూతిపరుడినంటూ వలంటీరు, సచివాలయ సిబ్బంది కలిసి నా దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేదు.


చేయూత పథకంపై నాకు ఆసక్తి లేదట!?: రుత్తల వరహాలమ్మ, రోలుగుంట

జగనన్న చేయూత పథకం అమలుకు కావాల్సిన అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. అందరితో పాటు నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను. కొద్దిరోజుల తరువాత నాతోపాటు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. నాకు మాత్రం డబ్బులు రాలేదు. అధికారులకు ఫిర్యాదు చేయగా, చేయూత పథకం పొందడానికి నాకు ఆసక్తి లేదని చెప్పానని, అందుకే తిరస్కరించామని వలంటీరు, పంచాయతీ కార్యదర్శి బదులిచ్చారట. ఇంత ఎంత ఘోరం. సంక్షేమ పథకాన్ని ఎవరైనా వద్దనుకుంటారా?

Updated Date - 2020-09-19T16:43:30+05:30 IST