కరోనా లక్షణాలతో మృతి.. ఇంటికి తీసుకెళ్లకుండానే తెల్లవారుజామున అంత్యక్రియలు..!

ABN , First Publish Date - 2020-07-21T19:02:41+05:30 IST

కరోనా లక్షణాలతో మృతిచెందిన ఉపాధ్యాయుడిని ఊరిబయటే ఖననం చేసిన సంఘటన మంగపేటలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా

కరోనా లక్షణాలతో మృతి.. ఇంటికి తీసుకెళ్లకుండానే తెల్లవారుజామున అంత్యక్రియలు..!

ఇంటికి తీసుకురాకుండానే ఊరి బయటే ఖననం


మంగపేట (వరంగల్): కరోనా లక్షణాలతో మృతిచెందిన ఉపాధ్యాయుడిని ఊరిబయటే ఖననం చేసిన సంఘటన మంగపేటలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆదివాసీ టీచర్‌ జ్వరం, ఛాతీ నొప్పితో బాధపడుతుండగా ఈనెల 15న కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎంలో చేర్పించారు. అతని ఆరోగ్యపరిస్థితిపై సందేహం వ్యక్తంచేసిన వైద్యులు నమూనాలను సేకరించి కరోనా పరీక్షల కోసం పంపించారు.  19వ తేదీ వరకు కూడా ఫలితాన్ని వెల్లడించలేదు. ఈక్రమంలో కరోనా అనుమానితుడిగా భావిస్తూ ఆయనకు వైద్యులు సరైన చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు విమర్శించారు.  శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆ ఉపాధ్యాయుడు 19న రాత్రి మరణించాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఊరికి తరలించిన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లకుండానే తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఊరి బయటనే ఖననం చేశారు. 


ఉపాధ్యాయ సంఘంలో చురుకైన నాయకుడిగా ఉన్న ఆయన కడసారిచూపునకు కూడా నోచుకోకపోవడంతో అటు సన్నిహితులు, ఇటు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సకాలంలో చికిత్స అందించిక వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే గిరిజన ఉపాధ్యాయుడు మృతిచెందాడని యూటీఎఫ్‌ విమర్శించింది. మంగపేటలోని ఎమ్మార్సీ భవనం ఎదుట నిరసనకు దిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అఽధ్యక్ష, కార్యదర్శులు గొప్ప సమ్మారావు, కొండా చెంచయ్య, మండల ప్రధాన కార్యదర్శి ములుకల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ ఉద్యోగుల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో విద్యావనరుల శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఉపాధ్యాయుడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని  సంఘం జిల్లా నాయకుడు టి.నాగేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-21T19:02:41+05:30 IST