నౌకరీకి నజరానా

ABN , First Publish Date - 2020-08-09T07:33:37+05:30 IST

పరిశ్రమలను ప్రధానంగా వేధించే సమస్యలు రెండు.. ఒకటి, మానవ వనరుల కొరత.. అది నైపుణ్యం కావచ్చు! పాక్షిక నైపుణ్యం కావచ్చు! రెండోది, ప్రభుత్వానికి చెల్లించే పన్నులు, చార్జీల భారం! ఈ రెండు సమస్యలకు ఒకే నిర్ణయంతో పరిష్కారం చూపించింది ప్రభుత్వం!...

నౌకరీకి నజరానా

  • కంపెనీలు, పరిశ్రమలకు సర్కారు ఆఫర్‌
  • ‘ఉద్యోగాలు లోకల్‌’ విధానంతో ద్విముఖ వ్యూహం
  • మానవ వనరుల కొరతకు పరిష్కారం
  • ఆర్థిక భారం నుంచి పరిశ్రమలకూ ఉపశమనం
  • రాష్ట్రంలో ప్రధాన రంగాల్లో నిపుణుల కొరత
  • రెండేళ్లలో 50 లక్షలమంది నిపుణుల అవసరం
  • రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు 10 లక్షలకుపైనే
  • శిక్షణతోపాటు కొలువు ఇచ్చేందుకే కొత్త పాలసీ
  • పారిశ్రామిక హితమంటున్న పరిశ్రమ వర్గాలు
  • మార్గదర్శకాల తయారీలో పరిశ్రమల శాఖ
  • 3, 4 రోజుల్లో విధి విధానాలతో జీవో జారీ


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమలను ప్రధానంగా వేధించే సమస్యలు రెండు.. ఒకటి, మానవ వనరుల కొరత.. అది నైపుణ్యం కావచ్చు! పాక్షిక నైపుణ్యం కావచ్చు! రెండోది, ప్రభుత్వానికి చెల్లించే పన్నులు, చార్జీల భారం! ఈ రెండు సమస్యలకు ఒకే నిర్ణయంతో పరిష్కారం చూపించింది ప్రభుత్వం! అదే.. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం! నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారికి తమ తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తే.. నైపుణ్యాభివృద్ధికి అయిన ఖర్చునూ తిరిగి చెల్లిస్తుంది. వాటికి వ్యాట్‌, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ పరిహారం, విద్యుత్తు ఖర్చు పరిహారం, పెట్టుబడి రాయితీ వంటి అదనపు ప్రోత్సాహకాలూ ఇస్తుంది. దాంతో, అటు మానవ వనరుల కొరత తీరుతుంది. ఇటు, ఖర్చు భారమూ తగ్గుతుంది. బుధవారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన నూతన విధానమిది. త్వరలో ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సంబంధిత జీవో మూడు నాలుగు రోజుల్లో రానుంది. నిజానికి, ప్రస్తుతం టీఎ్‌సఐపా్‌సలో భాగంగా టీ-ఐడియా (తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అడ్వాన్స్‌) ఇన్సెంటివ్స్‌ స్కీమ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది.


షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీ-ప్రైడ్‌ (తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రాం ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద మరికొన్ని ప్రోత్సాహకాలు ఇస్తోంది. కొత్త పాలసీలో వీటికి అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపింది. అయితే, స్థానికులకు ఎంత ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పిస్తే, అంత ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాన్ని రూపొందించింది. ఈ విధానం కింద స్థానికులకు ఉద్యోగాలిచ్చిన శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రైవేటు పరిశ్రమలను రెండు రకాలుగా విభజించింది. కేటగిరీ-1 కింద ఉన్న పరిశ్రమలు పాక్షిక నైపుణ్యం (సెమీ స్కిల్డ్‌) ఉన్నవారికి 70 శాతం, నిపుణుల (స్కిల్డ్‌)కు 50 శాతంమేర ఉద్యోగాలు కల్పించాలని సూచించింది. ఇంతకు మించి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలను కేటగిరీ-2 కింద చేర్చింది. అంటే.. ఈ పరిశ్రమలు సెమీ స్కిల్డ్‌ వారికి 80 శాతం, స్కిల్డ్‌ వారికి 60 శాతం మేర ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ లక్ష్యాలను చేరుకుంటే ఇప్పటికే ఉన్న ప్రోత్సాహకాలతోపాటు అదనంగా వ్యాట్‌, సీఎస్టీ, ఎస్జీఎస్టీ పరిహారం, విద్యుత్తు ఖర్చు పరిహారం, పెట్టుబడి రాయితీ, నైపుణ్యాభివృద్ధికి అయ్యే ఖర్చు వంటి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది. నిజానికి, మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు కూడా స్థానికులకు కోటా విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ, దానిని పాటించని పరిశ్రమలపై పెనాల్టీలను విధిస్తున్నాయి. అనుమతులను రద్దు చేయడం, భూములను వెనక్కి తీసుకోవడం, బ్లాక్‌ లిస్టులో పెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా షరతులు అమలవుతున్నాయి. ఇటువంటి నిబంధనలు పెట్టడం రాజ్యాంగంలోని 16వ అధికరణను ఉల్లంఘించినట్లేనని అధికార వర్గాలు తెలిపాయి. అందుకే, రాష్ట్రంలో పరిశ్రమలకే ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిందని, స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే అదనపు ప్రోత్సాహకాలు వస్తాయని వివరించాయి.


రెండేళ్లలోనే 50 లక్షల మంది కావాలి

తెలంగాణ రాష్ట్రం 2022 సంవత్సరం నాటికి 50.9 లక్షల నైపుణ్య మానవ వనరుల (స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌) సమస్యను ఎదుర్కొంటుందని ‘నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎ్‌సడీసీ)’ అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభాలో నైపుణ్య మానవ వనరులు 1.3 శాతమేనని ఎన్‌ఎ్‌సడీసీ వెల్లడించింది. వాస్తవానికి, రాష్ట్రంలో నైపుణ్య మానవ వనరులు జనాభాలో 29.1 శాతం వరకు అవసరం. పాక్షిక నైపుణ్య మానవ వనరులు 11 శాతం వరకూ అవసరమవుతుండగా.. ప్రస్తుతం 2.7 శాతం వరకే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, డిఫెన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాల్లో నైపుణ్య మానవ వనరుల లభ్యత తక్కువగా ఉంది. ఈ కొరతను తీర్చుకోవడానికి స్థానికుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. టీఎ్‌సఐపాస్‌ కింద రాష్ట్రంలో 2014 డిసెంబరు నుంచి 12,161 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా 13,94,973 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని చెబుతోంది. అయితే.. వీరిలో స్థానికుల సంఖ్య తక్కువేనని ప్రభుత్వంతోపాటు పారిశ్రామిక వర్గాలు కూడా వివరిస్తున్నాయి. నైపుణ్య, పాక్షిక నైపుణ్య మానవ వనరులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. నిజానికి, రాష్ట్రంలో 10 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారని అనధికార అంచనా. 


మరింత ప్రోత్సహిస్తున్నాం

పరిశ్రమలను ఇబ్బంది పెట్టే పాలసీ కాదిది. మరింత ప్రోత్సహించడానికే తెస్తున్నాం. స్థానికులకు ఉద్యోగాలు కల్పించి, నైపుణ్య మానవ వనరులను పెంచాలన్న లక్ష్యంతో తయారు చేశాం. పరిశ్రమలు దీనిని అమలు చేయకపోయినా ఎలాంటి షరతులను విధించం. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెబుతాం. లక్ష్యాన్ని పూర్తి చేస్తేనే అదనపు ప్రోత్సాహకాలను అందిస్తాం.

- జయేష్‌ రంజన్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి


ఇది పారిశ్రామికహితంగా ఉంది 

అదనపు ప్రోత్సాహకాలతో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం పారిశ్రామికహితంగా ఉంది. ఈ విధానం వల్ల నైపుణ్య మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాం. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి పరిశ్రమలు, సంస్థలూ మరింత ముందుకు వస్తాయి. ఇది ప్రభుత్వానికి, పరిశ్రమలకు మేలు చేసే విధానం.

- మురళీధరన్‌, తెలంగాణ ఫిక్కీ చైర్మన్‌

Updated Date - 2020-08-09T07:33:37+05:30 IST