వివాహ వయోపరిమితి పెంపుపై మోదీ ఏమన్నారంటే.?

ABN , First Publish Date - 2021-12-21T22:53:33+05:30 IST

వివాహ వయో పరిమితిని 21 ఏళ్ల పెంచాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై..

వివాహ వయోపరిమితి పెంపుపై మోదీ ఏమన్నారంటే.?

న్యూఢిల్లీ: వివాహ వయో పరిమితిని 21 ఏళ్ల పెంచాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రయోగరాజ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆడకూతుళ్ల సాధికారతకు, విపక్ష నిర్మూలనకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తోందని చెప్పారు. ''ఆడకూతుళ్లు చదువుకునేందుకు తగినంత సమయం, సమానావకాశాలు కోరుకుంటున్నారు. అందుకోసం వారి వివాహ వయో పరిమితిని 21 ఏళ్లకు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం'' అని అన్నారు. అయితే, ప్రభుత్వం నిర్ణయం కొందరికి బాధ కలిగిస్తోందంటూ ప్రత్యర్థి పార్టీలపై విసుర్లు విసిరారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ''బేటీ బచావో బేటీ పడావో''తో చాలా రాష్ట్రల్లో ఆడపిల్లల సంఖ్య పెరిగిందని ప్రధాని అన్నారు. గర్భిణీ స్త్రీల ఇమ్యునైజేషన్, ఆసుపత్రుల్లోనే ప్రసవం, ప్రెగ్నన్సీ సమయంలో న్యూట్రిషియన్‌పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద ప్రెగ్రన్సీ సమయంలో మహిళల కోసం బ్యాంకుల్లో రూ.5,000 డిపాజిట్ చేస్తున్నామని, తద్వారా వారు తగిన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోగలుగుతారని చెప్పారు.


ఎస్‌హెచ్‌జీలకు రూ.1,000 కోట్లు నగదు బదిలీ

ప్రయోగరాజ్‌లో జరిగి కార్యక్రమంలో భాగంగా యూపీలోని స్వయం సహాయక గ్రూపులకు (ఎస్‌హెచ్‌జీ) రూ.1,000 కోట్లు విడుదల చేశారు. ఇందువల్ల 16 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. బాలికలకు చేయూత నిచ్చేందుకు రూ.20 కోట్లను కూడా మోదీ విడుదల చేశారు. ఇందువల్ల లక్ష మంది బాలికలకు లబ్ధి చేకూరనుంది.


గూండాలను ఎక్కడుంచాలో అక్కడుంచాం..

సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ వీధుల్లో గూండాల రాజ్యం నడిచేదని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి రాగానే గూండాలను ఎక్కడుంచాలో అక్కడ ఉంచారని ప్రశంసించారు. మాతృమూర్తుల శక్తికి ప్రయోగరాజ్ ఒక నిదర్శనమని, గంగ-యమున-సరస్వతీ నదుల సంగమ భూమి ప్రయోగరాజ్ అని ప్రధాని అన్నారు.

Updated Date - 2021-12-21T22:53:33+05:30 IST