ధాన్యం.. దైన్యం

ABN , First Publish Date - 2021-11-25T06:43:21+05:30 IST

సన్నరకం (బీపీటీ) ధాన్యాన్ని కొనే నాథుడు లేక రైతులు బిత్తర చూపులు చూస్తున్నారు. ఇటు మద్దతు ధర లేక, అటు పెట్టుబడి ఖర్చు భారం పెరిగి ఏమి చేయాలో పాలుపోనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా రు.

ధాన్యం.. దైన్యం
వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

 సన్నరకం ధాన్యం కొనేవారేరీ?

అవంతీపురం మార్కెట్‌ యార్డులో 20వేల క్వింటాళ్ల సన్నరకం ధాన్యం

 10 రోజులుగా కొనుగోలు కోసం రైతుల నిరీక్షణ 

వరుస వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు 

 సన్నరకం (బీపీటీ) ధాన్యాన్ని కొనే నాథుడు లేక రైతులు బిత్తర చూపులు చూస్తున్నారు. ఇటు మద్దతు ధర లేక, అటు పెట్టుబడి ఖర్చు భారం పెరిగి ఏమి చేయాలో పాలుపోనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా రు. దొడ్డు రకం ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధర ప్రకటి స్తున్నా, సన్న రకాలను మాత్రం పట్టించుకోకపోవడంతో ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ప్రైవేట్‌ వ్యాపారులు సైతం కొనుగోలు చేసేందు కు ముందుకు రావడంలేదు. వారం రోజులుగా కురుస్తున్న జల్లులతో ఆరబెట్టిన కుప్పపోసిన ధాన్యం రాసుల కిందకు నీరు చేరి మొలకలెత్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

- మిర్యాలగూడ

మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డు లో 120మందికి పైగా రైతుల 20వేల క్వింటాళ్ల సన్నరకం ధాన్యం పేరుకు పోయింది. రైతులు మార్కెట్‌ యార్డుకు తెచ్చి 10 రోజులు అవుతున్నా కొను గోలు చేసేవారు లేక నిరీక్షిస్తూనే ఉన్నారు. షెడ్లలో స్థలంలేకపోవడం తో బయట పోసిన రాశులకిందకు వర్షపు నీరుచేరింది. వరుస జల్లులతో ఆరబెట్టే సమయం కూడా లేకపోవడంతో ధాన్యం రాశులకింద తడిసి ధాన్యం మొలకెత్తింది. రెండు రోజులుగా వాతావరణం పొడిబారడంతో ధాన్యం ఆరబెట్టేందుకు పట్టాలు తొలగించిన రైతుల కు మొలకలెత్తుతున్న ధాన్యం చూసి కంట నీరు బెట్టుకుంటున్నా రు. రూ.500 ఇచ్చినా కూలీలు దొరక్కపోవడంతో  రైతులు ట్రాక్టర్ల గొర్రును ఉపయోగించి ఆరబెట్టుకుంటున్నారు. సుమారు వంద బస్తాలకు పైగా ధాన్యం మొలకలెత్తి, నల్లబారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీటీ వరి కోత లు సుమారు 80శాతం పూర్తయినప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో పండించిన పంటను విక్రయించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వర్షాలతో కోతలు నిలిపివేత 

వర్షాల వల్ల వారం రోజులుగా కోతలు నిలిపివేశారు. లేదంటే 20శాతం కోతలు కూడా పూర్తయ్యేవని రైతులు చెబుతున్నారు. గతంలో వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో 93 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 14కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. వరికోతలు పూర్తవుతున్నప్పటికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని, తక్షణం మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌యార్డు గేటు ఎదుట రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. 


వారం రోజులుగా మార్కెట్‌లోనే.. : లావుడి సూర్యానాయక్‌, రైతు, తుంగపాడ 

బీపీటీ ధాన్యాన్ని మిల్లర్లు క్వింటా రూ.1500కే అడిగారు. 200 బస్తాలు తీసుకుని మార్కెట్‌ యార్డ్‌కు వచ్చి వారం రోజులవుతుంది. పట్టాలు కప్పినా, రాశుల కిందికి వర్షం నీరు చేరి మొలకెత్తింది. ప్రతిరోజూ ఆరబెట్టి రాశి పోయడానికి రూ.2000 ఖర్చు అవుతుంది. వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి.

Updated Date - 2021-11-25T06:43:21+05:30 IST