ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-08T06:24:44+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని, లబ్ధిపొందాలని మండల ప్రత్యేక అధికారి భాస్కరరావు, తహసీల్దార్‌ ఎం.పాల్‌ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
వలసపల్లి గ్రామసభలో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి భాస్కరరావు

ముసునూరు, డిసెంబరు 7: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని, లబ్ధిపొందాలని మండల ప్రత్యేక అధికారి భాస్కరరావు, తహసీల్దార్‌ ఎం.పాల్‌ అన్నారు. చెక్కపల్లి, వలసపల్లి, ముసునూరు, చింతలవల్లిలో ఉన్న రైతుభరోసా కేంద్రాల వద్ద వ్యవసాయ, పీఏసీఎస్‌ అధికారులు మంగళవారం గ్రామసభలను నిర్వహించారు.  వలసపల్లి గ్రామసభలో రైతులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాది అధికారులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని పరిశీలించగా, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించామని, అయితే పూర్తిస్థాయిలో నగదును చెల్లించకుండా ధాన్యం ముక్క అవుతుందని, మిల్లర్లు చెప్పారని బస్తాకు నాలుగు నుంచి ఐదు కేజీల వరకు తగ్గించి, డబ్బులు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.  ఇప్పుడు కూడా  ధాన్యం ముక్కఅవుతుందని డబ్బులు తక్కువ వేస్తే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వేయమని రైతులు స్పష్టం చేశారు. దీనిపై స్పెషల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరువాత పూర్తిస్థాయిలో నగదు చెల్లిచటం జరుగుతుందన్నారు. ఎటువంటి కోతలు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. తేమ శాతం 17 ఉండాలని, ఏ గ్రేడ్‌ రకం క్వింటాకు రూ 1960, సాధారణ రకం క్వింటాకు రూ.1940 ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులు తమ పంటకు గిట్టుబాటు ధరను  పొందాలంటే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని భాస్కరరావు కోరారు.  సర్పంచ్‌లు కొండేటి విజయలక్ష్మి, రాజబోయిన శ్రీదేవి, తల్లిబోయిన రాధిక, పిల్లి సత్యనారాయణ, ఏవో శివశంకర్‌, వీఆర్వో మస్తాన్‌రావు, పీఏసీఎస్‌ కార్యాదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T06:24:44+05:30 IST