ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-06-18T04:33:03+05:30 IST

రైతుల నుంచి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని

ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
మంత్రికి ప్లాస్టిక్‌ రోల్‌ అందజేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డికి కొండా విజ్ఞప్తి

ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి :  రైతుల నుంచి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మంత్రిని కలిసి రాష్ట్రంలో, ముఖ్యంగా వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయక రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. కొనుగోళ్లు సక్రమంగా జరగక వర్షాలకు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని మంత్రికి తెలిపారు ఉమ్మడిజిల్లాలో తాండూరు, పెద్దేముల్‌, యాలాల, దోమ, కులకచర్ల, బుల్కాపూర్‌, సర్దార్‌నగర్‌, మహేశ్వరం తదితర కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన వివరించారు. రైతులు పండించిన ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. హామీ నిలబెట్టుకోవాలని ఆయన మంత్రికి గుర్తుచేశారు. గోనె సంచులు, టార్పాలిన్‌ షీట్లు సరిపడా లేక రైతులు ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయక దోమ మండలం, పాలెపల్లిలో రైతులు ఽధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేయగా, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లిలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని మంత్రికి గుర్తు చేశారు. గోదాంలు సరిపడా లేక, రైస్‌ మిల్లుల్లో స్థలం లేక రైతులు ధాన్యం బస్తాలను తమ ఇళ్లలోనే ఉంచుకునే పరిస్థితి నెలకొందని, ప్రతి బస్తాకు 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలు రాకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటేనే రైతులకు లాభం ఉంటుందని ఆయన మంత్రికి వివరించారు. తాను చెప్పిన అంశాల పట్ల మంత్రి వెంటనే స్పందించి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని తాత్కాలికంగా కాపాడుకునేందుకు తాము ఆలోచించిన స్ట్రెచ్‌ ఫిల్మ్‌రోల్‌ విధానం గురించి మంత్రికి ఆయన వివరించి ఈ విధానం రైతులందరికీ తెలిసేలా, ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.



Updated Date - 2021-06-18T04:33:03+05:30 IST