ఇస్తారా? ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-08-19T05:42:30+05:30 IST

‘ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తాం. మిల్లుల తరలింపునకు సంబంధించి రవాణా చార్జీలు చెల్లిస్తాం’..అంటూ గత ఖరీఫ్‌నకు ముందు అధికారులు ప్రకటనలు ఇచ్చారు. కానీ ధాన్యం బిల్లుల చెల్లింపులో చుక్కలు చూపించారు. ఈ ఖరీఫ్‌ సమీపించినా రవాణా చార్జీలు ఇంతవరకూ చెల్లించలేదు.

ఇస్తారా? ఇవ్వరా?
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలిస్తున్న దృశ్యం




అందని ధాన్యం రవాణా చార్జీలు

గత ఖరీఫ్‌లో రూ.24 కోట్ల బకాయిలు

ఆశగా ఎదురుచూస్తున్న రైతులు

(టెక్కలి)

‘ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తాం. మిల్లుల తరలింపునకు సంబంధించి రవాణా చార్జీలు చెల్లిస్తాం’..అంటూ గత ఖరీఫ్‌నకు ముందు అధికారులు ప్రకటనలు ఇచ్చారు. కానీ ధాన్యం బిల్లుల చెల్లింపులో చుక్కలు చూపించారు. ఈ ఖరీఫ్‌ సమీపించినా రవాణా చార్జీలు ఇంతవరకూ చెల్లించలేదు. జిల్లావ్యాప్తంగా రూ.24 కోట్ల వరకూ రైతులకు బకాయిలు ఉన్నాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప చెల్లింపులకు మాత్రం మోక్షం కలగడం లేదు. అధికారులు సాంకేతిక కారణాలు చూపుతూ తప్పించుకుంటున్నారు. దీనిపై రైతులు పెదవి విరుస్తున్నారు. రవాణా చార్జీలపై దాదాపు ఆశలు వదులుకుంటున్నారు. 

 ఇదీ పరిస్థితి

గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 256 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. తొలిసారిగా రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రక్రియ చేపట్టారు. డీసీఎంఎస్‌, వెలుగు, పీఏసీఎస్‌, జీసీసీ, సీసీపీ తదితర సంస్థలు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నాయి. ధాన్యం కొనుగోలు చేసే ప్రొక్యూర్‌మెంట్‌ కేంద్రాల నుంచి సంబంధిత మిల్లులకు తరలించేందుకు రైతులకు రవాణా చార్జీలను సైతం చెల్లించనున్నట్టు తెలిపారు. క్వింటాకు రూ.30 వంతున చెల్లించనున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో  రవాణా చేసే వాహనాల వివరాలతో పాటు సంబంధిత డ్రైవర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా నంబర్లను సైతం సేకరించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు.  కానీ నెలలు గడుస్తున్నా రవాణా చార్జీలు మాత్రం చెల్లించలేదు. దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రవాణాకు సంబంధించి రూ.24 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రైతులు, రైతు సంఘం ప్రతినిధులు ఎప్పటికప్పుడు అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నా ఫలితం లేకపోయింది. 

 పరిశీలిస్తున్నాం

రవాణా చార్జీల చెల్లింపునకు సంబంధించి చర్యలు చేపడుతున్నాం. ఎక్కడైతే ధాన్యం కొనుగోళ్లు జరిగాయో... వారి నుంచి ఇంకా క్లయిమ్‌లు రాలేదు. రైతులు విక్రయించిన ధాన్యం ఎంత? గోనెసంచుల వినియోగం, రవాణాకు వినియోగించిన వాహనాలు, ఇతరత్రా అంశాలు లోతుగా పరిశీలిస్తున్నాం. ప్రక్రియ పూర్తయిన వెంటనే బకాయిలు చెల్లిస్తాం. 

- జయంతి, పౌరసరఫరాల శాఖ డీఎం, శ్రీకాకుళం




Updated Date - 2021-08-19T05:42:30+05:30 IST