ధాన్యం తూకం.. రైతుకు భారం

ABN , First Publish Date - 2021-05-15T05:51:30+05:30 IST

ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను విక్రయించేందుకు అన్నదాతకు తిప్పలు తప్పడం లేదు. నారు పోసి పంట పండించి గింజ అమ్ముకునే వరకు పడరాని పాట్లు పడుతున్నారు. అకాల వర్షాలు, కేంద్రాల వద్ద అఽధికారులు, మిల్లుల వద్ద యజమానులు పెడుతున్న కొర్రీలకు తోడు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం కూడా రైతులకు భారంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి.

ధాన్యం తూకం.. రైతుకు భారం
రుద్రంగి కొనుగోలు కేంద్రలో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు

 -  కొనుగోలు కేంద్రాల వద్ద క్వింటాల్‌కు రూ.35 నుంచి 50 వసూలు 

- మూడేళ్లుగా అందని హమాలీ చార్జీలు 

- తాలు పేరిట అదనంగా 5 కిలోల తూకం

- కల్లాల్లో పేరుకుపోతున్న ధాన్యం 

- వెంటాడుతున్న అకాల వర్షం  

- జిల్లాలో 235 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

- కొనుగోలు లక్ష్యం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

- ఇప్పటివరకు 88,076 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు 

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను విక్రయించేందుకు అన్నదాతకు తిప్పలు తప్పడం లేదు. నారు పోసి పంట పండించి గింజ అమ్ముకునే వరకు పడరాని పాట్లు పడుతున్నారు. అకాల వర్షాలు,  కేంద్రాల వద్ద అఽధికారులు, మిల్లుల వద్ద యజమానులు పెడుతున్న కొర్రీలకు తోడు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం కూడా రైతులకు భారంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరుకుపోతున్నా తూకం వేయడంలోనూ, మిల్లులకు తరలించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు తాలు పేరిట ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేసి నష్టానికి గురిచేస్తున్నారు. వివిధ కొనుగోలు కేంద్రాల్లో  తాలు పేరిట క్వింటాల్‌కు మూడు కిలోల నుంచి ఐదు కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది.  మరోవైపు తేమ, తాలు ఉంటే మిల్లర్లు పది బస్తాల వరకు కోత పెడుతున్నారు. ఆ భారాన్ని కూడా రైతుల పైనే వేస్తున్నారు. భారం పడినా తూకంలో జాప్యం జరుగుతోంది. రైతులు ధాన్యం తీసుకొచ్చి 15 నుంచి 20 రోజుల వరకు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతున్నారు. 


రైతులపై హమాలీ భారం

జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో  రైతుల నుంచి ముందుగానే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల నుంచి తీసుకుంటున్న హమాలీ డబ్బులు రైతులకు చెల్లిస్తామని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నా మూడేళ్లుగా రైతులకు చెల్లించిన దాఖలాలు లేవు. జిల్లాలో క్వింటాల్‌ ధాన్యం తూకం వేసి లోడ్‌ చేసేవరకు రైతుల వద్ద రూ.33 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు తూకం భారం కూడా తప్పడం లేదు. హమాలీల కొరత తీవ్రంగా ఉండడంతో హమాలీల చార్జీలు రైతులు చెల్లించక తప్పడం లేదు. 


  కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం  

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోతోంది.  మరోవైపు వడగళ్ల వర్షాలతో   ధాన్యం తడిసి నష్టపోతున్నారు. ఇప్పటికే కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. ప్రస్తుత రబీలో 1.68 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా 84,109 మంది రైతులు 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో 4.17 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో జిల్లా పౌరసరఫరాల శాఖ రూ.3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అంచనా వేసి 235 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు జిల్లాలో 88 వేల 062 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఐకేపీ నుంచి 20,294 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల ద్వారా 61,027 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంస్‌ ద్వారా 2,891 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 906 మెట్రిక్‌ టన్నులు, మార్కెట్‌ యార్డులో 2,956 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. రూ. 183.53 కోట్ల విలువైన ధాన్యాన్ని 13,265 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 5,336 మంది రైతులకు రూ.66.86 కోట్లు చెల్లించారు. రైతులకు రూ.36.88 కోట్లు బకాయిలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లలో లక్ష మెట్రిక్‌ టన్నులు కూడా పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల వద్ద 2 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం ఉండిపోయింది. ఈ సారి జూలై వరకు కొనుగోళ్లు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


మూడేళ్లుగా హమాలీ డబ్బులు రాలేదు

 - దేశవేని రాజనర్సయ్య, రైతు రుద్రంగి

హమాలీలకు తూకం వేసినందుకు డబ్బులు చెల్లిస్తున్నాం. గతేడాది క్వింటాల్‌కు రూ.36 ఉంటే ఇప్పుడు రూ.43 చెల్లిస్తున్నాం. తూకం వేసిన ధాన్యానికి ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించక మూడు సంవత్సరాలు అవుతోంది. ఐదు రోజులుగా లారీలు రావడం లేదని కొనుగోళ్లు నిలిపివేశారు.


ధాన్యం బస్తాకు రూ.18 ఇస్తున్నాం

- గోలి గాలయ్య, రైతు సిరిసిల్ల 

సిరిసిల్ల వ్యవసాయమార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న హమాలీలకు ఒక ధాన్యం  బస్తా తూకం వేస్తే రూ. 18 ఇస్తున్నాం. గతేడాది ఒక బస్తాకు రూ.15 తీసుకున్న హమాలీలు కూలి గిట్టుబాటు కావడం తేదని బస్తాకు రూ.3   పెంచారు. రైతులపైనే భారం పడుతోంది.  


తూకం వేసిన వెంటనే డబ్బులు 

- కాతం దేవయ్య, రైతు సిరిసిల్ల 

సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పని చేస్తున్న హమాలీలు ధాన్యం తూకం వేయడానికి కూలి పెంచడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తీసుకున్న కూలి కంటే ఈ సారీ హమాలీలు పనులు లేవంటూ బస్తాకు రూ.18 రేటు పెంచడంతో క్వింటాల్‌ ధాన్యానికి రూ.45 చెల్లిస్తున్నాం. హమాలీలు కూలి పెంచడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.   


 డబ్బులు చెల్లిస్తేనే తూకం 

- ఆరుట్ల సత్యంరెడ్డి, రైతు- పదిర

మాది ఎల్లారెడ్డిపేట మండలం పదిర.   క్వింటాలుకు రూ.35 చెల్లిస్తేనే హమాలీలు తూకం పెడుతున్నారు. మొత్తం 397 బస్తాలకు 158 క్వింటాళ్ల ధాన్యం అయ్యింది. రూ.5,530 హమాలీ కూలి ఇచ్చిన. లారీ లోడు చేసేటప్పుడు తాడుకు డబ్బులు తీసుకుంటుండ్రు. హమాలీ చార్జీలను ప్రభుత్వం తిరిగి  చెల్లించడం లేదు. హమాలీల ఖర్చు మీద పడుతోంది.


Updated Date - 2021-05-15T05:51:30+05:30 IST