సచివాలయ పరీక్షలకు.. సన్నద్ధం.. రేపటి నుంచి ... 26 వరకు పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-19T15:37:55+05:30 IST

గ్రామ, వార్డు సచివాల యాల పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తారీఖు వరకు జరగనున్న రాత పరీక్షలను కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టింది.

సచివాలయ పరీక్షలకు.. సన్నద్ధం.. రేపటి నుంచి ... 26  వరకు పరీక్షలు

తొలిరోజు పరీక్షకు 38 వేల మంది అభ్యర్థులు

నేటి నుంచి పరీక్ష సామగ్రి కేంద్రాలకు తరలింపు

ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాటు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాల యాల పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తారీఖు వరకు జరగనున్న రాత పరీక్షలను కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. గుంటూరు, నరసరావుపేట, తెనాలి, మాచర్ల, బాప ట్లను ఐదు క్లస్టర్లుగా చేశారు. ఒక్కో క్లస్టర్‌లో సమీప మండలాలను చేర్చారు. తద్వారా ఆ మండలాల అభ్యర్థులు వారికి సమీపంలోని పరీక్ష కేంద్రంలోనే పరీక్ష రాసేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి, కె.శ్రీధర్‌రెడ్డి, తెనాలి, నరసరావుపేట సబ్‌ కలెక్టర్లు, జడ్పీ సీఈవో, జిల్లా విద్యా శాఖాధికారి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 14 కేటగిరీలలో సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. నాలుగు కేటగిరీలు (పంచాయితీ సెక్రటరీలు) పోస్టులకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.


ఈ నెల 20వ తేదీన తొలి రోజునే 38 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా  212 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క గుం టూరు నగరంలోనే 81 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద వీడియోగ్రఫీ, సీసీ టీవీలో రికార్డింగ్‌ చేస్తారు. ఇందుకోసం రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని అభ్యర్థులకు సూచిం చారు. ఉదయం పరీక్షకు 10 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 12.30 గంటలకే రావాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు వారి వెంట మాస్కు, శానిటైజర్‌, చిన్న వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవచ్చు. అలానే బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నులు, ఐడీ కార్డు, హాల్‌టిక్కెట్‌ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌ గదుల్లో పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. సచివాలయ పరీక్ష దృష్ట్యా 144 సెక్షన్‌ని అమలు చేస్తున్నారు. అలానే సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లన్ని మూసేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. రెండోరోజు నుంచి పరీక్షలు కేవలం గుంటూరు, పెదకాకానిలో మాత్రమే జరుగుతాయి. ఇంచుమించు 17 వేలమంది ఉద్యోగులను ఈ పరీక్షల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ప్రతీకేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.   


సచివాలయ పరీక్షలకు..  ప్రత్యేక బస్సులు 

ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న గ్రామ, వార్డు సచి వాలయాల పరీక్షల కోసం రీజియన్‌వ్యాప్తంగా అదనపు బస్సులు నడప నున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌టీపీ రాఘవకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  గుంటూరు -1 డిపో నుంచి 19, గుంటూరు-2 డిపో నుంచి 21, రేపల్లె నుంచి 3, తెనాలి నుంచి 8, మంగళగిరి నుంచి 10, పొన్నూరు నుంచి 8, బాపట్ల నుంచి 5, నరసరావుపేట నుంచి 13, మాచర్ల నుంచి 6, చిలకలూరిపేట నుంచి 7, సత్తెనపల్లి నుంచి 6, పిడుగురాళ్ళ నుంచి 5, వినుకొండ నుంచి 4 అదనపు బస్సులు నడుస్తాయన్నారు.  

Updated Date - 2020-09-19T15:37:55+05:30 IST