ఎన్నికల బరిలో గ్రామ వలంటీర్.. TDP నుంచి పోటీ

ABN , First Publish Date - 2021-11-04T18:43:08+05:30 IST

ఆయా స్థానాల్లో పోటీచేసేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు...

ఎన్నికల బరిలో గ్రామ వలంటీర్.. TDP నుంచి పోటీ

అనంతపురం/పెనుకొండ : అనంతపురం జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్లు వేస్తున్నారు. ముఖ్యంగా పెనుకొండ నగర పంచాయతీలోని 20 వార్డులు, అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్, రాయదుర్గం మున్సిపాలిటీలోని ఒకటో వార్డుతోపాటు చిలమత్తూరు జడ్పీటీసీ, 16 ఎంపీటీసీలు, 4 సర్పంచ్, 175 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా స్థానాల్లో పోటీచేసేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా రాజకీయ పార్టీల స్థానిక నాయకులు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నామినేషన్లలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.


పెనుకొండ నగర పాలక పంచాయితీ ఎన్నికల బరిలో గ్రామ వలంటీరు సబీరాబాను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బుధవారం నాడు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి సమక్షంలో ఆమె బీ-ఫారం అందుకున్నారు. ఈ క్రమంలో 8వ వార్డుకు పోటీ చేస్తున్నట్లు వలంటీర్ మీడియాకు వెల్లడించారు. కాగా.. ఇప్పటికే పలువురు గ్రామ, వార్డు వలంటీర్లు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా గెలిచిన విషయం విదితమే. అయితే.. వలంటీర్‌గా పనిచేస్తూ టీడీపీ తరఫున పోటీచేస్తుండటంతో జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-11-04T18:43:08+05:30 IST