EWS రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడంతో.. గ్రామ,వార్డు సచివాలయాల పోస్టుల్లో ఎన్ని వేల ఉద్యోగాలు కోల్పోయారో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-28T15:38:19+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల..

EWS రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడంతో.. గ్రామ,వార్డు సచివాలయాల పోస్టుల్లో ఎన్ని వేల ఉద్యోగాలు కోల్పోయారో తెలిస్తే..

అగ్రవర్ణమంటే అలుసా?

కేంద్రం అనుగ్రహించినా రాష్ట్రం ఆగ్రహం

అమలేకాని 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా

సచివాలయాల్లో దాదాపు లక్షన్నర పోస్టులు

10 శాతం అంటే దాదాపు 13 వేల పోస్టులు

జగన్‌ తీరుతో అవన్నీ కోల్పోయిన వైనం

కాపుల రిజర్వేషన్లకు జగన్‌ ప్రభుత్వం చెక్‌...

ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంస్థలకు నిధులు కట్‌

రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్‌పైనా నిర్దయ

పండగ రోజు సంక్రాంతి కానుకలకూ స్వస్తి 

అందని ద్రాక్షలా ఉన్నత విద్య, విదేశీ విద్య

మందహాసం మరిచిన ‘మధ్యతరగతి’


సుమారు 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ప్రభుత్వరంగ పోస్టులు, దాదాపు రెండున్నర లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసింది. అయితే, అగ్రవర్ణ పేదలకు ఈ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడంతో... సచివాలయాల పోస్టుల్లో 13 వేల ఉద్యోగాలు, వలంటీర్ల నియామకాల్లో 25 వేల పోస్టులను ఈ వర్గాలు కోల్పోయాయి. 


బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గత ప్రభుత్వం రూ.285 కోట్ల బడ్జెట్‌ విడుదల చేయడమేకాకుండా.. ఆ నిధులు వినియోగమయ్యేలా చూసింది. చదువు, శిక్షణ, ఉపాధి, వివాహం, చేయూత, రుణం, గౌరవప్రద మహాప్రస్థానం.. ఇలా బ్రాహ్మణ కులంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ లబ్ధి చేకూర్చింది. జగన్‌ ప్రభుత్వం   ప్రతి బడ్జెట్‌లో కేవలం వంద కోట్లే పెడుతూ, వాటినీ విడుదలచేయడం లేదు. చివరకు నవరత్నాల బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ సంస్థగా కార్పొరేషన్‌ను మిగిల్చింది.


పేరుకు మాత్రం రాష్ట్రంలో రెడ్డి, కమ్మ, క్షత్రియ కార్పొరేషన్లు! కానీ, వాటికి బడ్జెట్‌లో పైసా ఉండదు. నోటితో నవ్వుతూ..నొసలతో వెక్కిరించినట్టుగానే ఇన్నాళ్లుగా అగ్రవర్ణ పేదల పట్ల జగన్‌ ప్రభుత్వం వైఖరి ఉంది. కక్ష కట్టినట్టు ఈ వర్గాలకు దక్కే ప్రతి లబ్ధిపైనా ఎందుకనో కత్తి దూస్తున్నారు. గత ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం పెట్టి, సమర్థంగా ఎన్నో కార్పొరేషన్లు నడిపిస్తే... ఇప్పుడు నిధులు ఇవ్వకుండా వాటిని ఎండబెడుతున్నారు. కరోనాలో ఆదుకోకపోగా, వారికి అందుతున్న పండగ కానుకలనూ నిలిపివేశారు. చివరకు.. స్కూలు అడ్మిషన్‌ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్‌ వరకు ఈ వర్గాలకు కేంద్రం వర్తింపజేసిన 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లనూ రాష్ట్రంలో అమలుచేయడం లేదు.. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణాల్లో పుట్టి, సమాజంలో మధ్యతరగతి పేరిట పుట్టెడు కష్టాలు మోస్తున్న పేదలపై రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందా?... రిజర్వేషన్లను నోచుకోక, ప్రభుత్వ సంక్షేమఫలాలు దక్కక నిర్వేదంలో బతుకుతున్న ఈ వర్గాలను కేంద్రం అనుగ్రహించినా.. రాష్ట్రం కనికరించడం లేదా?.. అంటే అవుననే అంటున్నాయి అగ్రవర్ణ పేద వర్గాలకు రాష్ట్రంలో దక్కని పదిశాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా లెక్కలు. భారీఎత్తున భర్తీ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల్లో ఈ కోటాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనో పక్కనపెట్టింది. దానివల్ల అప్పట్లో నింపిన దాదాపు లక్షన్నర పోస్టుల్లో అగ్రవర్ణ పేదలుసుమారు 13 వేల పోస్టులు కోల్పోయారు. ఇంత మెగా నోటిఫికేషన్‌ ఆ తర్వాత ప్రభుత్వం ఇవ్వకపోయినా.. అడపాదడపా చేపడుతున్న ఉద్యోగుల భర్తీలోనూ ఈ వర్గాలకు అన్యాయమే చేసింది.


ఆర్థిక కష్టాల్లో పడిపోయిన దరిమిలా ముఖ్యమైన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం భవిష్యత్తులో కనిపించడం లేదు. ఇలాంటి దశలో తాపీగా ఈడబ్ల్యూఎస్‌ అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై అగ్రవర్ణ పేద యువత అసహనం వ్యక్తం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీయేతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కేంద్రప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ 10 శాతం అమలు చేయాలంటూ చట్టం చేసింది. ఆ రిజర్వేషన్లను ఆయా ఓసీ కేటగిరీలకు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవచ్చని సూచించింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఈ రిజర్వేషన్లను జనాభా ఎక్కువగా ఉండి, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులకు 5 శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతంగా వర్గీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో అసెంబ్లీలో చట్టం చేసింది.


అప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోకపోవడంతో, ఈలోపు కాపుల ప్రయోజనాలు కాపాడాలని అప్పటి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్తగా వైసీపీ ప్రభుత్వం..చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్గీకరణ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై అప్పట్లో అగ్రవర్ణ పేదల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తినా.. మొండిగా ముందుకెళ్లింది. దీంతో ప్రభుత్వం తమ పట్ల ఎందుకింత నిర్దయతో ఉన్నదో అర్థం కావడం లేదని ఈ వర్గాలు వాపోతున్నాయి.  



ఎన్నెన్ని పథకాలో...

అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణుల్లో చాలా మంది కడు దారిద్య్రం అనుభవిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం వారికోసం కార్పొరేషన్‌ ఏర్పాటుచేసింది. ఈ కార్పొరేషన్‌ ద్వారా విస్తృత ప్రయోజనాలు కల్పించారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన ఈ కార్పొరేషన్‌ ద్వారా చేపట్టిన కార్యక్రమాలూ అంతే ఘనంగా ఉండేది. బాబు హయాంలో 1,54,182 మంది బ్రాహ్మణులు కార్పొరేషన్‌ అందించే వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందారు. గాయత్రి పథకం అందులో ఒకటి. ప్రభుత్వ, గుర్తింపు పొందిన స్కూళ్లు, కళాశాలల్లో ప్రతిభ కనపరిచిన 761 మంది బ్రాహ్మణ విద్యార్థులకు రూ.76 లక్షలు పారితోషికం అందించారు. భారతి పథకంలో పేద పిల్లలకు ఆర్థికసాయం అందించారు. ఇలా 88,682 మందికి రూ.119.22 కోట్లు పంపిణీ చేశారు. వేదవ్యాస పథకం కింద వేదిక్‌ విద్య అభ్యసిస్తున్నవారిలో 155 మందికి రూ.21.60 లక్షలు అందించారు. వశిష్ట పథకం పోటీపరీక్షలకు సిద్ధమయ్యే 377 మందికి రూ.1.22 కోట్ల లబ్ధి చేకూరింది.


ద్రోణాచార్య పథకం ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 173 మందికి రూ.38 లక్షలు, చిన్న పరిశ్రమలు స్థాపించుకునేందుకు చాణక్య పథకం ద్వారా ఔత్సాహికుల కోసం 1501 మందికి రూ.21.96 కోట్లు, కశ్యప అండ్‌ అహల్య పథకం కింద బ్రాహ్మణ అనాధలు, భర్త చనిపోయినవారికి, దివ్యాంగులకు భోజనం, వసతి కోసం 45,821 మందికి రూ.43.34 కోట్లు, గరుడ పథకం ద్వారా మరణించిన వారి పార్ధివదేహానికి మట్టి ఖర్చుల కోసం 3093 మందికి రూ.3.09 కోట్లు అందించారు. కల్యాణమస్తు పథకం ద్వారా పెళ్లికానుక అందించారు. దీంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్‌ రూ.50 కోట్లతో క్రెడిట్‌ సొసైటీని ఏర్పాటుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 45,097 మందికి రుణాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించింది. ఈ పథకాలన్నీ ఇప్పుడు స్మృతులుగా మిగిలిపోతున్నాయి.


ఆత్మీయత కరువై..

గ్రామ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ ఆర్యవైశ్యులు అని చెబుతారు. మొదటి నుంచి వ్యాపారమే వృత్తిగా భావించే ఈ సామాజిక వర్గంలో ఉన్నత చదువులకెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉందని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. ఆర్యవైశ్య సామాజికవర్గం కోసం కార్పొరేషన్‌  ఏర్పాటుచేసి మొదట బడ్జెట్‌లోనే రూ.30 కోట్లు కేటాయించింది. ఆ తర్వా త రూ.60 కోట్లకు పెంచుతున్నట్లు అప్పటి సీఎం హామీ ఇచ్చారు. పలు ఆర్యవైశ్య వ్యాపారులు, ప్రతినిధులతో బీసీ సంక్షేమశాఖ అధికారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిన్న వ్యాపారాలు నిర్వహించే ఆర్యవైశ్య యూనిట్లను కార్పొరేట్‌ మాల్స్‌, వాల్‌మార్ట్‌, అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌, ఆలిబాబా, స్నాప్‌డీల్‌ తదితర సంస్థలతో అనుసంధానించేలా చర్య లు తీసుకోవాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ ప్రణాళికలు అమల్లోకి వచ్చే లోపే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. షరామామూలుగానే గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లపై కొత్త ప్రభుత్వం కత్తికట్టింది. అందులోభాగంగా ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వకుండా ఎండబెడుతోంది. 


అటకెక్కిన ఆదరణ

అగ్రవర్ణాలకు చెందిన పేదవర్గాలను విద్య, ఆర్థికపరంగా ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. చాలామంది ఈబీసీలు వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ సొంత భూమి లేక గ్రామాల్లో పేదరికంలో మగ్గుతున్నారని, పట్టణాల్లో సుస్థిరమైన జీవనోపాధులు పొందలేని పరిస్థితి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈబీసీలకు పలు సంక్షేమ కార్యక్రమాలు ఈ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. స్వయం ఉపాధి పథకాల యూనిట్లు అందించారు. డ్రైవర్లకు కార్లు బ్యాంకుల సహకారంతో అందించారు. గ్రామాల్లో నిరుద్యోగ యువతకు భారీగా రుణాలందించారు. ఉన్నత విద్య పథకం కింద పోటీ పరీక్షలకు శిక్షణ కోసం ప్రముఖ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ కోసం ఆర్థిక సాయం అందించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ అటకెక్కాయి.


ఆగిన విదేశీ విద్య

విదేశాల్లో చదవడమంటే ఒకప్పుడు సగటు విద్యార్థికి నెరవేరని కల. అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లోని వర్సిటీల్లో  సీటు సంపాదించడం ఒక ఎత్తయితే, దాని కి అవసరమైన వీసా, వర్సిటీల్లో ఫీజులు, నివాసానికి ఖర్చులు భరించడం సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు సాధ్యం కాని పని. పేద విద్యార్థులకు కలగా ఉన్న విదేశీ విద్యను అప్పటి సీఎం చంద్రబాబు సాకా రం చేశారు. విదేశీ విద్యా పథకాన్ని ఈబీసీల కోసం 2017-18లో ప్రారంభించారు. విదేశీ వర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు  చొప్పున అందించారు. కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు కార్పొరేషన్‌ ద్వారా అందించినప్పటికీ ఈబీ సీ కార్పొరేషన్‌ ద్వారా 783 మందికి రూ.16 కోట్లు చెల్లించారు. ఇప్పుడు అన్నీ పోయి.. నవరత్నాలు మిగిలాయి. ప్రభుత్వ ఆదరణ, నిధుల మంజూరు లేకపోవడంతో కార్పొరేషన్‌ భవనం నిర్వహణా కష్టమైంది. ఉద్యోగులను ఇంటికి పంపించివేశారు.


కానుకలపైనా కత్తి..

అగ్రవర్ణ పేదలు ఏటా పండుగరోజు పప్పన్నం తింటారన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం సంక్రాంతి కానుక పేరుతో నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించింది. ముస్లింలకు రంజాన్‌ తోఫా, క్రిస్టియన్లకు క్రిస్మస్‌ కానుకను ఇచ్చింది. ఈ కానుకలు కొత్త ప్రభుత్వంలో నిలిచిపోయాయి. చంద్రన్న కానుకలుగా ఇవ్వడం ఇష్టం లేకపోతే.. తమకు నచ్చిన పేరుతోనైనా పంపిణీ చేయాలని అగ్రవర్ణ పేదవర్గాలు కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ కానుకలను రద్దు చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. అలాగని అమలుచేసే సూచనలు కనిపించడం లేదు.



Updated Date - 2021-10-28T15:38:19+05:30 IST