రూ.1,000 కోట్లతో విస్తరణ

ABN , First Publish Date - 2021-05-17T06:33:23+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతోంది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ సీఎండీ చిగురుపాటి కృష్ణ ప్రసాద్‌ వెల్లడించారు...

రూ.1,000 కోట్లతో విస్తరణ

  • గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడి 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతోంది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ సీఎండీ చిగురుపాటి కృష్ణ ప్రసాద్‌ వెల్లడించారు. ఈ పెట్టుబడి నిధులను పూర్తిగా అంతర్గత వనరుల నుంచే సమీకరించన్నుట్లు ఆయన తెలిపారు. ఇందులో రూ.400 కోట్ల పెట్టుబడులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనే పూర్తి చేయాలని కంపె నీ భావిస్తోంది. మిగతా రూ.600 కోట్ల పెట్టుబడులు 2024 మార్చి 2024 లోపు పూర్తి చేస్తుంది. 


పెట్టుబడులు ఇలా.. 

రూ.1,000 కోట్లలో రూ.180 కోట్లు మల్టిపుల్‌ యూనిట్స్‌ పెల్లెట్‌ సిస్టమ్‌ (ఎంయూపీఎస్‌) ఏర్పాటు కోసం గ్రాన్యూల్స్‌ వెచ్చించనుంది. అలాగే రూ.250 కోట్లు ఏపీఐల ఉత్పత్తి సామర్ద్య విస్తరణ కోసం, రూ.320 కోట్లు కొత్త ఫార్ములేషన్ల ప్లాంట్‌ ఏర్పాటు కోసం వినియోగించనుంది, మరో రూ.30 కోట్లు పారాసెటమాల్‌, మెట్‌ఫార్మిన్‌ తయారుచేసే హైదరాబాద్‌ సమీపంలోని ప్లాంట్‌ విస్తరణ కోసం వినియోగిస్తారు. ఇంకా కొంత మొత్తాన్ని ప్లాంట్ల నిర్వహణ కోసం వినియోగించనున్నట్టు కృష్ణ ప్రసాద్‌  చెప్పారు. 


‘ఆర్‌ అండ్‌ డీ’పైనా 

పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలపైనా గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ఏటా రూ.150 కోట్లు ఖర్చు చేస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రియాంక చిగురుపాటి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆదాయ వృద్ధి 15 నుంచి 20 శాతం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.3,238 కోట్ల ఆదాయంపై రూ.549 కోట్ల నికర లాభం ఆర్జించింది.


Updated Date - 2021-05-17T06:33:23+05:30 IST