ప్రభుత్వ భూమిలో గ్రావెల్‌ క్వారీ అనుమతి రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T05:11:22+05:30 IST

ప్రభుత్వ భూమిలో గ్రావెల్‌ క్వారీ అనుమతి రద్దు చేయాలని అఖిలపక్ష నేతలు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ భూమిలో గ్రావెల్‌ క్వారీ అనుమతి రద్దు చేయాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అఖిలపక్ష నేతలు

విజయపురం, జనవరి 27: ప్రభుత్వ భూమిలో గ్రావెల్‌ క్వారీ అనుమతి రద్దు చేయాలని అఖిలపక్ష నేతలు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండలంలోని పాతార్కాడు గ్రామ లెక్క దాఖలా 42లో ఉన్న సర్వే నంబర్లు 114పీ, 115పీ లలో 4.95 ఎకరాలకు గ్రావెల్‌ క్వారీ అనుమతి మంజూరు చేశారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి పనులకు గ్రావెల్‌ వాడుకుంటే అడ్డుకోవడం లేదని, మట్టిని తమిళనాడుకు అమ్ముకుంటున్న దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా 2019లో పంచాయతీ తీర్మానం పొందామని, ఇష్టానుసారం సమాధానం చెబుతున్నారని, అధికార పార్టీ నేతలు మట్టిని, ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గతంలో అక్రమార్కులకు పట్టాలివ్వడంతో వాటిని కలెక్టరు రద్దు చేశారని, ఆ భూముల్లో అక్రమంగా అనుమతి పొంది మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, కలెక్టరు స్పందించి గ్రావెల్‌ క్వారీ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. క్వారీ కొనసాగితే కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్‌ రవీంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ గ్రావెల్‌ క్వారీకి తాను అనుమతి మంజూరు చేయలేదని, 2019లో ప్రత్యేకాధికారులు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జనార్దన్‌, అఖిలపక్ష నాయకులు రమే్‌షరాజు, కలైలాసం యాదవ్‌, కోదండయ్య, బాబుయాదవ్‌, రమే్‌షనాయుడు, బొబ్బిలి, బాలసుబ్రహ్మణ్యం, శివలింగం, ఉదయకుమార్‌, మురళీ, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:11:22+05:30 IST