గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు ఆపాలి

ABN , First Publish Date - 2021-08-04T05:10:41+05:30 IST

మండలంలోని పెనుబల్లి, జొన్నవాడ గ్రామాల మధ్య ఉన్న తిప్పపై జరుపుతున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలంటూ సీపీఎం సీనియర్‌ నాయకుడు గండవరపు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు ఆపాలి
గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు, గ్రామస్థులు

 తహసీల్దారు కార్యాలయం వద్ద సీపీఎం నిరసన 


బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 3: మండలంలోని పెనుబల్లి, జొన్నవాడ గ్రామాల మధ్య ఉన్న తిప్పపై జరుపుతున్న  గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలంటూ సీపీఎం సీనియర్‌ నాయకుడు గండవరపు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం పెనుబల్లి, జొన్నవాడ గ్రామాల ప్రజలు, సీపీఎం, సీఐటీయూ నాయకులు తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిప్పపైన అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న తిప్పను కాపాడాలంటూ నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా గండవరపు శ్రీనివాసులు మాట్లాడుతూ అనుమతికి మించిన తవ్వకాలపై పరిశీలించి, గండిపడిన ప్రభుత్వాదాయానికి బాధ్యుల నుంచి   నగదు వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు జానీబాషా, తంబి రమణయ్య, నన్నం మాధవ, కందికట్టు వెంకట రమణయ్య రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 

గ్రావెల్‌ తవ్వకాలు నిలిపివేత:  ‘పెనుబల్లి తిప్పపై గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు స్పందించిన తహసీల్దారు హమీద్‌ పెనుబల్లి తిప్పమీద జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలను  మంగళవారం ఉదయం నిలిపి వేసినట్లు తెలిపారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2021-08-04T05:10:41+05:30 IST