మరణాల లెక్కల్లో మహా విచిత్రం!

ABN , First Publish Date - 2020-07-30T07:25:11+05:30 IST

అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రం మన తెలంగాణలో జరుగుతోంది. గత 41 రోజులుగా రాష్ట్రంలో పూర్తి ఆరోగ్యవంతులే కరోనాతో ఎక్కువగా చనిపోతుండగా... ఇతర వ్యాధులున్నవారు తక్కువగా చనిపోతున్నారు. ఇది నిజంగా నిజం! కావాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటిన్

మరణాల లెక్కల్లో మహా విచిత్రం!

  • ఆరోగ్యవంతులే కరోనాతో ఎక్కువ చనిపోతున్నారట!
  • ఇతర వ్యాధులున్నవారిలో మరణాలు తక్కువట!
  • ప్రపంచమంతా ఒకతీరు.. రాష్ట్రంలో మరో తీరు
  • సర్కారీ బులెటిన్‌ చెబుతున్న నిజం
  • 41 రోజులుగా లెక్కల్లో మతలబులు
  • ఇతర వ్యాధులున్నవారిని లెక్కించకపోవడమే కారణం?
  • ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు బుట్టదాఖలు!

కరోనా మృతుల్లో 95 శాతం మంది ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారే. పాజిటివ్‌ ఉండడంతో కరోనా మరణంగా లెక్కించక తప్పడం లేదు.

- జూన్‌ 8న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు

(కరోనా మృతులపై మే 11న ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు.)


హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇతర వ్యాధులేవీ లేని ఆరోగ్యవంతులకు కరోనా వల్ల పెద్దగా ముప్పు ఉండదు. ఇతర వ్యాధులు ఉన్నవారే కరోనా వల్ల చనిపోయే అవకాశం ఎక్కువ. అలాంటివారిని జాగ్రత్తగా చూసుకోవాలి’’... ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ చెబుతున్న మాట!  కరోనా మృతుల్లో 95 శాతం మంది ఇతర వ్యాధులు ఉన్నవారేనని సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా గత జూన్‌ 8వ తేదీన ప్రకటించారు.


అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రం మన తెలంగాణలో జరుగుతోంది. గత 41 రోజులుగా రాష్ట్రంలో పూర్తి ఆరోగ్యవంతులే కరోనాతో ఎక్కువగా చనిపోతుండగా... ఇతర వ్యాధులున్నవారు తక్కువగా చనిపోతున్నారు. ఇది నిజంగా నిజం! కావాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటిన్‌ చూడండి. దాని ప్రకారం జూన్‌ 18వ తేదీ నుంచి జూలై 28 వరకూ గల 41 రోజుల కాలంలో తెలంగాణలో కరోనా వల్ల 300 మంది చనిపోయారు. వీరిలో ఏకంగా 192 మంది (64 శాతం మంది) ఇతర వ్యాధులేవీ లేని పూర్తి ఆరోగ్యవంతులు. మృతుల్లో కేవలం 108 మంది (కేవలం 36 శాతం) మాత్రమే ఇతర వ్యాధులు ఉన్నవారు. ఇది చూసి... ‘‘ఇంకేం! ఇతర వ్యాధులున్నవారంతా ధైర్యంగా ఉండొచ్చు. ఆరోగ్యవంతులే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలి’’ అనుకుంటున్నారా? అదేం కాదు లెండి! కరోనా మరణాల లెక్కల్లో రాష్ట్ర సర్కారు చేస్తున్న విన్యాసం ఫలితమిది!!

బుధవారం తెలంగాణ సర్కారు ఇచ్చిన తాజా కరోనా బులెటిన్‌లో జూలై 28 రాత్రి వరకూ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 492గా పేర్కొన్నారు. మృతుల్లో ఇతర వ్యాధులున్నవారు 53.87 శాతమని, కేవలం కరోనాతో చనిపోయినవారు 46.13 శాతమని తెలిపారు. ఈ ప్రకారం చూస్తే మృతుల్లో 265 మంది ఇతర వ్యాధులున్నవారు కాగా, మిగతా 227 మంది ఇతర వ్యాధులేవీ లేనివారు. దీనికి సరిగా 41 రోజుల కిందట జూన్‌ 17న తెలంగాణ సర్కారు విడుదల చేసిన ప్రకటన ప్రకారం అప్పటికి మరణాల సంఖ్య 192. వారిలో 157 మంది (81.77 శాతం)కి ఇతరత్రా వ్యాధులు ఉండగా.. 35 మందికి (18.23 శాతం) ఇతరత్రా వ్యాధులేవీ లేవని తెలిపారు. ఈ రెండు బులెటిన్ల మధ్య గల 41 రోజుల డేటాను పరిశీలిస్తే 300 మంది చనిపోగా వారిలో 192 మంది (64 శాతం) ఇతర వ్యాధులేవీ లేని ఆరోగ్యవంతులు. మిగతా 108 మంది (36 శాతం) మాత్రమే ఇతర వ్యాధులు ఉన్నవారు. ప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర వ్యాధులున్నవారే కరోనాతో ఎక్కువ చనిపోతుండగా మన రాష్ట్రంలో మాత్రం దానికి పూర్తి విరుద్ధమైన గణాంకాలు కనిపిస్తున్నాయి.


ఉదాహరణకు తమిళనాడులో జూలై 27వ తేదీన 77 మంది కరోనాతో చనిపోగా వారిలో 69 మంది ఇతర వ్యాధులు ఉన్నవారని, కేవలం 8 మంది మాత్రమే కేవలం కరోనా వల్ల చనిపోయారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తమిళనాడులో జూన్‌ 4వ తేదీ నాటి డేటా ప్రకారం... ఆరోజు వరకూ ఉన్న మొత్తం మృతుల్లో 83 శాతం మంది ఇతర వ్యాధులు ఉన్నవారే! కేవలం 17 శాతం మంది మాత్రమే ఇతర రోగాలు లేనివారు. జూలై 21 నాటికి కర్ణాటక డేటాను పరిశీలిస్తే మృతుల్లో 77.7 శాతం ఇతర వ్యాధులున్నవారు కాగా, 22.3 శాతం మంది మాత్రమే లేనివారు. ఇటలీ కరోనా మృతుల్లో 88 శాతం ఇతర వ్యాధులున్నవారే. (మరిన్ని వివరాల కోసం పట్టిక చూడండి) అందుకే ఇతరత్రా వ్యాధులున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, వృద్ధులు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని, ఇంటికే పరిమితం కావాలని, బయటికి వెళ్లి వచ్చే కుటుంబ సభ్యులతో వృద్ధులు సన్నిహితంగా మెలగరాదని... ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు అందరూ సూచిస్తున్నారు. కానీ తెలంగాణ గణాంకాల్లో మాత్రం అందుకు భిన్నమైన, విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎందుకు ఇలా జరుగుతోంది?


జాగ్రత్తగా పరిశీలిస్తే... మన రాష్ట్రంలో ఇతర వ్యాధులుండి కరోనాతో చనిపోయిన వారిని కరోనా మరణాల లెక్కల్లో బాగా తగ్గించి చూపడమే ప్రధాన కారణమనే అనుమానం కలుగుతోంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి వ్యాధులున్న వారికి కరోనా వచ్చి చనిపోతే... వారి మరణానికి కరోనా కారణం కాదంటూ ఇతరత్రా కారణాలు చూపుతున్నారని అనిపిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కరోనా సోకి మరణించినా వాటిని కరోనా చావులుగా పరిగణించవద్దని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సూచించిందంటూ గత మే 16వ తేదీన ఆయన ఓ ప్రకటన చేశారు. కొద్దిరోజుల కిందట కామారెడ్డిలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. వేటిని కరోనా మరణాలుగా పరిగణించాలి అనే విషయంలో ఐసీఎంఆర్‌ గత మే 11వ తేదీన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా రోగులు న్యూమోనియా, గుండె దెబ్బతినడం, రక్త ప్రసరణలో అవరోధాలు వంటి సమస్యలు తలెత్తి చనిపోతే చావుకు మూలకారణం కరోనా అని పేర్కొనాలని ఐసీఎంఆర్‌ ఆ మార్గదర్శకాల్లో తెలిపింది.


అంతేకాదు... కరోనా లక్షణాలుండి చనిపోయినవారికి సంబంధించిన టెస్టు ఫలితాల్లో స్పష్టత లేకపోతే కూడా ఆ చావులకు ‘‘బహుశా కరోనాయే కారణ’’మని పేర్కొనాలంటూ నిర్దేశించింది. కరోనా లక్షణాలతో చనిపోయిన వారి టెస్టు రిజల్ట్‌ నెగటివ్‌ వచ్చినా సరే... ‘‘క్లినికల్లీ, ఎపిడమియాలజికల్లీ డయాగ్నయిజ్డ్‌ కొవిడ్‌-19’’గా పేర్కొనాలని స్పష్టంచేసింది. కానీ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా మృతుల్లో ఏవైనా ఇతర వ్యాధులు ఉంటే వారిని కరోనా మృతులుగా లెక్కించడం లేదని, ప్రత్యేకించి జూన్‌ నుంచి మరణాలు ఎక్కువగా పెరగడంతో లెక్కల్లో మతలబు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉదాహరణకు నాలుగు రోజుల వ్యవధిలో కరోనాతో 100 మంది చనిపోయారనుకుందాం. వారిలో 80 మంది ఇతర వ్యాధులు ఉన్నవారు, మిగతా 20 మంది ఇతర వ్యాధులేవీ లేనివారు ఉన్నారనుకుందాం. కానీ ఇతర వ్యాధులున్న 80 మందిలో కేవలం పదిమందినే ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకుంటే ఏమవుతుంది? మొత్తం మృతులు 30 మంది అవుతారు. వారిలో 20 మంది (66.6 శాతం) ఇతర ఏ వ్యాధులూ లేనివారిగా, 10 మంది (33.3 శాతం) ఇతర వ్యాధులున్నవారిగా కనిపిస్తుంది. అంటే ఆరోగ్యవంతులే కరోనా వల్ల ఎక్కువ చచ్చిపోతారనే అభిప్రాయం కలుగుతుంది. జూన్‌ 17 నుంచి జూలై 21 మధ్య గత 41 రోజుల్లో ఇలాగే జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇతరత్రా వ్యాధులున్నవారిని పరిగణనలోకి తీసుకోకుండా, ‘‘ఎలాగూ చావాల్సిన వాడే... కాస్త ముందు చనిపోయాడంతే’’ అనే ధోరణిలో లెక్కలు వేస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఇప్పుడున్న దానిలో నాలుగో వంతు కూడా ఉండదు. ప్రతి మరణం కరోనా మరణమా, కాదా కచ్చితంగా నిర్ధారించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కమిటీలు వేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఒక్క గాంఽధీ ఆస్పత్రిలో మాత్రమే ఇలాంటి కమిటీ పనిచేస్తోంది. మిగతా ఆస్పత్రుల సంగతి, ప్రైవే టు ఆస్పత్రుల సంగతి ఏమిటనేది అస్పష్టంగానే ఉంది.


హైదరాబాద్‌లోని అయిదు శ్మశాన వాటికల్లో ఒక్క రోజులోనే 50 మంది కరోనా మృతులు/కరోనా అనుమానిత మృతులకు అంత్యకియ్రలు చేసినట్లు ఇటీవల ఆంధ్రజ్యోతి పరిశీలనలో తేలిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై (26వరకూ) నెలల్లో కొవిడ్‌ ప్రత్యేక గాంధీ ఆస్పత్రిలో 1015 మంది చనిపోయినట్లు సర్కారీ పత్రిక అయిన నమస్తే తెలంగాణ ఇటీవల ప్రచురించింది. వీటన్నింటితోపాటు ప్రభుత్వ బులెటిన్‌ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న కరోనా మరణాల లెక్కలు నమ్మడం చాలా కష్టమే!! ఒకవేళ లెక్కల్లో ఎలాంటి మతలబూ లేకుండానే ఇలా జరుగుతూ ఉంటే డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ వంటి సంస్థల శాస్త్రవేత్తలందరూ వచ్చి తెలంగాణలో ప్రత్యేక పరిస్థితిపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.


కొత్త బులెటిన్‌లో శాతాల లెక్క ఎలా?

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్‌ ఫార్మాట్‌ను కొద్దిరోజుల నుంచి మార్చింది. ఇందులో మృతుల్లో కరోనాతో చనిపోయినవారి శాతం, ఇతర వ్యాధులతో చనిపోయిన వారి శాతం అంటూ ప్రతిరోజూ చూపడం ప్రారంభించారు. అయితే ఈ శాతాలను ఎలా లెక్కిస్తున్నారు? అనేది స్పష్టం చేయడం లేదు. ఉదాహరణకు బుధవారం నాటి బులెటిన్‌లో మొత్తం మృతుల సంఖ్యను 492గా పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన వారి శాతం 46.13గా, ఇతర వ్యాధులతో చనిపోయిన వారి శాతం 53.87గా పేర్కొన్నారు. అంటే బులెటిన్‌లో చూపిన 492 మంది మృతుల్లో 227 మంది కేవలం కరోనా వల్ల, 265 మంది ఇతర వ్యాధుల వల్ల చనిపోయినట్లు భావించాలి. అయితే ఈ లెక్కను మరో రకంగా కూడా వేశారా అనే సందేహం కలుగుతోంది. అంటే వాస్తవంగా చనిపోయింది 1067మందా? వారిలో కేవలం కరోనాతో చనిపోయిన 492మంది (46.13 శాతం)ని మాత్రమే లెక్కల్లో చూపి... ఇతర వ్యాధులున్న 575(53.87) శాతం వారిని అసలు లెక్కల్లో చూపకుండా పక్కనపెట్టారా? అనే అనుమానం వస్తోంది. ది హిందూ పత్రిక బుధవారం ఎడిషన్లో ఇదే అంశంపై ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించగా వారు స్పందించలేదని తెలిపింది. బుధవారం ఆంధ్రజ్యోతి సైతం ఇదే అంశంపై ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించగా మళ్లీ స్పందన కరువైంది.

Updated Date - 2020-07-30T07:25:11+05:30 IST