ఎడతెగని ఎక్స్‌అఫీషియో లెక్క

ABN , First Publish Date - 2021-01-26T06:32:01+05:30 IST

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు తేదీ ఖరారైంది.

ఎడతెగని ఎక్స్‌అఫీషియో లెక్క

ఇంకా పరిశీలనే

గ్రేటర్‌లో ఓటరైతే చాలు 

ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్‌ అఫీషియో ఫఆప్షన్‌ అవసరం లేదు..

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు తేదీ ఖరారైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందుబాటులోకి వచ్చింది. ఎక్స్‌అఫీషియో సభ్యుల లెక్క మాత్రం తేలలేదు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో 150 మంది సభ్యులు (కార్పొరేటర్లు) ఉన్నారు. వీరితోపాటు గ్రేటర్‌ పరిధిలో 25 మంది ఎమ్మెల్యేలు (నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి), ఐదుగురు ఎంపీలు ఉన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడి తుక్కుగూడ ఎక్స్‌అఫిషియో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమెకు జీహెచ్‌ఎంసీలో ఓటు వేసే అవకాశం లేదు. ఓ ఎంపీ కూడా మరో చోట ఓటు వేశారని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం సీడీఎంఏ, అసెంబ్లీ కార్యదర్శి నుంచి జీహెచ్‌ఎంసీకి వివరాలు చేరాయి. శాసనసభ కార్యాలయ వర్గాలు 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీల వివరాలు ఇచ్చినట్టు తెలిసింది. ఎంపీ, ఎమ్మెల్సీల్లో ఎంత మందికి ఇక్కడ ఓటు హక్కు ఉందన్నది గుర్తించి.. సీడీఎంఏ వివరాల ప్రకారం వారిలో ఎంత మంది ఇతర చోట్ల ఓటు వేశారన్నది పరిశీలిస్తున్నారు. నేడు లేదా రేపు ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. 

ఓటర్‌ అయితే చాలు...

గ్రేటర్‌లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీలు, ఎంపీలకు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌ అఫిషియో ఓటు హక్కు ఉంటుంది. ఇందుకోసం వారు పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారు గ్రేటర్‌లో ఓటర్‌ అయి ఉంటే చాలు. కాకపోతే ఇతర కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండాలి. మునిసిపల్‌ యాక్ట్‌ ప్రకారం కార్పొరేషన్‌, మునిసిపాల్టీ పరిధిలో ఉండే ఎమ్మెల్యేకు అక్కడ ఎక్స్‌అఫిషియోగా ఉండే అవకాశముంది. వారి ఆసక్తిని బట్టి రాష్ట్రంలోని ఏ మునిసిపాల్టీ, కార్పొరేషన్‌నైనా ఎంచుకోవచ్చు. జీహెచ్‌ఎంసీకి వచ్చే సరికి ఈ నిబంధన మారుతుంది. బల్దియాను ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఓటరై ఉంటే ఆటోమేటిక్‌గా ఎక్స్‌అఫిషియోగా కొనసాగవచ్చు. 

Updated Date - 2021-01-26T06:32:01+05:30 IST