తా(కా)రుమారు!

ABN , First Publish Date - 2020-12-05T05:48:54+05:30 IST

హోరాహోరీగా సాగిన గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది.

తా(కా)రుమారు!

  • శివారు ప్రాంతాల్లో ఫలించని టీఆర్‌ఎస్‌ అంచనాలు
  • గతంతో పోలిస్తే భారీగా తగ్గిన సీట్లు.. 27 స్థానాలను కోల్పోయిన అధికార పార్టీ 
  • గులాబీ నేతలకు గ్రేటర్‌ ఓటర్ల ఝలక్‌ 
  • శివారులో కారుకు ‘బ్రేక్‌’.. వికసించిన ‘కమలం’ 
  • మూడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవని టీఆర్‌ఎస్‌  
  • మిగతాచోట్ల చావుదెబ్బ 
  • మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ 
  • టీడీపీ అడ్రస్‌ గల్లంతు.. కాంగ్రెస్‌కూ చేదు ఫలితాలే..



శివారు ప్రాంతాల్లో కారు బోల్తా కొట్టింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అధిక స్థానాలను కోల్పోయింది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ హవా కొనసాగించింది. గతంలో ఒక స్థానానికే పరిమితమైన కమలం ఈ సారి 24సీట్లు సాధించింది. ఇక, కాంగ్రెస్‌ పార్టీ సాధించిన రెండు స్థానాలు కూడా శివారు ప్రాంతాలు కావడం విశేషం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ అసలు జీహెచ్‌ఎంసీలోనే ఖాతా తెరవకుండా పోయింది. శివారు ప్రాంతాల్లో విజయం కోసం గులాబీ నేతలు వేసిన పాచికలను ఓటర్లు తిప్పికొట్టారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : హోరాహోరీగా సాగిన గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. నగరశివార్లలో పాగా వేయా లని చూసిన అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పరాభవం ఎదురైంది. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పైచేయి సాధించినప్పటికీ కీలక ప్రాంతాలను  చేజార్చుకుంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. అనేక డివిజన్లలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఎల్‌బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అసలు ఖాతానే తెరవలేదు. తాజా ఫలితాలు అధికార టీఆర్‌ ఎస్‌లో ప్రకంపనాలు రేకెత్తిస్తున్నాయి. అలాగే ప్రధాన ప్రతిపక్ష మైన కాంగ్రెస్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అలాగే గతంలో శివార్లలో భారీ ఓటుబ్యాంకు కలిగి ఉన్న టీడీపీ ఈసారి అడ్రస్‌ గల్లంతైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం గంపగుత్తగా బీజేపీ వైపు మొగ్గుచూపడంతో మిగతా పార్టీలు కకావికలమయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 64 డివిజన్లలో అధికార టీఆర్‌ఎస్‌ 35 డివిజన్లు గెలుచుకోగా బీజేపీ 24 డివిజన్లలో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌, ఎంఐఎంలకు చెరో రెండు డివిజన్లు దక్కాయి. నేరెడ్‌మెట్‌లో ఇంకా ఫలితం వెల్లడించాల్సి ఉంది. మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ చతికిల పడింది. అలాగే మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర అధికార పార్టీ ముఖ్యనేతలు ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ప్రాంతాల్లో కూడా టీఆర్‌ఎస్‌ స్థానాలు కోల్పోయింది. అలాగే కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలు చూసిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి కూడా ఎన్నికలు పరాభవాన్నే మిగిల్చాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్‌  పరిధిలో 46 డివిజన్లకు గానూ కాంగ్రెస్‌ కేవలం రెండుచోట్ల మాత్రమే గెలుపొందింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌కు 10 డివిజన్లు దక్కగా బీజేపీకి అయిదు, ఎంఐఎంకు రెండు దక్కాయి.


ఎల్‌బీనగర్‌, మహేశ్వరంలో కమలం స్వీప్‌ 

ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కమలం అందరి అంచనాలనూ తలకిందులు చేసింది. శివార్లలోని ఎల్‌బీనగర్‌, మహేశ్వరం పరిధిలోని 13 డివిజన్లను స్వీప్‌ చేసింది. ముఖ్యంగా ఎల్‌బీనగర్‌ పరిధిలోని 11 డివిజన్లతో పాటు మహేశ్వరంలోని రెండు డివిజన్లలో అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ మారిన మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. 


ఒక స్థానం నుంచి... 24 స్థానాలకు బీజేపీ

 ఇదిలా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కమలం వికసించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 64 డివిజన్లు ఉండగా  గత గ్రేటర్‌ ఎన్నికల్లో 62 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌, బీజేపీలకు చెరొకటి మాత్రమే వచ్చాయి. అయితే ఇపుడు బీజేపీ భారీగా డివిజన్లు కొల్లగొట్టింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క డివిజన్‌లోనే విజయం సాధించిన బీజేపీ ఇపుడు 24 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ రెండు డివిజన్లతో సరిపెట్టుకుంది. గతంలో గెలుపొందిన 27 డివిజన్లను టీఆర్‌ఎస్‌ కోల్పోవడం గమనార్హం. 


గులాబీని గట్టెక్కించిన మూడు నియోజకవర్గాలు

హోరాహోరీగా సాగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాలు అధికార పార్టీ పరువు కాపాడాయి. సెటిలర్స్‌ అధికంగా ఉండే  శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యత లభించింది. శేరిలింగంపల్లి పరిధిలో 10 డివిజన్లు ఉండగా ఇందులో 9 టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్లు ఉండగా ఏడుచోట్ల టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. కూకట్‌పల్లిలో కూడా ఎనిమిది డివిజన్లకుగ ానూ ఏడుచోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మొత్తం మీద 56స్థానాల్లో విజయం సాధించగా ఇందులో 23 డివిజన్లు ఈ మూడు నియోజకవర్గాల్లోనివే కావడం విశేషం.


వికారాబాద్‌జిల్లా నేతలకూ షాక్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వికారాబాద్‌ జిల్లా నేతలకు నిరాశనే మిగి ల్చింది. పార్టీ అభ్యర్థుల విజయం కోసం సర్వశక్తులొడ్డి ప్రచారం చేసిన జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు ఓటమి భారం తప్పలేదు. వచ్చిన ఫలితాలు బీజేపీ నేతల్లో ఆనందోత్సాహం నింపగా, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలను పూర్తిగా నిరాశపరిచాయి. జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ ఎన్నికల ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన హఫీజ్‌పేట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పూజిత విజయం సాధించగా, చేవెళ్ల ఎంపీ, తాండూరు, పరిగి, చేవెళ్ల, కొడంగల్‌, వికారాబాద్‌ ఎమ్మెల్యేలు ఎన్నికల ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన ఆరు డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించిన మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించిన అత్తాపూర్‌, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇన్‌చార్జిగా కొనసాగిన రాజేంద్రనగర్‌ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమి చెందారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఇన్‌చార్జిగా ఉన్న గుడి మల్కాపూర్‌, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరించిన మన్సూరాబాద్‌ డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇన్‌చార్జిగా కొనసాగిన విజయనగర్‌ కాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. ఈ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, విజయనగర్‌ కాలనీ డివిజన్‌లో ఎంఐఎం పాగా వేసింది. జిల్లా గ్రంథాలయ సంస్థ కొండల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేసిన వివేకానందనగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉంటే, గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ జిల్లా నేతలు ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఓటమి భారం చవిచూడాల్సి వచ్చింది. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో బీజేపీ జిల్లా నేతలు ప్రచారం చేయగా, అక్కడ మూసాపేట డివిజన్‌లో మాత్రమే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. జూబ్లీహిల్స్‌, అత్తాపూర్‌ డివిజన్లలో కొందరు జిల్లా బీజేపీ నేతలు ప్రచారం చేయగా, అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి ప్రచారం చేసిన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలువలేదు. ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేయగా, జీహెచ్‌ఎంసీలో ఎక్కువ డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీజేపీ వర్గాల్లో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-12-05T05:48:54+05:30 IST