2.85 లక్షల ఇళ్లలో పూర్తయిన ఇంటింటి ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-11T14:37:32+05:30 IST

గ్రేటర్‌లో ఇంటింటి ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది.

2.85 లక్షల ఇళ్లలో పూర్తయిన ఇంటింటి ఫీవర్‌ సర్వే

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఇంటింటి ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2,85,195 ఇళ్లలో సర్వే నిర్వహించినట్టు ఓ ప్రకటనలో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. సోమవారం 704 బృందాలు 53,326 ఇళ్లలో సర్వే నిర్వహించాయి. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం ఉందా..? లేదా..? అన్నది పరిశీలిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. జ్వరం ఉంటే మెడిసిన్‌ కిట్‌ ఇచ్చి క్రమం తప్పకుండా వాడాలని సూచిస్తున్నట్టు చెప్పారు. కేసులు ఎక్కువగా ఉన్న చోట వైరస్‌ వ్యాప్తి నిరోధానికి యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని సంస్థ పేర్కొంది. 


కొవిడ్‌ అవుట్‌ పేషెంట్‌ వైద్య సేవలు అందుబాటులో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో 18,195 మందికి ఫీవర్‌ చెక్‌ చేశారు. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో 1,25,073 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వివిధ అంశాలపై నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, కొవిడ్‌ సంబంధిత సలహాలు, సూచనలో కోసం 87 మంది కాల్‌ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వైరస్‌ సోకిన వారిలో ఉన్న లక్షణాలను బట్టి ఏ మందులు వేసుకోవాలనే దానిపై కంట్రోల్‌ రూంలోని వైద్యలు సలహాలిస్తున్నారు.

Updated Date - 2021-05-11T14:37:32+05:30 IST