అభివృద్ధిలో గ్రేటర్‌

ABN , First Publish Date - 2020-06-01T10:56:10+05:30 IST

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఐటీ రంగం లో ఎగుమతులు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. 2014-15 ఆర్థిక

అభివృద్ధిలో గ్రేటర్‌

ఆరేళ్లలో ఆకాశమే హద్దుగా పెరిగిన ఇమేజ్‌

అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన


ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మౌలిక వసతుల కల్పన, ట్రాఫిక్‌ చిక్కుల్లేని ప్రయాణం,మెరుగైన విద్యుత్‌ సరఫరా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యేక రాష్ట్రంలో మహానగరం నుంచి విశ్వనగరం దిశగా వడివడిగా ముందుకు వెళుతోంది.


ఐటీలో మేటి

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి):  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఐటీ రంగం లో ఎగుమతులు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగు మతుల విలువ రూ. 66,000 లక్షలు అయితే, 2019-20 నాటికి రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది (2018-19) కంటే ఈ ఏడాది 17.93 శాతం వృద్ధి మేర ఐటీ ఎగుమతుల వృద్ధిని సాధించినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. జాతీయ సగటు 8.09 శాతం కంటే ఇది రెట్టింపు. ఉద్యోగాల కల్పనలో 7.20 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ ఎగుమతుల్లో 23.53 శాతం తెలంగాణ రాష్ట్రానిదే. ఐటీ రంగం వృద్ధితో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారింది. సాంకేతిక సమాచార(ఐటీ)రంగంలో  సత్తా చాటుతూ దేశంలోనే ఐటీ దిగ్గజ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. 


2018-19లో రాష్ట్రం నుంచి రూ.1,09,219 కోట్ల ఐటీ ఎగుమతులు చేయగా, 2019-20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు సాధించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఉద్యోగాల కల్పనలోనూ రాష్ట్రం వృద్ధి సాధించింది. 2018-19లో 5,43,033 మందికి ఉద్యోగాలు కల్పించగా, 2019-20లో 5,82,126 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఉద్యోగాల పరంగా 7.20 శాతం వృద్ధిగా నమోదైంది. జాతీయ సగటు వృద్ధి 4.93 కంటే రాష్ట్ర వృద్ధి ఎక్కువ. రాష్ట్ర ఎగుమతుల వాటా 2018-19లో ఉన్న 10.61 శాతం నుంచి 2019-20లో 11.58 శాతానికి పెరిగింది. ఉద్యోగాల కల్పన వాటా కూడా 13.06 శాతం నుంచి 13.34 శాతానికి పెరిగింది. మరోపక్క గూగుల్‌.. మైక్రోసాఫ్ట్‌.. ఆపిల్‌.. ఫేస్‌బుక్‌.. అమెజాన్‌.. ఇలా చెప్పుకుంటే పోతే పదుల సంఖ్యలో ఉన్న ప్రపంచంలోని ఐటీ దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. 


Updated Date - 2020-06-01T10:56:10+05:30 IST