గ్రేటర్‌ వార్‌...

ABN , First Publish Date - 2021-03-09T06:52:23+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

గ్రేటర్‌ వార్‌...

అంతా తయార్‌

రేపే పోలింగ్‌...ఏర్పాట్లు పూర్తి

నేడు పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపు

10,600 సిబ్బంది నియామకం

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

మూడు వేలకుపైగా సిబ్బందితో బందోబస్తు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్‌ జరగనున్నది. ఇందుకోసం 98 వార్డుల్లో 1,712 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విధుల నిర్వర్తించేందుకు సిబ్బంది నియామకం, వారికి శిక్షణ పూర్తిచేశారు. బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులు, ఇతరత్రా పోలింగ్‌ సామగ్రిని నగరంలోని నాలుగు పంపిణీ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచారు. వాటిని మంగళవారం ఉదయం ఆరు గంటలకల్లా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. నగరంలోని నాలుగు పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి సోమవారం సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. జోనల్‌ వారీగా సిబ్బంది కేటాయింపు పూర్తిచేయడంతో వారంతా మంగళవారం ఉదయానికే పంపిణీ కేంద్రాల్లో రిపోర్టు చేసి...తమకు కేటాయించిన పోలింగ్‌ సామగ్రిని కేంద్రానికి తీసుకువెళ్లేలా సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.


జీవీఎంసీ పరిధిలో మొత్తం 17,52,927 మంది ఓటర్లు వుండగా వీరిలో పురుషులు 8,80,481, మహిళలు 8,73,320 కాగా ఇతరులు 126 మంది ఉన్నారు. వీరందరూ ఓటేసేందుకు ఒక్కొక్కటి చొప్పున బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం చేశారు. ఒకవేళ ఏదైనా కారణంగా బ్యాలెట్‌ పత్రాలు వృథా అయినా కొరత లేకుండా వుండేందుకు వీలుగా పది శాతం (1,75,293) కలిపి మొత్తంగా 19,28,220 బ్యాలెట్‌ పత్రాలను సిద్ధంచేశారు. 


జీవీఎంసీ వ్యాప్తంగా 1,712 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. జోన్‌-1 పరిధిలో 170, జోన్‌-2 పరిధిలో 267, జోన్‌-3 పరిధిలో 199, జోన్‌-4 పరిధిలో 371, జోన్‌-5లో 379, జోన్‌-6లో 183, అనకాపల్లిలో 89, భీమిలిలో 54 చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు వీలుగా 10,600 మంది సిబ్బందిని నియమించారు. వీరందరికీ ఇప్పటికే పలు విడతల్లో శిక్షణ ఇచ్చారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం వద్ద ఒక ప్రిసైడింగ్‌ అధికారి, మరొక సహాయ ప్రిసైడింగ్‌ అధికారితోపాటు మరో ముగ్గురు సిబ్బంది వుండేలా ఏర్పాట్లుచేశారు. ఏదైనా అత్యవసరమై సిబ్బంది విధులకు గైర్హాజరైనా, విధినిర్వహణలో అనారోగ్యానికి గురైనా సరే పోలింగ్‌కు ఆటంకం లేకుండా పది శాతం అదనపు సిబ్బందిని రిజర్వులో ఉంచారు. 


98 వార్డుల్లో 566 మంది పోటీలో ఉన్నారు. అత్యధికంగా 28, 32 వార్డుల్లో 12 మంది చొప్పున పోటీలో ఉండగా, 12 వార్డులో అత్యల్పంగా ఇద్దరే పోటీలో ఉన్నారు. పోటీలో వున్నవారిలో పార్టీలపరంగా చూస్తే వైసీపీ నుంచి 98 మంది, టీడీపీ నుంచి 94 మంది, కాంగ్రెస్‌ నుంచి 67 మంది, జనసేన నుంచి 51 మంది, బీజేపీ నుంచి 44 మంది, సీపీఎం నుంచి 16 మంది, బీఎస్పీ, సీపీఐ నుంచి తొమ్మిదేసి మంది, గుర్తింపు పొందిన ఇతర పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌లుగా 177 మంది ఉన్నారు. 


ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ఏర్పాటుచేసిన పది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 60 స్ర్టాటజిక్‌ టీమ్‌లు నగరంలో రూ.13,97,400 నగదుతోపాటు 1,739 మద్యం బాటిళ్లు, ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న 262 చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఇవికాకుండా జీవీఎంసీ పరిధిలో 7,680 పోస్టులు, 5,637 హోర్డింగ్‌లు, 3,593 జెండాలు, 145 వాల్‌పోస్టర్లను తొలగించారు. 


వార్డులు 98

అభ్యర్థులు 566

మహిళలు 292

పురుషులు 274

పార్టీల వారీగా...

వైసీపీ 98

టీడీపీ 94

కాంగ్రెస్‌ 67

జనసేన 51

బీజేపీ 44

సీపీఎం 16

బీఎస్పీ 9

సీపీఐ 9

ఇండిపెండెంట్‌లు 177

ఇతర గుర్తింపు పొందినపార్టీ  ఒకటి

ముఖాముఖి పోటీ  12 (ఇద్దరు మాత్రమే)


మొత్తం ఓటర్లు 17,52,927 

పురుషులు 8,80,481

మహిళలు  8,73,320

ఇతరులు 126

అత్యధిక ఓటర్లు వున్న వార్డు 6 (29,891)

అత్యల్ప ఓటర్లు ఉన్న వార్డు 63 (9,654)

పోలింగ్‌ కేంద్రాలు 1,712

మొత్తం పోలింగ్‌ సిబ్బంది 10,600

ప్రిసైడింగ్‌ అధికారులు 98

సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు 98

మొత్తం పోలింగ్‌ సిబ్బంది (రిజర్వుతో కలిపి) 10,600

బ్యాలెట్‌ బాక్సులు 3,608

ముద్రించిన బ్యాలెట్‌ పేపర్లు 19,28,220


Updated Date - 2021-03-09T06:52:23+05:30 IST