Abn logo
Oct 22 2021 @ 02:21AM

దేశంలో అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌

 వచ్చే 12-14 నెలల్లో ఏర్పాటు చేయనున్న గెయిల్‌ 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ను నిర్మించనుంది. సెరావీక్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ ఫోరమ్‌లో ప్రసంగిస్తూ గెయిల్‌ చైర్మన్‌, ఎండీ మనోజ్‌ జైన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎలకో్ట్రలైజర్ల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించడం జరిగిందని, ప్లాంట్‌ నిర్మాణానికి మరో 12-14 నెలలు పట్టవచ్చన్నారు. ప్లాంట్‌ ఏర్పాటు కోసం మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పుర్‌ సహా 2-3 ప్రాంతాలను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు ఆయన చెప్పారు. మొత్తం 10 మెగావాట్ల ఎలకో్ట్రలైజర్లతో రోజుకు 4.5 టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ (హరిత ఉదజని) ఉత్పత్తి చేయగలిగే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జైన్‌ తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ కానుందన్నారు. ప్రభుత్వ రంగ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ ప్రకటించిన 5 మెగావాట్ల ఎలకో్ట్రలైజర్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌తో పోల్చితే రెట్టింపు సామర్థ్యం కలిగి ఉండనుందన్నారు. మథురలోని రిఫైనరీ వద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సైతం ప్రకటించింది.