గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మానసి, రాహుల్ జిందాల్

ABN , First Publish Date - 2020-08-02T17:07:22+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం విజయవంతంగా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మానసి, రాహుల్ జిందాల్

ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నగర పొలిమేరలను దాటి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఈ కార్యక్రమం చేరింది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. తాజాగా ఇండియన్ పారా-బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బంగారు పతకం విజేత మానసి గీరిష్ చంద్ర జోషి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో మొక్కలు నాటి.. ప్రముఖ షూటర్ అన్జుమ్ మౌద్గిల్, రచయిత హర్నిద్ కౌర్, ఫ్యాషన్ స్టైలిస్ట్-బ్లాగర్ పాయల్ షా పటేల్‌ను నామినేట్ చేశారు. అనంతరం మానసి మాట్లాడుతూ.. ‘నేనే అనుకునే ఆలోచన నుంచి మనం అనే ఆలోచనకు ప్రతిరూపమైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం నిజంగా గర్వకారణం. మనిసి స్వార్ధానికి ప్రకృతి చిన్నాభిన్నం అవుతండటంతోనే అనేక విపత్తులు సంభవిస్తున్నాయి’ అన్నారు. 




మరోవైపు గూగుల్ డైరెక్టర్ రాహుల్ జిందాల్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అర్జిత్ సర్కార్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్టు తెలిపారు. మనం జీవించటానికి భూమి ఒక్కటే ఆధారమని, మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదన్నారు. అలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలని, ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అభిలషించారు. తనకు బుద్ధుడన్నా, ఆయన ప్రవచనాలన్నా చాలా ఇష్టమని తెలిపారు. ప్రతి మొక్కలో, చెట్టు వేరులో, కాండంలో, గాలిలో బుద్ధుడు జీవించి ఉంటారని, అందుకే అందరూ మొక్కలు నాటాలన్నారు. ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి తనవంతుగా గ్లోబల్ కాంపెయిన్ ఆపరేషన్స్ శశాంక్ సాహిన్, న్యూలాండ్ లాబరేటరీస్ సీహెచ్ఆర్వో శ్రీరామ్ మంగుడి, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్ గ్లోబల్ సీఐఎస్వో సుబజిత్ దేవ్, బీపీఎం మైక్రోసాఫ్ట్ రాధికా దేశ్‌పాండేలను నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-08-02T17:07:22+05:30 IST