బకాయిల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-07-08T10:34:14+05:30 IST

మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన బకాయిలు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

బకాయిల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్‌

తీరనున్న కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ కష్టాలు

పెండింగ్‌లో రూ.2కోట్ల విద్యుత్‌ బిల్లులు

కాంట్రాక్టు కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ బకాయిలు రూ.కోటి


కాగజ్‌నగర్‌, జూలై7: మున్సిపాలిటీల్లో  పేరుకుపోయిన బకాయిలు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈమేరకు  రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఇతర బిల్లులు ఎంత మేర బకాయిలు ఉన్నాయన్నది నివేదికలను అందించాలని నాలుగు నెలల క్రితం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో రూ.2 కోట్లు మేర కరెంటు బిల్లులు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ రూ.కోటి మేర ఉన్నట్టు అధికారులు నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు.  ఈమొత్తం బకాయిలు రాష్ట్ర ప్రభుత్వమే కట్టేందుకు నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌ బకాయిలు మినహా యించి ప్రతీ నెల కరెంటు బిల్లులు కట్టుకోవాలని మున్సిపల్‌ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులు కూడా కట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో మున్సిపాలిటీలో దీర్ఘకాలిక బకాయిలు చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి. 


ఏడేళ్ల విద్యుత్‌ బకాయిలకు మోక్షం 

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 30వార్డులకు విద్యుత్‌ దీపాల బిల్లు నెలకు రూ.2లక్షల మేర వస్తోంది. వీటితో పాటు పెద్దవాగు సమీపంలో ఉన్న పంప్‌హౌజ్‌ రెండు మోటార్లు నడుస్తుండటంతో ఈ బిల్లు కూడా నెలకు రూ.5లక్షల మేర వస్తోంది. మున్సిపాలిటీకి ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవటంతో తరుచూ కొంత మేర చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. పట్టణ ప్రగతిలో అన్ని మున్సిపాలిటీల్లో కీలక సమస్యలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో పెండింగ్‌ బకాయిల విషయం దృష్టికి వచ్చింది. కాగజ్‌నగర్‌లో కరెంటు బిల్లు బకాయిలు రూ.2కోట్లు ఉండడంతో ప్రతీ నెల వారీగా వచ్చే బిల్లులు కట్టుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలలుగా అధికారులు మాత్రం ప్రస్తుతం వస్తున్న బిల్లులను కడుతున్నారు. పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం పట్ల కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి కీలక సమస్య తొలిగిపోనుంది. 


తీరనున్న కాంట్రాక్టు కార్మికుల కష్టాలు

కాంట్రాక్టు కార్మికులకు నెల వారీగా జీతాలు ఇస్తున్నప్పటికీ వీరికి సంబంధించిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులు నాలుగేళ్లుగా చెల్లించడం లేదు. దీంతో  బకా యిలు రూ.కోటి మేర పేరుకుపోయాయి. ఈ విష యంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో నివేది కలను సమర్పించారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీని పట్టి పీడిస్తున్న బకాయి బిల్లుల చెల్లింపునకు ఏర్పాట్లు జరుగుతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  


సంతోషంగా ఉంది..సంజీవ్‌, కాంట్రాక్టు కార్మికుడు, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామం. కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులు కూడా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మా కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి. 


నెల వారీ బిల్లులు చెల్లిస్తున్నాం... శ్రీనివాస్‌, కమిషనర్‌, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పెండింగ్‌ బకాయిల్లోని కరెంటు బిల్లు, కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులు చెల్లింపుల సమస్య త్వరలో తీరనుంది. కరెంటు బిల్లు బకాయిలు రూ.2కోట్ల మేర ఉంది. వీటిని పక్కన పెట్టి ప్రస్తుతం నెలవారీగా బిల్లుల చెల్లింపులు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో కేవలం నెలవారీగా వచ్చే రూ.4లక్షల బిల్లులు చెల్లిస్తున్నాం. పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-07-08T10:34:14+05:30 IST