గ్రీన్‌సిటీ లక్ష్యంగా...

ABN , First Publish Date - 2020-07-08T10:22:31+05:30 IST

ఒకప్పుడు అడవులతో ఉమ్మడి జిల్లా ఆకుపచ్చగా కళకళలాడేది. రోజురోజుకు అడవులను నరికివేస్తుండడం, పట్టణీకరణ పెరిగి కాంక్రీట్‌..

గ్రీన్‌సిటీ లక్ష్యంగా...

నగరంలో 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం 

 కడియం నుంచి పూలు, పండ్ల మొక్కలను తెప్పించిన అధికారులు 

 రూ. 10 కోట్లతో బల్దియా ఏర్పాట్లు 


కరీంనగర్‌ టౌన్‌, జూలై 7: ‘ఒకప్పుడు అడవులతో ఉమ్మడి జిల్లా ఆకుపచ్చగా కళకళలాడేది. రోజురోజుకు అడవులను నరికివేస్తుండడం, పట్టణీకరణ పెరిగి కాంక్రీట్‌ జంగల్‌గా మారుతుండడంతో పర్యావరణం దెబ్బతింటున్నది. వర్షాలు సకాలంలో కురియక తాగు, సాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోతులు, ఇతర వన్య మృగాలు ఆకలి, దప్పికను తీర్చుకునేందుకు గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నాయి. తెలంగాణాకు హరితహారం కార్యక్రమాల్లో విస్తృతంగా మొక్కలు నాటి అడవులను పెంచాలి.


జిల్లాకు అటవీసంపదలో పూర్వవైభవం తెవాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కరీంనగర్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 105 కోట్ల బడ్జెట్‌లో 10.5 కోట్ల రూపాయల నిధులను ఆరో విడత హరితహారం కార్యక్రమానికి కేటాయించింది.   విస్తారంగా మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను 80 నుంచి 90శాతం బతికించడం, గతంలో నాటిన వాటిలో చనిపోయిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలు నాటాలని నిర్ణయించింది. 


నగరంలో మియావాకీ చిట్టడవులు

కరీంనగర్‌ పట్టణంలోనే ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని చేరుకునే విధంగా బల్దియా ముందుకు వెళ్తున్నది. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్పొరేషన్‌ పరిధిలో  15 చోట్ల మియావాకీ చిట్టడవులను పెంచేందుకు రెండు లక్షల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. ప్రతి ఇంటికి ఆరు చొప్పున పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేసేందుకు కడియం నుంచి మూడు మొక్కలను తెప్పిస్తున్నారు. కలెక్టరేట్‌, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్కులు, ఇతర ఖాళీ స్థలాల్లో 2 లక్షల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. నగరంలోని 14.5 కిలో మీటర్ల ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారులకు ఇరువైపులా లక్షవరకు అందమైన పూల మొక్కలను నాటేందుకు ఏర్పాటు చేస్తున్నారు. డివైడర్ల మధ్య 25 వేల మొక్కలను, ఎల్‌ఎండీ ఆనకట్టు సమీపంలో మిగిలిన లక్ష 75 వేలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. శాతవాహన యూనివర్సిటీ, ఎస్సారార్‌ కళాశాల, స్పోర్ట్స్‌ సెంటర్‌, సదాశివపల్లి, ఎల్‌ఎండీ, రేకుర్తి, తీగలగుట్టపల్లితోపాటు విలీన గ్రామాల్లో మియావాకీ తరహా చిట్టడవుల పెంపకాన్ని ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. 


నాటిన మొక్కల సంరక్షణ

గత నెల 25న మంత్రి గంగుల కమలాకర్‌ హరితహారం కార్యక్రమాన్ని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాపులో ప్రారంభించి ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలో ఇప్పటికే 25 వేలకు పైగా గుంటలు తవ్వి మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారంలో నాటేందుకు అవసరమైన మొక్కలను తెప్పించడం, గుంతలు తవ్వడం, నాటిన మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయడం, ట్యాంకర్లతో నీరు పోయడం వంటి ఏర్పాట్ల కోసం టెండర్లను నిర్వహించారు. జూలై 28 వరకు నగరంలో దాదాపు 8 లక్షలకు పైగా మొక్కలు నాటాలని, ఆ తర్వాత నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.


హరిత నగరంగా మార్చడమే లక్ష్యం...: మేయర్‌ వై.సునీల్‌రావు 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు కరీంనగర్‌ను హరితనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన మొక్కల్లో 90 శాతం మేరకు బతికించాలని పిలుపునిచ్చారు. గతంలో నాటిన వాటిలో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని నిర్ణయించుకొని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. నెలాఖరులోగా 8 నుంచి 10 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

Updated Date - 2020-07-08T10:22:31+05:30 IST