నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు..

ABN , First Publish Date - 2020-12-01T05:52:27+05:30 IST

పొలం కొనుగోలులో తాను మధ్యవర్తిగా ఉన్నందుకు తాను చేయని నేరానికి తన కుటుంబాన్ని నిర్బంధించి నెలరోజుల పాటు చిత్రహింసలు పెట్టారని సత్తెనపల్లి మండలం కందులవారిపాలేనికి చెందిన మూలా రామిరెడ్డి రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు..

స్పందనలో రూరల్‌, అర్బన్‌ పోలీసులకు బాధితుల ఫిర్యాదు 


గుంటూరు, నవంబరు 30:  పొలం కొనుగోలులో తాను మధ్యవర్తిగా ఉన్నందుకు తాను చేయని నేరానికి తన కుటుంబాన్ని నిర్బంధించి నెలరోజుల పాటు చిత్రహింసలు పెట్టారని సత్తెనపల్లి మండలం కందులవారిపాలేనికి చెందిన మూలా రామిరెడ్డి రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ మధ్యవర్తిత్వంలో భాగంగా శానంపూడిలో 21 ఎకరాల పొలం ఉందని పిడుగురాళ్ళకు చెందిన అల్లూరి పరమేశ్వరరావుకు చెప్పానన్నారు. అందుకు పరమేశ్వరరావు సమ్మతించి అక్కడి బ్రోకర్‌ కిశోర్‌ సంప్రదించారన్నారు. కిశోర్‌ ద్వారా రైతులు పొనుగుపాటి కృష్ణారావు, కన్నమనేని ఆదిలక్ష్మిలను కలసి పొలం తాకట్టు రిజిస్ర్టేషన్‌కు మాట్లాడుకున్నారన్నారు. కృష్ణారావు పది ఎకరాలు , ఆదిలక్ష్మి 11 ఎకరాలు, పరమేశ్వరరావుకు రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. తనకు కమీషన్‌ కింద రెండు లక్షలు ఇచ్చాడని రామిరెడ్డి పేర్కొన్నాడు. అయితే అక్కడ స్థలం లేకపోయినా తప్పుడు పత్రాలతో తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసినట్టు పరమేశ్వరరావు గుర్తించి మిగిలిన డబ్బులు ఇస్తానని నమ్మకంగా పిడుగురాళ్ల పిలిపించి ఆయన ఇంట్లో తనను మరో బ్రోకర్‌ కిశోర్‌, రిజిస్ట్రేషన్‌ చేసిన కృష్ణారావు, ఆదిలక్ష్మిలను బంధించాడన్నారు. ఆరోగ్యం సరిగ్గా లేదని కృష్ణా రావును గర్భిణి అయిన ఆదిలక్ష్మిలను వదిలివేసి తామిద్దరినీ తీవ్రంగా కొట్టి హింసించాడన్నారు. రిజి స్ట్రేషన్‌తో సహా రూ.17 లక్షలు ఇచ్చి రూ.80 లక్షలు ఇచ్చినట్టుగా ఇద్దరి చేత నోట్లు రాయించుకున్నాడన్నారు. ఆ తర్వాత తనను తన తల్లిదండ్రులు జగ్గాయమ్మ, సత్యన్నా రాయణరెడ్డి, పిల్లలను రోజుల తరబడి నిర్బంధించి తీవ్రంగా కొట్డాడన్నారు. తాకట్టులో ఉన్న  20 సవర్ల బంగా రాన్ని విడిపించుకుని ఆయనే తీసుకున్నాడన్నారు. దీనిపై తాము గతంలో రెండుసార్లు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ పిడుగురాళ్ళ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.  


అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి వివాదంలో తన భార్య లక్ష్మిపై తన సోదరుడు రామకృష్ణ బండరాయి వేసి కాలు విరగకొట్టాడని పిడుగురాళ్ల పరిధిలోని జానపాడుకు చెందిన బండి కోటేశ్వరరావు రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కాలు విరగటంతో తన భార్య నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చామన్నారు. వైద్యులు సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన రిపోర్టును పిడుగురాళ్ల రూరల్‌ పోలీసులు కనీసం ఫిర్యాదు కూడాఆ తీసుకోవటం లేదని కోటేశ్వరరావు అన్నారు. 


తాము టీడీపీ సానుభూతిపరురాలిని కావటంతో ఉద్యోగం మానేసి వెళ్ళాలని వైసీపీ మండల కన్వీనర్‌ మన్నవ వీరనారాయణ బెదిరిస్తు న్నాడని వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ రమాదేవి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తన భర్తను వైసీపీలోకి మారాలని ఎంతోకాలంగా వీరనారాయణ బెదిస్తున్నాడన్నాడన్నారు. తనపై తప్పుడు ఫిర్యా దులు చేసి తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు. 


అధికార పార్టీ నాయకుడు పొక్లెయినర్‌తో తన పూరింటిని నేలమట్టం చేసి తనను రోడ్డుమీదకు నెట్టారని మంగళగిరి మండలం నూతక్కికి చెందిన వృద్ధురాలు పఠాన్‌ ఇమాంబి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. శివరామిరెడ్డి అనే వ్యక్తి తనకు రూ.50వేలు అప్పుగా ఇచ్చి ఐదుసెంట్ల స్థలాన్ని తాకట్టు రిజిస్ట్రేషన్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడన్నారు. రూ.50వేలకు తాను వడ్డీతోపాటు, అసలు కూడా చెల్లించానని, అయితే ఐదుసెంట్ల స్థలం తనదేనని, కొదినెలలుగా బెదిరిస్తున్నాడన్నారు. రెండునెలలు క్రితం దౌర్జన్యంగా తన ఇంటి కప్పును పీకేయించాడన్నారు.  శివరామిరెడ్డి  ఆయన కుమారుడు మాధవరెడ్డి కలసి తన ఆస్తిని కబ్జా చేసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు వాపోయింది.  


తాడికొండ మండలం బండారుపల్లికి చెందిన డ్వాక్రా గ్రూపులను పర్యవేక్షించే యానిమేటర్‌ జొన్నకూటి అనూష రూ.7లక్షలతో ఉడాయించిందని డ్వాక్రా మహిళలు లావణ్య, రమణ, తదితరులు పదిమంది అర్భన్‌ ఎస్పీ కార్యాలయంను ఆశ్ర యించారు.  దీనిపై తాడికొండ స్టేషన్‌లో ఫిర్యాదు చే యగా పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసు కోవటం లేదని  మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. 


ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకొని మోసం చేశారని ఏటీ అగ్రహారం 8వ లైనుకు చెందిన నాగపుష్పదేవి అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సాయికృష్ణ అనే వ్యక్తి తననుంచి డబ్బు తీసుకున్నాడన్నారు. తనకు కోర్టు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6లక్షలు తీసుకొని మోసం చేశారని చేబ్రోలు మండలం చీలిపాలేనికి చెందిన చిలువూరి రాజీవ్‌ హర్ష ఫిర్యాదు చేశాడు.  

ఆడపిల్ల పుట్టిందని కారణంతో తనను పుట్టింటింటికి గెంటేశారని అనుపాలేనికి చెందిన పమిడిమళ్ళ విజయలక్షి ఫిర్యాదు చేసింది. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 


తమను కులం పేరుతో ధూషించగా దానిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వినుకొండ మండలం నాగులవరానికి చెందిన బాధితురాలు పసుపులేటి ప్రేమజ్యోతి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-12-01T05:52:27+05:30 IST