నన్ను కిడ్నాప్ చేశారు.. కొద్ది గంటల్లో పెళ్లనగా వరుడి నుంచి మెసేజ్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-04-29T22:39:26+05:30 IST

‘నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. కాపాడండి..’ అంటూ ఓ యువకుడు తన స్నేహితులకు మెసేజ్ చేశాడు. మరికొద్ది గంటల్లోనే అతడి పెళ్లి. పెళ్లి మండపంలో వధువు సహా అంతా వరుడి రాకకై ఎదురుచూస్తున్నారు.

నన్ను కిడ్నాప్ చేశారు.. కొద్ది గంటల్లో పెళ్లనగా వరుడి నుంచి మెసేజ్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

‘నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. కాపాడండి..’ అంటూ ఓ యువకుడు తన స్నేహితులకు మెసేజ్ చేశాడు. మరికొద్ది గంటల్లోనే అతడి పెళ్లి. పెళ్లి మండపంలో వధువు సహా అంతా వరుడి రాకకై ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే వరుడు కిడ్నాప్ అయ్యాడంటూ మెసేజ్ రావడంతో వదువు కుటుంబంలో కలకలం మొదలయింది. వరుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అంతా గాలించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో ఆ వధువు కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దాదాపు ఏడాది తర్వాత ఆ వరుడు దొరికిపోయాడు. అతడిని పట్టుకుని ఆరా తీస్తే అసలు కథేంటో వెలుగులోకి వచ్చింది. అతడి నిర్వాకం బయటపడింది. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూచక్కల్ ప్రాంతానికి చెందిన జసీమ్ అనే 28 ఏళ్ల కుర్రాడికి గతేడాది మార్చి 21న పెళ్లి జరగాల్సి ఉంది.  కానీ పెళ్లి రోజు ఉదయమే అతడు కనిపించకుండా పోయాడు. పెళ్లి మండపంలో అందరూ అతడి కోసం వెతుకుతోంటే, కొద్ది సేపటి తర్వాత అతడి ఫోన్ నుంచి ‘నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. రక్షించండి’ అంటూ స్నేహితులకు మెసేజ్ వచ్చింది. ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో కంగారుపడిన వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇడుక్కి పోలీసులు అతడి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో వధువు తాతయ్య మరణించాడు కూడా. 


అప్పటి నుంచి కనిపించకుండా పోయిన జసీమ్ ఇటీవలే మళ్లీ తన స్నేహితులకు కాంటాక్ట్ లోకి వచ్చాడు. ‘నాకు పెళ్లి ఇష్టం లేదు. అందుకే కిడ్నాప్ డ్రామా ఆడి తప్పించుకున్నా’ అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ తర్వాత అతడి కోసం ఆరా తీసినా ఎవరికీ తెలియకూడదని నెంబర్లు మార్చసాగాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కేరళలోని కన్నూర్, త్రిశ్శూర్, మలప్పురం, అలువా, పెరంబవూర్, తమిళనాడు రాష్ట్రంలోని కంభం, మధురై, పొలాచ్చి, కోయంబత్తూర్, ఊటీ, కర్ణాటకలోని మంగళూర్ నగరాల్లో నివసించసాగాడు. మంగళూరులో ఉండగా అతడిని బైక్ చోరీ చేసిన ఘటనలో పోలీసులు పట్టుకున్నారు. అతడి గురించి ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళూరు పోలీసులు ఇడుక్కి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇడుక్కి పోలీసులకు అతడిని అప్పగించారు. బుధవారం అతడిని చెర్తాలా కోర్టులో ప్రవేశ పెట్టడంతో రిమాండ్ విధించారు. మొత్తానికి పెళ్లి నుంచి ఏడాది పాటు తప్పించుకున్నా, పోలీసుల చేతి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. 

Updated Date - 2021-04-29T22:39:26+05:30 IST