గాడిన పడుతున్న సర్కారుబడి

ABN , First Publish Date - 2021-10-24T06:35:01+05:30 IST

కరోనాసంక్షోభం మొదట సర్కారు బడుల ఆస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినప్పటికీ ఆ తరువాత ఆ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది.

గాడిన పడుతున్న సర్కారుబడి
విద్యార్థులతో కళకళలాడుతున్న ప్రభుత్వ పాఠశాల

భారీగా పెరిగిన అడ్మిషన్‌లతో కళకళ 

హాజరు శాతం రెట్టింపు 

డీఈఓ పకడ్బందీ తనిఖీలతో మారిన పాఠశాలల పరిస్థితి 

ప్రయివేటుకు ధీటుగా బోధన సాగిస్తున్న ఉపాఽఽధ్యాయులు 

వలంటీర్ల నియామకాలేవీ ?

సౌకర్యాలపై స్పందన కరువు

నిర్మల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : కరోనాసంక్షోభం మొదట సర్కారు బడుల ఆస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినప్పటికీ ఆ తరువాత ఆ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. కరోనాకారణంగా ప్రైవేటు పాఠశాలలపై మోజు తగ్గిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల వైపుదారి మళ్లించడం శుభసూచకంగా మారుతోంది. గతానికి భిన్నం గా ప్రభుత్వ పాఠశాలల్లో విపరీతంగా అడ్మిషన్‌లు పెరిగిపోతున్న కారణంగా ఆ పాఠశాలలకు కొత్తవైభవం చేకూరుతోంది. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు తమ పాఠశాలలను రక్షించుకునేందుకు ముందుకు రావడమే కాకుండా ప్రవేశాల పెరుగుదలకు ఆ తరువాత మెరుగైన భోధన అందించేందుకు ముందుకు రావడం విద్యారంగంలో కొత్త పరిణామం. క్రమంగా ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పడిపోయి సర్కారు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగిన కారణంగా విద్యార్థులు పోటీ పడి చదువులు సాగిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 76,276 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల పరిధిలోని 695 పాఠశాలల్లో ప్రస్తుతం 53,695 మంది విద్యార్థులు నమోదయ్యారు. అయితే ఇటీవల కొత్త డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి వచ్చీ రాగానే పాతపంథాను పక్కనపెట్టి కొత్తచర్యలకు శ్రీకారం చుట్టారు. మొదట ఉపాధ్యాయ సంఘాలతోనూ, హెడ్మాస్టర్‌లతోనూ, అలాగే సంబంధిత అధికారులతోనూ జిల్లాలో సర్కారు బడుల పరిస్థితి మెరుగుకోసం ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల ఆఽధారంగా ఆయన పకడ్భందీ యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించి ఆ యాక్షన్‌ప్లాన్‌కు అనుగుణంగా చర్యలు మొదలుపెట్టారు. ఓ వైపు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడం, అలాగే విద్యార్థులకు అందుతున్న బోధన తీరును స్వయంగా పరిశీలించడం, దీంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించడం లాంటి చర్యలు చేపట్టారు. నిరాటకంగా తనిఖీలు జరిపి పాఠశాలల్లోని లోటుపాట్లను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. అలాగే పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో కూడా సమావేశమై బోధనను మెరుగుపర్చాలని, విధులపట్ల నిర్లక్ష్యం చేయవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినా పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్ధుబాటు చేసి బోధనకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రతీరోజూ పాఠశాలల పనితీరును తెలుసుకుంటూ దానికి అనుగుణంగా సలహాలు, సూచనలు అందించడంతో టీచర్ల పనితీరులో సైతం మార్పు కనిపిస్తోంది. ఇలా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పూర్తిగా గాడిన పడడం, అలాగే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా బోధన కొనసాగుతున్న నేపథ్యంలో సర్కారు విద్యారంగం పూర్వకళకు చేరువవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది లా ఉండగా పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు సరిపోక ప్రధానసమస్యగా మారుతోంది. ప్రస్తుతకీలక సమయంలో టీచర్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖదేనన్న వాదనలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా విద్యా వలంటీర్ల నియామకం చేపట్టాలంటూ అటు ఉపాధ్యాయసంఘాలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు డి మాండ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విద్యావలంటీర్ల నియామకం విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పందన వెలిబుచ్చకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. దీంతో పాటు అనేక పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కూడా లేకపోవడం కొంత ఇబ్బంది కరంగా మారుతోందంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొన్ని పాఠశాలల్లో గదులు సరిపోకపోవడంతో ఆవరణలోనే పాఠాలు బోధిస్తున్నారు. అలాగే తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల లాంటి సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. 

పూర్వవైభవం దిశగా

ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవం దిశగా పయనిస్తున్నాయంటున్నారు. అన్నిరకాల ప్రభుత్వ యజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ప్రస్తుతం 76,276 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. ఇందులో నుంచి మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 53,698 మంది, మహత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2,474 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 3870 మంది, సోషల్‌వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 2,822 ట్రైబల్‌వెల్పేర్‌ ఆశ్రమ పాఠశాలల్లో 3174 మంది విద్యార్థులు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 4,906 మైనార్టీ వెల్పేర్‌లో 1731, మినీ గురుకులంలో 112, డీఎన్‌టీ స్కూల్‌లలో 194, మోడల్‌స్కూల్‌లలో 790 మంది విద్యార్థులు ప్రస్తుతం తమ భోధనను కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్య గతానికి రెండింతలుగా ఉందంటున్నారు. ఇలా విపరీతంగా విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో సర్కారు బడులకు పూర్వవైభవం చేకూరిందన్న అభిప్రాయాలున్నాయి. ఈ వైభవాన్ని కాపాడేందుకు సర్కా రు మరింత చేయూతనందించాల్సిన అవసరం ఉందని అలాగే ఈ వైభవం చేజారకుండా చూసుకునే బాధ్యత టీచర్లు, విద్యాశాఖదేనంటున్నారు. 

సమస్యలతో కుస్తీ

ప్రస్తుతం చాలా పాఠశాలల్లో విద్యార్థులసంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి వారిని సర్దుభాటు చేశారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ జరిగే వరకు తాత్కాలిక ప్రాతిపాదికన విద్యా వాలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘా లు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దీంతో పాటు చాలా పాఠశాలల్లో కనీ సం మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయన్న విమర్శలున్నాయి. సౌకర్యాల లేమితో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. తాగునీటితో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా కొన్ని పాఠశాలల్లో లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోందని చెబుతున్నారు. 

డీఈఓ తనిఖీలతో పరిస్థితుల్లో మార్పు 

కాగా నూతనంగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా మలిచేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన అన్ని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ పాఠశాలల పనితీరు మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత హెడ్మాస్టర్‌లు, ఉపాధ్యాయులతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించి ఆ పాఠశాలల పనితీరు మెరుగు పడేందుకు చర్యలు చేపట్టారు. అలాగే పాఠశాలల్లోని సౌకర్యాలపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మధ్యాహ్నభోజన విషయంలో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. ఆయన చేపట్టిన కొత్తతరహా కార్యాచరణతో పాఠశాలల పనితీరు మరింతగా మెరుగు పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రైవేటుకు ధీటుగా..

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతున్నాయి. దీనికి విద్యార్థుల నమోదు గణనీయంగా పెరగడమే సాక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ గల టీచర్లు ఉన్న కారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇటువైపు మొగ్గు చూపుతుండడం మంచి పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బోధన అందించడమే కాకుండా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నాం. పకడ్భందీగా పాఠ్య ప్రణాళికను అమలు చేయనున్నాం. ప్రస్తుతం ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో జిల్లాను టాఫ్‌ పొజీషన్‌లో ఉంచేందుకు కార్యాచరణ రూపొందించాం. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ సహకారంతో ఉమ్మ డి ప్రణాళికను అమలు చేయబోతున్నాం. 

- డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖఅధికారి, నిర్మల్‌ 


Updated Date - 2021-10-24T06:35:01+05:30 IST