కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం
ABN , First Publish Date - 2021-05-27T19:22:39+05:30 IST
కరోనా నివారణ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం గురువారం జరిగింది.
గుంటూరు: కరోనా నివారణ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం గురువారం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గ్రూప్ అఫ్ మినిస్టర్స్ కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్స్‌పై, కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు పలు అంశాలపై మంత్రుల కమిటీ సమావేశంలో చర్చించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు అన్ని చర్యలు పటిష్టంగా అమలు జరగాలన్నారు. ప్రతి హాస్పిటల్‌లో 50శాతం ఆరోగ్య శ్రీ పెషేంట్లకు బెడ్స్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు జరగాలని స్పష్టం చేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్‌పై చర్యలకు వెనుకాడ వద్దని ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అదేశించారన్నారు. ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాలని సూచించారు.
ప్రతి హాస్పిటల్‌లో కరోనా పెషేంట్స్‌కు ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రెమిడీసివర్ ఇంజక్షన్స్‌లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠినంగా వ్యవహారించాలన్నారు. ఇంజక్షన్స్ అన్ని హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. బ్లాక్ ఫంగస్‌పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన రోగులకు వైద్యం నిరాకరించే హాస్పిటల్స్‌పై కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ,హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, కురసాల కన్నబాబు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ , డీజీపీ గౌతమ్ సవాంగ్ , ఎం టి కృష్ణ బాబు, కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.