మీర్‌పేట్‌లో ‘గ్రూప్‌’ రాజకీయం..!

ABN , First Publish Date - 2022-01-17T16:38:13+05:30 IST

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో గ్రూపు రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పడేట్టు కనిపించడంలేదు. మేయర్‌, సొంత పార్టీ కార్పొరేటర్ల మధ్యే వివాదం నడుస్తోంది. పాలకవర్గం కొలువుదీరిన

మీర్‌పేట్‌లో ‘గ్రూప్‌’ రాజకీయం..!

హైదరాబాద్/సరూర్‌నగర్‌: మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో గ్రూపు రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పడేట్టు కనిపించడంలేదు. మేయర్‌, సొంత పార్టీ కార్పొరేటర్ల మధ్యే వివాదం నడుస్తోంది. పాలకవర్గం కొలువుదీరిన మొదటి నుంచీ ఈ గ్రూపులు కొనసాగుతుండగా.. తాజాగా ‘వాట్సాప్‌’ వేదికగా మేయర్‌, ఓ కార్పొరేటర్‌ మధ్య నడిచిన సంవాదం ‘గ్రూప్‌’ రాజకీయాలను మరోమారు బట్టబయలు చేసింది. 

ఎవరి గ్రూపు వారిదే..

అధికార టీఆర్‌ఎ్‌సలో 25 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో నాలుగు గ్రూపులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి సబితారెడ్డి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా.. వారు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. మేయర్‌ (మహిళ) కార్యాలయంలో సక్రమంగా అందుబాటులో ఉండడంలేదని, ఆమె భర్తే పెత్తనం చెలాయిస్తూ కార్పొరేటర్లను చిన్నచూపు చూస్తున్నారని మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై గతంలో సొంత పార్టీ కార్పొరేటర్లు కలెక్టర్‌కు, సీడీఎంఏకు, మంత్రికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తన వార్డులో చేపట్టిన అభివృద్ధి పనుల విషయమై మేయర్‌, డీఈఈ తనకు సమాచారం ఇవ్వలేదని 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ మాదరి సురేఖారమేశ్‌ ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. తనను అవమానపరిచే విధంగా వారి వ్యవహార శైలి ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పనులు చేపట్టిన వార్డు తనదేనని, దాంట్లో జోక్యం చేసుకుని తమను కొందరు కావాలనే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని మేయర్‌ అదే గ్రూప్‌లో సమాధానం ఇచ్చారు. ఒకే పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మధ్య ఇలాంటి సంవాదం జరగడం పట్ల గ్రూప్‌లోని సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు.


బీజేపీ సభ్యులూ..

ఇటీవల కార్పొరేషన్‌ పరిధిలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి 3, 9 డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు ఏరెడ్ల రాజమణీఅంజిరెడ్డి, పెండ్యాల శివపార్వతీనర్సింహ హాజరు కాలేదు. దాంతో సదరు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల చేత చెక్కులు పంపిణీ చేయించడం వివాదాస్పదంగా మారింది. ప్రజా ప్రతినిధులుగానీ, అధికారులుగానీ పంపిణీ చేయల్సిన కల్యాణలక్ష్మి చెక్కులను పార్టీ నాయకుల చేత పంపిణీ చేయించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై బీజేపీ కార్పొరేటర్లు మరుసటి రోజు బాలాపూర్‌ తహసీల్దార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.


దాడులతో హల్‌చల్‌..

టీఆర్‌ఎ్‌సలో గ్రూపులు ఎంతగా ముదిరిపోయాయంటే.. ఇటీవల కొందరు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్‌తో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోగా, ఓ కార్పొరేటర్‌ తన అనుచరులతో దాడి చేసి నానా హంగామా సృష్టించిన సంగతి విదితమే. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేటర్‌పై అట్రాసిటీ కేసు పెట్టి, ఆ తర్వాత బుజ్జగింపులతో ‘రాజీ’ అయ్యారు. అయినా దానికి సంబంధించిన వివాదం ఇంకా అంతర్గతంగా రగులుతూనే ఉన్నదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేషన్‌లో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ‘పర్సంటేజీల’ కోసమే గ్రూపులు ఏర్పాటయ్యాయని, ఎవరికి వారు కాంట్రాక్టర్ల వద్ద అమ్యామ్యాలు తీసుకుని జారుకుంటున్నారని తెలిసింది. మొత్తం మీద మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ సహా ఇతర ప్రజా ప్రతినిధులు గ్రూపులు మెయింటెయిన్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-01-17T16:38:13+05:30 IST