కొండపి వైసీపీలో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు

ABN , First Publish Date - 2020-10-16T22:21:34+05:30 IST

ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోవటంతో ఓడిపోయినా.. ఆ నియోజకవర్గ బాధ్యతలు

కొండపి వైసీపీలో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు

ప్రకాశం: ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేజిక్కించుకోవటంతో ఓడిపోయినా.. ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దాంతోపాటు ఓ నామినేట్‌ పదవిని కూడా ఇచ్చి ఆ ఇన్‌ఛార్జ్‌ని అందలం ఎక్కించారు పార్టీ పెద్దలు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోవాలని ఆదేశాలు ఇచ్చారు. అందరివాడవుతాడనుకున్న ఆ ఇన్‌ఛార్జిని మాత్రం పార్టీ కార్యకర్తలు కొందరు లెక్క కూడా చేయటం లేదు. ఇంతకీ ఎవరా నేత? ఏమిటా కథ? వాచ్ దిస్ స్టోరీ.


ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొండపి నియోజకవర్గ పార్టీ నాయకుల్లో గ్రూపు తగాదాలు సర్వసాధారణం అన్నట్లుగా మారిపోయాయి. గత ఎన్నికలకు ముందే పార్టీలో క్యాడర్ రెండు గ్రూపులుగా విడిపోయింది. అప్పట్లో పార్టీ ఇన్‌ఛార్జ్ అశోక్‌కుమార్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా నాయకులు విడిపోయారు. అప్పటి పరిణామాల నేపథ్యంలో అశోక్‌కుమార్‌ని తప్పించి మాదాసి వెంకయ్యను రంగంలోకి దించి పార్టీ టిక్కెట్‌ ఇచ్చారు. కొండపిలో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి అనంతరం వెంకయ్యను పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగించారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవిని కూడా కట్టబెట్టారు. అయితే క్రమంగా నియోజకవర్గ నేతల్లో తిరిగి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి.


కొండపి నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ రెండు, మూడు గ్రూపులుగా విడిపోయింది. ఆయా వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా ఎవరివారే అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి సాధారణ కార్యకర్తల్లో అయోమయానికి దారితీసింది. దీంతోపాటు నియోజకవర్గంలో అధికార యంత్రాంగం బదిలీల్లో కూడా ఇద్దరు నాయకులు పోటీపడి తమకు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇవ్వమంటూ ఎవరికి వారు పార్టీ ముఖ్య నేతలకు సిఫార్సులు చేస్తున్నారు. అలాగే తాము చెప్పిన పనులు చేయాలంటూ నియోజకవర్గంలో అధికారులపై ఒత్తిడి చేస్తున్నారట. ఇక నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఎవరికివారు చేస్తుండటంతో.. ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక వైసీపీ జిల్లా నాయకులు ఆ కార్యక్రమాలకు కూడా ముఖం చాటేస్తున్నారని తెలిసింది. 


కొండపి నియోజకవర్గంలో పెత్తనం కోసం వైసీపీ నాయకులు ఇద్దరు పోటీ పడటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని సమాచారం. ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో జిల్లాలో ముఖ్యనేత, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న ఒక సామాజికవర్గం వారిని దూరం పెడుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారట. కొండపి మండలంలో కె.ఉప్పలపాడుకి చెందిన పిచ్చిరెడ్డి, వెంకటాద్రిరెడ్డి తదితర నాయకుల సారథ్యంలో పలు గ్రామాలవారు ఒక గ్రూపుగా ఏర్పడి వెంకయ్య విధానాలను నిరసిస్తూ పనిచేయటం ప్రారంభించారట. అలాగే మర్రిపూడి మండలంలో వాకా వెంకటరెడ్డి, రమణారెడ్డి, నాగయ్య తదితరుల సారథ్యంలో ఒకవర్గం.. విజయభాస్కరరెడ్డి, మల్లికార్జునరావుల సారథ్యంలో మరో వర్గం ఏర్పడిందని సమాచారం. విజయభాస్కరరెడ్డి ఇటీవల గ్రామగ్రామాన పర్యటించి వెంకయ్యకు వ్యతిరేకంగా నాయకులను సమన్వయం చేసే కార్యక్రమం కూడా నిర్వహించారని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.


ఇక పొన్నలూరులో ఒకవైపు మాజీ సర్పంచ్‌ ప్రసాద్, మరోవైపు పార్టీ మండల మాజీ కన్వీనర్‌ బెజవాడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నారని తెలిసింది. జరుగుమల్లి మండలంలో పార్టీ నాయకుల మధ్య విభేదాల వ్యవహారం గుంభనంగా సాగుతోంది. సింగరాయకొండ మండలంలో ఇటీవల వర్గపోరు పెరిగిపోయింది. ఆ మండల పార్టీ కన్వీనర్‌ తాండ్ర రామమూర్తి, చిమటా శ్రీను, మాదాల శంకర్‌, సామంతుల రవికుమార్‌ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఓ వర్గం వెంకయ్యకు వ్యతిరేకంగా పనిచేస్తోందని టాక్. అటు టంగుటూరు మండలంలోనూ ప్రస్తుతం వైసీపీ నాయకులు మూడు గ్రూపులుగా ఏర్పడ్డాయట. ఆరంభంలో వెంకయ్యను భుజాన వేసుకుని మోయడంతోపాటు తొలి నుంచీ పార్టీలో ఉన్న అయ్యవారయ్య, మండల పార్టీ కన్వీనర్‌ సూదనగుంట హరిబాబు గ్రూపు ఒకవైపు ఉంది. కారుమంచి విజయభాస్కర్‌ రెడ్డి, బొట్ల రామారావు తదితరుల నాయకత్వంలో మరో గ్రూపు ఇటీవల చురుగ్గా వ్యవహరిస్తోందని సమాచారం. 


ఇలా కొండపి నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరాయి. దీంతో పార్టీలో తనపై ఏదో జరుగుతోందని పార్టీ ఇన్‌ఛార్జి మాదాసి వెంకయ్య ఆందోళన చెందుతున్నారట. ఆయన వెంటనే హైదరాబాద్‌ వెళ్లి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారని తెలిసింది. అలాగే పార్టీ ఇన్‌చార్జి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కూడా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి బాలినేనిని కలిసిన సమయంలో వెంకయ్య.. నియోజకవర్గంలోని పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేశారట. ముఖ్యంగా టంగుటూరు మండలంలో నెలకొన్న పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల సింగరాయకొండ మండలంలో ఒక కింది స్థాయి నాయకుడు త్వరలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా జూపూడి ప్రభాకరరావు రాబోతున్నాడంటూ వ్యాఖ్యానించటం, అది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడాన్ని కూడా వెంకయ్య బాలినేని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 


మొత్తంమీద కొండపి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గవిభేదాల వ్యవహారం మొదటి నుంచి పార్టీ  అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఏదోఒక పరిష్కారాన్ని వెతికి సమస్యకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మాదాసి వెంకయ్యనే కొనసాగిస్తారా.. ఉన్న పదవితోనే ఆయన్ను సరిపెట్టుకోమంటారా.. బాధ్యతలు తిరిగి పాత వారిలో మరొకరికి అప్పగిస్తారా.. లేక కొత్తవారిని వెతికి తీసుకువస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2020-10-16T22:21:34+05:30 IST