పెరగనున్న చమురు ఉత్ప‌త్తి

ABN , First Publish Date - 2021-07-19T06:21:23+05:30 IST

పెట్రో మంటలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నుంచి రోజువారీ ముడి చమురు ఉత్పత్తి మరో 20 లక్షల బ్యారళ్ల మేరకు పెరగనుంది.

పెరగనున్న చమురు ఉత్ప‌త్తి

  • వచ్చే నెల నుంచి అందుబాటులోకి 
  • ఒపెక్‌లో చల్లారిన ఇంటి పోరు


దుబాయ్‌: పెట్రో మంటలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నుంచి రోజువారీ ముడి చమురు ఉత్పత్తి మరో 20 లక్షల బ్యారళ్ల మేరకు పెరగనుంది. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌), అందులో సభ్యత్వం లేని రష్యా మధ్య ఆదివారం జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో చమురు ఉత్పత్తి పెంపుపై ఒపెక్‌ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మధ్య తలెత్తిన విభేధాలు తొలగిపోయాయి. వచ్చే ఏడాది మే నుంచి రోజువారీ ముడి చమురు ఉత్పత్తి మరో 16.3 లక్షల బ్యారళ్ల మేర పెంచుతూ, కొత్త కోటా విధానం ప్రవేశపెట్టేందుకు ఒపెక్‌ దేశాలు, రష్యా అంగీకరించాయి. ఈ విధానంతో యూఏఈ రోజువారీ ఉత్పత్తి ప్రస్తుతమున్న 31.68 లక్షల బ్యారళ్ల నుంచి 35 లక్షల బ్యారళ్లకు పెరగనుంది. దీంతో యూఏఈ కూడా రోజువారీ ఉత్పత్తి పెంపునకు ఆమోదం తెలిపింది. ఉత్పత్తి నియంత్రిత విధానాన్ని వచ్చే ఏడాది డిసెంబరు వరకు పొడిగించేందుకూ అన్ని దేశాలు అంగీకరించాయి. 


భారత్‌కు ఉపశమనం 

ఒపెక్‌ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరా పెరిగి.. ధరలు తగ్గనున్నాయి. ఈ వార్త వెలువడిన వెంటనే బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 73 డాలర్లకు దిగొచ్చింది. ఆగస్టు నుంచి పెరిగే ఉత్పత్తితో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు భారత్‌ వంటి దేశాలకు లాభించనుంది. భారత్‌లో ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ సెంచరీ కొట్టి వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది. ఒపెక్‌ తాజా నిర్ణయంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది.

Updated Date - 2021-07-19T06:21:23+05:30 IST