జీఎస్‌టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-03-02T06:26:26+05:30 IST

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు మించాయి. ఫిబ్రవరి నెలకు జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.1,13,143 కోట్లకు చేరుకున్నాయి. ఈ జనవరిలో వసూలైన రూ.1,19,875 కోట్లతో

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లు

ఫిబ్రవరిలో 7 శాతం వృద్ధి నమోదు

వరుసగా 5 నెలలు లక్ష కోట్ల పైనే..  


న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు మించాయి. ఫిబ్రవరి నెలకు జీఎస్‌టీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.1,13,143 కోట్లకు చేరుకున్నాయి. ఈ జనవరిలో వసూలైన రూ.1,19,875 కోట్లతో పోలిస్తే మాత్రం తక్కువే. కాగా, 2020 ఫిబ్రవరిలో జీఎస్‌టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లుగా ఉంది. గత నెల స్థూల వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.21,092 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.27,273 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) రూ.55,253 కోట్లుగా నమోదైంది. సెస్‌ రూపంలో మరో రూ.9,525 కోట్లు వసూలైంది. కాగా, ఐజీఎస్‌టీ ఆదాయంలో రూ.24,382 కోట్లు, సెస్‌ రెవెన్యూలో రూ.660 కోట్లు వస్తు దిగుమతులపై వసూలైందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇది స్పష్టమైన సంకేతమని పేర్కొంది. మరిన్ని విషయాలు.. 

  • సాధారణ సెటిల్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్‌టీ ఆదాయంలో రూ.22,398 కోట్లు సీజీఎస్‌టీలో, రూ.17,534 ఎస్‌జీఎస్‌టీలో జమ చేసింది. ఇందుకు అదనంగా, ఐజీఎస్‌టీ ప్రత్యేక సెటిల్‌మెంట్‌ కింద రూ.48,000 కోట్లను కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెరి సగం చొప్పున పంచింది. 
  • సాధారణ, ప్రత్యేక పరిష్కారాల అనంతరం సీజీఎస్‌టీ రూ.67,490 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.68,807 కోట్లకు పెరిగింది. 


గడిచిన 5 నెలల్లో జీఎస్‌టీ ఆదాయం 

నెల రూ.కోట్లు 

2020 అక్టోబరు 1,05,155

2020 నవంబరు 1,04,963

2020 డిసెంబరు 1,15,174

2021 జనవరి 1,19,875

2021 ఫిబ్రవరి 1,13,143


జీఎస్‌టీ లోటు భర్తీకి రూ.4,000 కోట్లు 

జీఎస్‌టీ పరిహారం లోటు భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం 18వ వాయిదా కింద రూ.4,000 కోట్లు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 23 రాష్ట్రాలకు రూ.3,677.74 కోట్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.322.26 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు రూ.1.04 లక్షల కోట్లు విడుదల చేసింది. అందులో ఏపీకి రూ.5,051 కోట్లు, తెలంగాణకు రూ.5,017 కోట్లు లభించాయి. ఇక ప్రత్యేక రుణాల సేకరణకు సంబంధించి ఇప్పటివరకు ఏపీకి రూ.2,306.59 కోట్లు, తెలంగాణకు రూ.2,027.33 కోట్ల మేరకు కేంద్రం అనుమతిచ్చింది. జీఎస్‌టీ పరిహారం లోటు భర్తీలో ఇప్పటివరకు 94 శాతం భర్తీ చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. 

Updated Date - 2021-03-02T06:26:26+05:30 IST