రూ. 1.31 లక్షల కోట్లు వసూలు... జీఎస్‌టీ నవంబరు రికార్డ్...

ABN , First Publish Date - 2021-12-01T23:23:29+05:30 IST

జీఎస్‌టీ వసూళ్ళలో మరోమారు రికార్డు నమోదైంది. వరుసగా ఐదో నెల రూ. లక్ష కోట్లు దాటాయి. నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి.

రూ. 1.31 లక్షల కోట్లు వసూలు... జీఎస్‌టీ నవంబరు రికార్డ్...

న్యూఢిల్లీ : జీఎస్‌టీ వసూళ్ళలో మరోమారు రికార్డు నమోదైంది.  వరుసగా ఐదో నెల రూ. లక్ష కోట్లు దాటాయి. నవంబరులో జీఎస్‌టీ  వసూళ్లు రూ. 1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జులై నెలలో జీఎస్‌టీని  అమల్లోకి తెచ్చిన తర్వాత... ఇది రెండో గరిష్టం. నవంబరు నెలలో రూ. 1,31,526 కోట్ల జీఎస్‌టీ  వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్‌టీ  రూ. 23,978 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్‌టీ  రూ. 31,127 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ రూ. 66,815 కోట్లుగా నమోదైంది. దిగుమతులపై వసూలు చేసిన రూ. 32,165 కోట్లతో కలిసి సమ్మిళిత జీఎస్‌టీ  రూ. 66,815 కోట్లుగా నమోదైంది. సెస్ రూపంలో రూ. 9606 కోట్లు వచ్చాయి. ఇందులో రూ.653 కోట్లు వస్తు దిగుమతులపై వచ్చాయి.


గతేడాది నవంబర నెలతో పోలిస్తే ఈ దఫా జీఎస్‌టీ  వసూళ్లు 25 %, 2019 లో ఇదే నెలతో పోలిస్తే 27 % పెరిగాయి. జీఎస్‌టీ  అమల్లోకి వచ్చిన తర్వాత... ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనేందుకు ఇది నిదర్శనమని ఆర్థిక శాఖ పేర్కొంది. మొన్నటి అక్టోబరులో జీఎస్‌టీ  వసూళ్లు రూ.1,30,127 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో  రూ. 1.41 లక్షల కోట్లతో జీఎస్‌టీ  వసూళ్లు ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకాయి.


జీఎస్‌టీ వసూళ్లు ఇలా... 

2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ వసూళ్లను పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో రూ. 1.41 లక్షల కోట్లు, మే నెలలో రూ. 97,821 కోట్లు, జూన్‌లో రూ. 92,800 కోట్లు, జూలైలో రూ. 1.16 లక్షల కోట్లు, ఆగస్టులో రూ. 1.12 లక్షల కోట్లు, సెప్టెంబరులో రూ. 1.17 లక్షల కోట్లు, అక్టోబరులో రూ. 1.30 లక్షల కోట్లు, నవంబరులో రూ. 1.31 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Updated Date - 2021-12-01T23:23:29+05:30 IST