జీఎస్‌టీ నష్టపరిహారం : రాష్ట్రాలకు రుణాల విడుదల

ABN , First Publish Date - 2021-10-29T01:56:23+05:30 IST

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తు, సేవల పన్ను

జీఎస్‌టీ నష్టపరిహారం : రాష్ట్రాలకు రుణాల విడుదల

న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నష్టపరిహారం భర్తీ కోసం సొమ్ము చెల్లించడానికి బదులుగా రుణం క్రింద రూ.44,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు క్రింద ఇచ్చిన రుణాల మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 మే 28న జరిగిన 43వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈ రుణాలను విడుదల చేసినట్లు తెలిపింది.


2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.59 లక్షల కోట్లు అప్పు చేసి, దానిని రాష్ట్రాలు, చట్ట సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు బ్యాక్-టు-బ్యాక్ ప్రాతిపదికపై రుణంగా అందజేయాలని 43వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. జీఎస్‌టీ కంపెన్సేషన్ ఫండ్‌కు వసూలైన నిధులు తగ్గినందువల్ల నష్టపరిహారం భర్తీలో లోటు ఏర్పడింది. ఫలితంగా ఏర్పడిన వనరుల లోటును భర్తీ చేయడం కోసం ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. 


కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 15న రూ.75,000 కోట్లు; అక్టోబరు 7న రూ.40,000 కోట్లు రుణంగా విడుదల చేసింది. గురువారం రూ.44,000 కోట్లు విడుదల చేసింది. సుంకాల వసూళ్ళ నుంచి రెండు నెలలకోసారి చెల్లించే జీఎస్‌టీ నష్టపరిహారానికి ఇది అదనం.

 

Updated Date - 2021-10-29T01:56:23+05:30 IST