‘వస్తుసేవల’ వాగ్దాన భంగం

ABN , First Publish Date - 2020-09-19T06:09:18+05:30 IST

వస్తుసేవల పన్ను ఆదాయంలో నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కేంద్రం సూచించిన రెండు ప్రత్యామ్నాయాలను తిరస్కరించి, కేంద్రమే నష్టపరిహారాన్ని చెల్లించాలని రాష్ట్రాలు డిమాండ్ చేయడం పూర్తిగా సబబే.

‘వస్తుసేవల’ వాగ్దాన భంగం

వస్తుసేవల పన్ను ఆదాయంలో నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కేంద్రం సూచించిన రెండు ప్రత్యామ్నాయాలను తిరస్కరించి, కేంద్రమే నష్టపరిహారాన్ని చెల్లించాలని రాష్ట్రాలు డిమాండ్ చేయడం పూర్తిగా సబబే. ఆ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు మార్కెట్‌లో రుణాలు తీసుకోవడంతో సహా ఇతర మార్గాలలో అవసరమైన నిధులు కేంద్రమే సమీకరించాలి. మరి కేంద్రం తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తుందా?


ఒప్పందాలను పాటించాలి. వాగ్దానాలను నెరవేర్చాలి. ప్రజాహిత పాలన ధర్మాలివి. మరి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం విషయంలో కేంద్రం వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? పన్నుల వసూళ్ళు సమర్థంగా, సమగ్రంగా సాగడంలో జీఎస్టీ ఒక కఠోర పోరాటంగా పరిణమించింది.. అసలే దేశ ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ మాంద్యంలోకి జారిపోతుండగా కరోనా విపత్తు విరుచుకుపడింది. ఆపత్సమయంలో పాలకులు ఉదారంగా వ్యవహరించాలి. సమస్యల సంక్లిష్టతను ఎదుర్కోవడంలో ఉత్కృష్ట రాజనీతిజ్ఞత చూపాలి. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అలా వ్యవహరించిందా? లేదు. ప్రభుత్వ ఉద్దేశాలేమిటి? అవేమిటో ఆ వివేక రాహిత్యంతో బహిర్గతమవ లేదూ? 


రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అంతేగానీ, దాన్ని రాష్ట్రాలు ఆదుకోవడమేమిటి? ఇది అసంబద్ధం. అలాటి పరిస్థితి రావడం జాతి శ్రేయస్సుకు దోహదం చేయదు. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతూ వస్తున్నాను. కేంద్రం, రాష్ట్రాల అధికారాలు భిన్నమైనవి. అవసరమైనప్పుడు అప్పు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వానికి సంపూర్ణ హక్కు ఉంది. ఈ హక్కును ఉపయోగించుకోవడంలో అది రాష్ట్రాలను సంప్రదించనవసరం లేదు. మరి రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తరువాతే అప్పు తీసుకోవాలి; కేంద్ర ప్రభుత్వం ఒక సార్వభౌమిక సంస్థ. ఎంతయినా అప్పుగా తీసుకోగలదు. ఎంత అధికంగా అప్పు చేసినా అది చెల్లించే వడ్డీరేటు స్వల్పస్థాయిలో మాత్రమే. ఆ తక్కువ వడ్డీరేటును కేంద్రం మాత్రమే డిమాండ్ చేయగలదు. రాష్ట్రాలకు అటువంటి హక్కు లేదు. అవి తప్పనిసరిగా అధిక వడ్డీరేటుకే అప్పులు తీసుకోవలసిఉంటుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే రాష్ట్రాలు తాము తీసుకునే అప్పులపై ఒకే వడ్డీరేటు చెల్లించడం లేదు. వాటిలో వ్యత్యాసం ఉంది; భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్జించే లాభాలను డివిడెండ్ రూపంలో పొందే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఒక సందర్భంలో ఆర్బీఐ నిర్ణయించిన డివిడెండ్ కంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేసి కేంద్రం సాధించుకోగలింది. ప్రభుత్వం డిమాండ్ చేసిన డివిడెండ్‌ను చెల్లించడానికి ఆర్బీఐ నిరాకరించినా అంతిమంగా కేంద్రం డిమాండ్‌కు తలవొగ్గక తప్పలేదు. ఆర్బీఐ లాభాలలో వాటా అడిగేందుకు రాష్ట ప్రభుత్వాలకు హక్కు లేదు; కేంద్రప్రభుత్వం తన ద్రవ్యలోటును కరెన్సీనోట్లను ముద్రించడం ద్వారా భర్తీ చేసుకోగలదు. తనకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు వాటిని ముద్రించాలని ఆర్బీఐ ని కేంద్రం ఆదేశించగలదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటువంటి సార్వభౌమాధికారం లేదు. 


కనుక ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రప్రభుత్వాలకు సహాయం అవసరమవుతుంది. ఆ సహాయాన్ని కేంద్రమే అందించాలి. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ తన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జి ఎస్ డిపి)లో 3శాతం మేరకు రుణం తీసుకోవాలని ఆశిస్తోంది. నిజానికి ఈ 3 శాతం, రాష్ట్రాలు తీసుకునే అప్పులపై విధించిన పరిమితి. ఆ పరిమితిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రతి రాష్ట్రప్రభుత్వమూ కోరుకుంటోంది. అందుకు అవసరమైన అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రాలు అభ్యర్థించాయి. అయితే జి ఎస్ డిపిలో కేవలం 0.5 శాతం మేరకు మాత్రమే రుణం తీసుకోవడానికి కేంద్రం అనుమతించింది. అసలే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రాలు కేంద్రం వైఖరి పట్ల ఎంత అసంతృప్తితో ఉన్నా, అనుమతించిన మేరకు రుణం తప్పక తీసుకుంటాయి. అంతకు మించి తీసుకోవాలనుకుంటే విధిగా కొన్ని షరతులకు అంగీకరించవలసిఉంటుంది. అవి రాష్ట్రాలకు తలకు మించిన భారమవుతాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ, ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటువంటి భారాన్ని మోయడానికి సిద్ధంగా లేదు. 


వస్తుసేవల పన్ను ఒప్పందం కేంద్రం-రాష్ట్రాల మధ్య కుదిరిన ఒక ఒడంబడిక. పలు సంవత్సరాల పాటు జరిగిన చర్చల ఫలితంగా ఉభయ పక్షాలూ ఆ ఒప్పందానికి వచ్చాయి. పరస్పర విశ్వాసం ప్రాతిపదికన రూపుదాల్చిన ఆ ఒప్పందంలోని నిబంధనలను కేంద్రం, రాష్ట్రాలు పాటించితీరాలి. వాటిలో అంతర్భాగంగా ఉన్న స్ఫూర్తిని విస్మరించకూడదు సరుకులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్- (వ్యాట్‌) ను విధించే అధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు దత్తం చేసేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి. అలాగే రాష్ట్రాలకు విశేష ఆదాయాన్ని సమకూర్చే ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) మొదలైన వాటిని విధించే అధికారాలను కూడా ఆ కౌన్సిల్‌కు అప్పగించాయి. కామధేనువులను అప్పగించి నందుకు ప్రతిగా రాష్ట్రాలకు సమకూరే లబ్ధి ఏమిటి? కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు రెండు హామీలు ఇచ్చింది. అవి: అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్‌ను ప్రవేశపెట్టినప్పుడు పన్ను రాబడి పెరిగిన విధంగానే జీఎస్టీ ఆదాయం కూడా ఏటా పెరుగుతూనే ఉంటుంది; ఒక వేళ ఆ రాబడి పెరుగుదల ఏడాదికి 14 శాతం మేరకు తగ్గిపోయిన పక్షంలో, మొదటి ఐదు సంవత్సరాల పాటు ఆ తగ్గుదల ఫలితంగా రాష్ట్రాలకు సంభవించిన నష్టానికి కేంద్రం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తుంది.


రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని జీఎస్టీ చట్టం నిర్దేశించింది. ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అవసరమైన నిధులను సమీకరించే వ్యవస్థే జీఎస్టీ పరిహార నిధి. దీని విధివిధానాలు, చట్ట నిర్దేశిత బాధ్యతకు సహాయకారులుగా ఉండాలి. అంతేగానీ ఆ విధివిధానాలకు ఆ బాధ్యత లోబడి ఉండకూదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని ఉపేక్షించారు. ఈ నిధిలో, ఏ సంవత్సరమైనా గానీ లేదా ఐదేళ్ళ గడువు ఆఖరులో గానీ మిగులు లేదా లోటు ఉండవచ్చు. ఐదేళ్ళ గడువు ఆఖరులో మిగులు ఉంటే, ఆ మిగులులో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. మరి ఆ నిధి లోటుతో ఉంటే ఏం చేయాలి? ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. 2017 ఫిబ్రవరి 18న జరిగిన సమావేశంలో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఈ సమావేశపు చర్చలు, నిర్ణయాలకు సంబంధించిన రికార్డు పుస్తకంలో ఇలా ఉంది: ‘నష్టపరిహార నిధికి సరిపడా డబ్బు లేనప్పుడు, అవసరమైన డబ్బును ఇతర ఆధారాల నుంచి సమీకరించే వెసులుబాటును పరిహారచట్టం కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి సూచించారు. ఇందుకు ఆర్థికశాఖ కార్యదర్శి ప్రతిస్పందిస్తూ ఐదు సంవత్సరాల పాటు లేదా కౌన్సిల్ సిఫారసు చేసిన కాల పరిధిలో సెస్ వసూలు చేసేందుకు ముసాయిదా నష్టపరిహార చట్టంలోని సెక్షన్ 8 (1) ఆ వెసులుబాటును కల్పించిందని పేర్కొన్నారు. ఇతర మార్గాలలో ఈ నిధికి అవసరమైన డబ్బును కేంద్రం సమీకరించవచ్చని ఆ సెక్షన్‌ సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అవసరమైన నిధులను మార్కెట్ నుంచి రుణాల రూపంలో తీసుకోవచ్చని కౌన్సిల్ 8వ సమావేశం నిర్ణయాలలో ఉందని, ఆ అంశాన్ని చట్టంలో పొందుపరచవలసిన అవసరం లేదని ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఆయన సూచనను కౌన్సిల్ అంగీకరించింది’.


ఇది స్పష్టమైన, ఎటువంటి సందిగ్థతకు తావులేని నిర్ణయం. రాష్ట్రాల జీఎస్టీ వాటాలో నష్టానికి పరిహారాన్ని చెల్లించేందుకు మార్కెట్‌లో రుణాలు తీసుకోవడంతో సహా ఇతర మార్గాలలో అవసరమైన నిధులు కేంద్రమే సమీకరించాలి. ఇది తిరుగులేని మాట. ఎవరు ఎంత మాటల చమత్కారం చూపినా ఈ రికార్డును మార్చలేరు. రాష్ట్రాలు రుణం తీసుకునేందుకు రెండు ప్రత్యామ్నాయాలను కేంద్రం కల్పించింది. ఆ రెండిటిలో ఏదో ఒక దాన్ని రాష్ట్రాలు ఎంచుకోవచ్చు. అయితే దానివల్ల రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందనుకోవడం ఒక భ్రమ మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి రాష్ట్ర బడ్జెట్‌లోనూ లోటు భారీ స్థాయిలో ఉంది. ఆ లోటును భర్తీచేసుకునేందుకు తీసుకునే రుణం రాష్ట్ర మూలధనం ఖాతాలో రుణంగా చూపించవలసిఉంటుంది. ఈ రుణంపై రాష్ట్రాలు తప్పక వడ్డీ చెల్లించాలి. అంతిమంగా అసలు కూడా చెల్లించాలి. ఏ రాష్ట్రమైనా రుణం తీసుకోని పక్షంలో కేంద్రం ఎటువంటి సహాయాన్నీ సమకూర్చదు. ఆ లోటు లోటుగానే ఉంటుంది. సదరు రాష్ట్రం అనివార్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన మూలధనం వ్యయాన్ని లేదా సంక్షేమవ్యయాన్ని తగ్గించుకోవల్సిఉంటుంది. ఈ రెండిటిలో ఏదీ వాంఛనీయం కాదు. జీఎస్టీలో నష్టాన్ని భర్తీచేసుకునేందుకు కేంద్రం సూచించిన రెండు ప్రత్యామ్నాయాలను తిరస్కరించి, కేంద్రమే నష్ట పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్రాలు డిమాండ్ చేయడం పూర్తిగా సబబే . మరి కేంద్రం తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తుందా?



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-09-19T06:09:18+05:30 IST