చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-12-03T06:44:50+05:30 IST

చేనేత వస్త్రాల అమ్మకాలపై జీఎస్టీని రద్దుచేయాలని, పెరిగిన నూలు ధరలను వెంటనే నియంత్రించాలని నేత కార్మికులు డిమాండ్‌ చేశారు.

చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుచేయాలి
భూదాన్‌పోచంపల్లిలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న చేనేత కార్మికులు

 చేనేత కార్మికుల డిమాండ్‌ 

భూదాన్‌పోచంపల్లిలో నిరసన ర్యాలీ

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 2: చేనేత వస్త్రాల అమ్మకాలపై జీఎస్టీని రద్దుచేయాలని, పెరిగిన నూలు ధరలను వెంటనే నియంత్రించాలని నేత కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు భూదాన్‌పోచంపల్లిలోని చేనేత సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు తడక రమేష్‌, ప్రధాన కార్యదర్శి భారత లవకుమార్‌, చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు మెరుగు శశికళ మాట్లాడుతూ, చేనేత వస్త్రాల అమ్మకాలపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని 12 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలుచేసేలా నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసిందన్నారు. దీంతో చేనేత వస్త్ర వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యాపారాలు లేక బతుకీడుస్తున్నామని, జీఎస్టీ పెంచితే వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. చేనేతరంగంపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులు, కార్మికులు, వ్యాపారులు జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నూలు ధరలు విపరీతంగా పెరిగి చేనేత వస్త్రాల తయారీపై ప్రభావం పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నూలు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 40శాతం యారన్‌ సబ్సిడీని సరళీకృతం చేసి అమలుచేయాలన్నారు. అనంతరం భూదాన్‌పోచంపల్లి తహసీల్దారు దశరథ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేనేత సంఘాల ప్రతినిధులు తడక రమేష్‌, భారత లవకుమార్‌, సంగెం చంద్రయ్య, బోగ విష్ణు, భారత ఆంజనేయులు, వనం అశోక్‌, ఈపూరి ముత్యాలు, సీత గాంధీ, మెరుగు శశికళ, ఎర్వ నీలమ్మ, బోడ దయానంద్‌, భారత శంకర్‌, గుండు ప్రవీణ్‌, గుండు పరమేష్‌, ఇంజమూరి యాదగిరి, చింతకింది రమేష్‌, కర్నాటి పురుషోత్తం, వేశాల మురళీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T06:44:50+05:30 IST