బ్యాంకు డిపాజిట్లకు భరోసా..

ABN , First Publish Date - 2021-07-29T06:21:04+05:30 IST

ఆర్థిక మోసాలు ఎదుర్కొన్న లేదా కుప్పకూలిన బ్యాంకుల ఖాతాదారులకు అండగా నిలిచేలా

బ్యాంకు డిపాజిట్లకు భరోసా..

  • బ్యాంకుపై మారటోరియం విధించినా 90 రోజుల్లో డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా పొందొచ్చు!
  • డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 28: ఆర్థిక మోసాలు ఎదుర్కొన్న లేదా కుప్పకూలిన బ్యాంకుల ఖాతాదారులకు అండగా నిలిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్బీఐ మారటోరియం విఽధించినా బ్యాంకు ఖాతాదారులు తమ డిపాజిట్లపై 90 రోజుల్లోపు రూ.5 లక్షల వరకు బీమా సొమ్మును పొందడానికి మార్గం సుగమం చేసింది. ఈమేరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) చట్ట సవరణలకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. బిల్లు ఈ వర్షాకాల సమావేశంలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ప్రతిపాదిత సవరణ ప్రకారం బ్యాంకులోని ప్రతి ఖాతా దారు డిపాజిట్‌కు రూ.5 లక్షల వరకు బీమా ఉంటుందన్నారు. బీమా మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం వల్ల డిపాజిట్‌ ఖాతాల్లో 98.3% కవర్‌ కానున్నాయని, డిపాజిట్ల విలువ 50.9% ఉంటుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ మొత్తం డిపాజిట్‌ ఖాతాల్లో 80% ఉండగా.. 20-30% డిపాజిట్‌ విలువను కవర్‌ చేస్తుందని తెలిపారు.


కాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకు డిపాజిటర్లు తమ బీమా మొత్తా న్ని లేదా ఇతర క్లెయిమ్‌లను పొందడానికి 8-10 ఏళ్లు పడుతోంది. దీంతో డిపాజిటర్లకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా చర్యలకు ఉపక్రమించింది. బ్యాంకుపై మారటోరియం ఉన్నప్పటికీ అంటే బ్యాంకు లావాదేవీలన్నింటినీ స్తంభింపజేయడం, డిపాజిటర్లు తమ ఖాతాల నుంచి సొమ్మును తీసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తాజా చర్య ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తొలి 45 రోజుల్లో క్లెయిమ్‌లు చెల్లించాల్సిన ఖాతాల వివరాలు సేకరించిన తర్వాత బీమా కంపెనీకి అందజేస్తారని, తర్వాత 90రోజుల్లో డిపాజిటర్లు సొమ్మును పొందుతారని ఆమె చెప్పారు.




కాగా, ఇంతకు ముందు ప్రతి బ్యాంకు రూ.100 డిపాజిట్‌పై 10 పైసలు బీమా ప్రీమియం చెల్లించేది. దీన్ని 12 పైసలకు పెంచుతున్నామని, ఇది 15 పైసలు మించరాదని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాం కు లైసెన్స్‌ రద్దు చేసినప్పుడు లేదా లిక్విడేషన్‌ ప్రక్రియను ప్రారంభించినప్పుడు రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ బీమాను పొందడానికి అవకాశం ఉంటుంది. 27 ఏళ్ల తర్వాత డిపాజిట్‌ బీమాను పెంచారు.


ఇక డీఐసీజీసీ.. ఆర్బీఐ అనుబంధ సంస్థ. ఇది బ్యాంకు డిపాజిట్లకు బీమా కవర్‌ను అందిస్తుంది. దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల (విదేశీ బ్యాంకుల శాఖలు సహా) ఫిక్స్‌డ్‌ లేదా కరెంట్‌ డిపాజిట్లు లేదా రికరింగ్‌ డిపాజిట్లకు డీఐసీజీసీ బీమాను కల్పిస్తుంది. ప్రతిపాదిత సవరణతో బ్యాంకుల్లోని ప్రతి ఖాతాదారు డిపాజిట్‌కు రూ.5 లక్షల వర కు బీమా ఉంటుంది. తాజా బిల్లు చట్టరూపం దాల్చితే పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌(పీఎంసీ) బ్యాంకు, ఇతర చిన్న కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్‌ చేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది.


Updated Date - 2021-07-29T06:21:04+05:30 IST