వరుస కట్టినవలస కూలీలు

ABN , First Publish Date - 2020-05-28T10:48:01+05:30 IST

నిన్నా మొన్నటి వరకు యూరఫ్‌ దేశాలతో పాటు గల్ప్‌ దేశాల నుంచి వచ్చిన వారితోనే కాకుండా డిల్లీ

వరుస కట్టినవలస కూలీలు

సరిహద్దు నుంచి తరలివస్తున్న బడుగుజీవులు 

 ఇప్పటికి జిల్లాకు చేరుకున్న వారి సంఖ్య 635

 కలవర పెడుతున్న కరోనా 

 ఇప్పటికే ముగ్గురికి పాజిటివ్‌ లక్షణాలు గుర్తింపు 

 మరింత అప్రమత్తమవుతున్న జిల్లా యంత్రాంగం 

 ఆదుకుంటున్న ఉపాధిహామీ


నిర్మల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి)  : నిన్నా మొన్నటి వరకు యూరఫ్‌ దేశాలతో పాటు గల్ప్‌ దేశాల నుంచి వచ్చిన వారితోనే కాకుండా డిల్లీ మర్కజ్‌ వెళ్ళి వచ్చిన వారితో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందగా ప్రస్తుతం వలస కూలీల కారణంగా మళ్ళీ  కరోనా వైరస్‌ కలవరపరుస్తోంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు జిల్లాకు తరలివస్తున్న నేపథ్యంలో వైరస్‌వ్యాప్తి మరింత ఉధృతంగా ఉండే ప్రమాదం ఉందంటూ వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాలోని 44వ నంబర్‌ జాతీయరహదారి పొడుగునా వలస కూలీలు తరలివెళ్లడం అలాగే వారికి మార్గమధ్యంలో ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు ప్రత్యేక శిబిరాల ద్వారా అందిం చడం లాంటి వ్యవహారాలన్నీ ఆందోళనకు గురి చేశాయి. ఇప్పటి వరకు జిల్లాకు 635 మంది వలస కూలీలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


ముఖ్యంగా వేలాది మంది జిల్లా వాసులు గత కొన్ని సంవత్సరాల నుంచి మహారాష్ట్రలోని ముంబాయి, నాందేడ్‌, ఔరంగాబాద్‌, తదితర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్ళారు. వీరిలో నుంచి ప్రస్తుతం చాలా మంది అక్కడ ఉపాధి కరువవ్వడంతో తమ స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా 635 మంది అధికారికంగా జిల్లాకు తిరిగి వచ్చినప్పటికీ దీనికి నాలుగితంలుగా వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓ వైపు బంధుత్వాలు, మానవత్వాలు, మరోవైపు కరోనావైరస్‌ వ్యాప్తి భయం లాంటి అంశాలు అటు అధికార యంత్రాంగాన్ని ఇటు సాధారణ జనాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే నిర్మల్‌ జిల్లాలో 20 మందికి కరోనా వైరస్‌ సోకగా, మరో ముగ్గురు ఆ వైరస్‌ తీవ్రతతో మరణించారు.


ఈ సంఘటన కారణంగా నిర్మల్‌ జిల్లాలో 14 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటింన అధికారులు తీవ్రత దృశ్యా జిల్లాను రెడ్‌జోన్‌ పరిధిలోకి చేర్చారు. అలాగే లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేశారు. జిల్లాలో అధికారులు ఐదు క్వారంటైన్‌ కేంద్రాలను, జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇలా అన్ని ముందు జాగ్రత్త చర్యలతో కరోనావైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తున్న యంత్రాంగానికి సరిహద్దున ఉన్న పొరుగు రాష్ర్టాల నుంచి అక్కడ చికిత్స పొందుతున్న వలస కూలీలు తరలివస్తుండడం ప్రస్తుతం సవాలుగా మారుతోంది. 


ముంబాయ్‌ నుంచే ఎక్కువగా..

కాగా గత ఇరవై సంవత్సరాల నుంచి జిల్లాకు చెందిన వేలాది మంది మహారాష్ట్రలోని ముంబాయి నగరానికి ఉపాధి కోసం వలస వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనాఎఫెక్ట్‌తో అక్కడ వారంతా ఉపాధి కోల్పోయారు. అలాగే తిరిగి ఎక్కడ కూడా ఉపాధి లభించే అవకాశాలు లేని కారణంగా గత్యంతరం లేక వారంతా తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్నారు. అలాగే నాందేడ్‌, ఔరంగాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా జిల్లా చెందిన వారు అనేక మంది నివసిస్తున్నారు. వీరంతా ఉపాధి కోల్పోతున్న కారణంగా తమ స్వస్థలాలకు చేరుకొని కుటుంబసభ్యులతో కలిసి ఏదో ఒక పని చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి దాదాపు 635 మందికి పైగా తిరిగి వచ్చారు. అయితే వీరందరిని హోం క్వారంటైన్‌ చేస్తున్నప్పటికి ఇందులో నుంచి ముగ్గురికి అనూ హ్యంగా కరోనాలక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ముంబాయ్‌ నుంచి వచ్చే వారితోనే ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 


ఆదుకుంటున్న ఉపాధి హామీ.. 

కాగా ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడ్డ కష్టకాలం నుంచి బడుగు జీవులను, అలాగే వలస జీవులందరినీ ఉపాధి హామీ పథకం ఆదుకుంటోంది. ప్రస్తుతం ఉన్న జాబ్‌కార్డుదారులకే కాకుండా స్థానికంగా ఉన్న వారందరికీ కూడా అక్కడికక్కడే జాబ్‌కార్డులు జారీ చేసి వారికి ఉపాది కల్పించాలని సర్కారు ఆదేశించడంతో ఇలా పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన వారందరికీ తాత్కాలికంగా ఉపాధి లభించబోనుంది. ప్రస్తుతం మండుటెండలో సైతం ఉపాధిహామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక కూలీలే కాకుండా గ్రాడ్యుయేట్‌లో, పోస్టు గ్రాడ్యుయేట్‌లు సైతం ఉపాఽధి కూలీలుగా మారిపోయి తమ తమ గ్రామాల్లో కూలీపనులు చేస్తున్నారు. ఇలా కరోనా కష్టకాలంలో ఉపాధి కోసం చేయూతనందిస్తున్న ఈజీఎస్‌ ఏడారిలో ఓయాసిస్‌ల మారిందంటున్నారు. 

Updated Date - 2020-05-28T10:48:01+05:30 IST