ఆపత్కాలంలో ఆసరాగా ఉపాధి హామీ

ABN , First Publish Date - 2021-04-20T06:13:06+05:30 IST

కొవిడ్ పుణ్యాన గత ఏడాది భవననిర్మాణ రంగంతో సహా అసంఘటిత రంగంలో ఉపాధి కల్పిస్తున్న పలు రంగాలు మూతపడటంతో లక్షలాది వలస...

ఆపత్కాలంలో ఆసరాగా ఉపాధి హామీ

కొవిడ్ పుణ్యాన గత ఏడాది భవననిర్మాణ రంగంతో సహా అసంఘటిత రంగంలో ఉపాధి కల్పిస్తున్న పలు రంగాలు మూతపడటంతో లక్షలాది వలస కార్మికులు కాలినడకతో తమ గ్రామాలకు తిరిగి వెళ్ళిన హృదయ విదారక దృశ్యాలను మనం చూశాం. ఆ సందర్భంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెద్దఎత్తున ఆ కార్మికులను ఆదుకుంది. మరల కొవిడ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న తరుణంలో, 2020–-21లో తెలంగాణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ఎలా జరిగింది, ఈ సంవత్సరం అమలు మెరుగుదలకు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి చర్చించేందుకే ఈ వ్యాసం. 


స్వతంత్ర భారతదేశంలో పనిహక్కును గుర్తించడమనేది 2005లో అమలు లోనికి వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి మాత్రమే ప్రారంభమయింది. పౌరసమాజం, వామపక్షాల పోరాటాలతో అమలులోకి వచ్చిన ఉపాధి హామీ చట్టంలో సామాజిక, ఆర్థిక నేపథ్యంతో నిమిత్తం లేకుండా నమోదు చేసుకున్న గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి వందరోజులు తగ్గకుండా పని పొందే హక్కు, పని పూర్తి చేసిన 15 రోజుల లోగా వేతనాలు పొందే హక్కు కల్పించారు. 


తెలంగాణలో ఉన్న దళిత, ఆదివాసీ మొత్తం జనాభాలో ప్రతి ఐదుగురిలో దాదాపు ఒకరు ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద 2020–-21లో కల్పించిన మొత్తం పనిలో దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీ కార్మికులు 95శాతం పని పొందారు. అలానే మొత్తం పని వాటాలో మహిళలు 58 శాతం వరకు పని పొందారు. ఈ గణాంకాలను బట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధానంగా అణగారిన వర్గాల ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్దేశించిందని అర్థం చేసుకోవచ్చు. 


తెలంగాణ రాష్ట్రంలో 2020-–21 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో ఉపాధి హామీ పనులు జరిగాయి. ఈ పథకంలో 2014 నుంచి దాదాపుగా 10 నుండి 12 కోట్ల పని దినాలు కార్మికులకు సమకూరేవి. అయితే ఈ సంవత్సరం 15.8 కోట్ల పనిదినాలు లభించాయి. 2019–-20తో పోల్చితే 2020–-21లో ఉపాధి హామీ కార్మికులు 900 కోట్ల రూపాయలు ఎక్కువ వేతనాలు ఆర్జించారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా 2020-–21లో 3.4 లక్షల కుటుంబాలు కొత్తగా ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్నాయి. మొత్తంగా కార్మికులకు 2610 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో లభించాయి. అంటే ప్రతి కుటుంబం ఉపాధి హామీ పనులు చేయడం ద్వారా సగటున 8,600 రూపాయల ఆదాయం ఆర్జించింది. 


ఉపాధి హామీ కార్మికుల వేతనాల ఆర్జనలో గణనీయమైన పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వానికి పంట పండించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అత్యధికంగా సుమారు రూ.1810 కోట్ల మెటీరియల్ పనులకు కేంద్రం నుంచి నిధులు లభించాయి. సాధారణంగా నగరాలకు దగ్గరగా ఉన్న మండలాల్లో కార్మికులు రోజుకు గరిష్ఠంగా 237/– రూపాయలు మాత్రమే వేతనం లభించే ఉపాధి హామీ పథకంలో పని చేయడానికి ఇష్టపడరు. వారికి నగరాలలో అంతకంటే ఎక్కువ వేతనాలు లభించే పనులు అందుబాటులో ఉంటాయి. ఐతే గత సంవత్సరం విధించిన లాక్‌డౌన్ వల్ల పలువురు కార్మికులు తమ జీవనం కోసం ఉపాధి హామీ పథకాన్ని ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా గణాంకాలు చూసినపుడు రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట తదితర జిల్లాలలో సబ్అర్బన్ మండలాలలో ఉపాధి హామీ పనులలో మూడురెట్లకు మించిన వృద్ధి కనిపించింది. 


ఇప్పటివరకు చర్చించిన దానిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో 2020–-21లో గ్రామీణ ఉపాధి పథకం అమలు అద్భుతంగా జరిగిందని సూత్రీకరణ చేయొచ్చు. ఐతే దీనికి ఇతర కోణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో ఉన్న 540 మండలాల్లో 25 మండలాలు 2018-–19 సంవత్సరంతో పోల్చితే కొవిడ్‌ సంవత్సరంలో కూడా తక్కువ ఉపాధి నమోదు చేశాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. 


తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయమని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతల్ని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో వారు పనులను సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారు. అనుభవ రాహిత్యం, వారికి ఉండే ఇతర బాధ్యతలు దీనికి ప్రధాన కారణం. పర్యవేక్షణ కొరవడడంతో అవినీతి పెరిగింది. ఈ ఒరవడిని అడ్డుకోకపోతే నిజాయితీగా పని చేసే కార్మికులు ఉపాధి హామీ పనికి దూరం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఉపాధి హామీ అమలులో ఫీల్డ్ అసిస్టెంట్‌ల పాత్ర అత్యంత కీలకమైంది. గ్రామాలలో నివసించే కార్మికులకు ఉపాధి హామీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా, ఏ సమాచారం కావాలన్నా వారు ఫీల్డ్ అసిస్టెంట్లను ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో గ్రామ స్థాయిలో కార్మికులకు సహాయం అందించే వ్యవస్థ లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని తొలగించిన ఫీల్డ్అసిస్టెంట్లను సత్వరమే విధులలోకి తీసుకోవాలి. ఫీల్డ్ అసిస్టెంట్‌లు లేకపోవడం దీర్ఘకాలికంగా పథకానికి చెడుపు చేస్తుంది. కార్మికులు ఉపాధి హామీ పనికి దూరం ఔతారు. దీని వల్ల వలసలు పెరగడమే కాక గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిరమైన ఆస్తుల కల్పన కూడా కుంటుపడుతుంది.


ఉపాధి హామీ పథకంలో కార్మికులు తమకు అప్పగించిన పని పూర్తి చేసిన వాటా ప్రకారం వేతనాలు పొందుతారు. ఉదాహరణకు ఉపాధి హామీ వేతనం రోజుకు రెండు వందల రూపాయలు ఐతే, ఒక కార్మికుడు తనకు ఒక రోజులో అప్పగించిన పనిలో సగం మాత్రం పూర్తి చేస్తే అతనికి వంద రూపాయలు మాత్రమే లభిస్తాయి. కానీ ఎంత పని చేసాడు అనే దానితో సంబంధం లేకుండా అతను వంద రోజుల కోటాలో ఒక రోజు కోల్పోతాడు. దాని వల్ల ఒక కార్మికుడు సంవత్సరంలో ప్రతి రోజూ తనకు అప్పగించిన పనిలో సగం పని మాత్రమే పూర్తి చేస్తే అతనికి 100 రోజులు పూర్తి అయిపోతాయి కానీ వేతనాల రూపంలో 20 వేల రూపాయలకు బదులు 10 వేల రూపాయలు మాత్రమే లభిస్తాయి. కానీ రెండు మస్టర్ల పద్దతిలో మాత్రం కార్మికులు వందరోజులతో నిమిత్తం లేకుండా 20వేలు సంపాదించుకునే వరకు ఉపాధి హామీ పని చేసుకునే అవకాశం ఉంది. ఈ పద్ధతి, 2017–-18లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రవేశపెట్టేరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉపాధి హామీ రోజువారీ వేతనం రూ.237/– కానీ 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లో 23 వేల రూపాయలు లభిస్తుంటే తెలంగాణ కార్మికులకు మాత్రం సగటున 2020-–21లో కేవలం 17వేల రూపాయలే లభించాయి. రెండు మస్టర్ల పద్ధతి తెలంగాణలో కూడా అమలులో ఉండి ఉంటే ఉపాధి హామీ కార్మికులు అదనంగా 900 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో సంపాదించుకునే అవకాశం ఉండేది. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే రెండు మస్టర్ల పద్ధతి ప్రవేశపెట్టాలి. 


తెలంగాణలో ఉపాధి హామీ వేతనాలు, కనీస వేతనాల చట్టం వేతనాల మధ్య అంతరం ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. అలానే 2020–-21లో 3.4 లక్షల కుటుంబాలు తమ వందరోజుల కోటా పూర్తి చేసుకున్నాయి. కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో ఉపాధిని కోల్పోయిన కార్మికులను ఆదుకోవడానికి ఒడిషా లాంటి పేద రాష్ట్రాలు సైతం ఉపాధి హామీలో పని చేసే వారికి పలు సదుపాయాలు కల్పించాయి. ఒడిషాలో వెనుకబడిన జిల్లాలలో ఉపాధి హామీ పనిదినాల్ని 150 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్రం చెల్లిస్తున్న వేతనాలకు అదనంగా తమ ఖజానా నుంచి కొంతమేర వేతనాలు చెల్లిస్తున్నారు. వీటిని తెలంగాణలో కూడ అమలు చేయాలి. దాని వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. 


ఉపాధి హామీ చట్టం ప్రకారం కనీసం 50 శాతం పనులు పంచాయతీ పర్యవేక్షణలో జరగాలి. పనుల ఎంపిక గ్రామసభలలో జరగాలి. ఈ రెండు విషయాలు అసలు అమలు కావడం లేదు. గ్రామసభలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనే పనుల ఎంపిక చేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు పెద్దఎత్తున డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో పనుల ఎంపికలో పంచాయతీలకు భాగస్వామ్యం కల్పిస్తే కార్మికులకు ఎక్కువ పనులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా అవసరమైన పనులు కూడ జరుగుతాయి.


రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన మున్సిపాలిటీల వల్ల ఒక్క కలంపోటుతో రాత్రికి రాత్రే వేలాది కార్మికులు ఉపాధి హామీ పనులకు దూరం అయిపోయారు. ఈ పట్టణాలలో చాలామంది కార్మికులు ఉపాధి హామీపై ఆధారపడి జీవించేవారు ఉన్నారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలి. లేని పక్షంలో అణగారిన వర్గాల కార్మికులు ముఖ్యంగా ఒంటరి మహిళలు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.


ఉపాధి హామీ పథకం అమలు బాధ్యత రాష్ట్రాలదే అయినా, నిధులు మాత్రం కేంద్రప్రభుత్వం సమకూరుస్తుంది. అందువల్ల ఈ పథకానికి కేటాయిస్తున్న నిధులను పెంచమంటూ రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాగే పనిదినాలు పెంచడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. కొవిడ్ భూతం తరుముకొస్తున్న తరుణంలో ఉపాధి హామీ పథకం అమలు బలోపేతం చేయడం ద్వారా కార్మికులకు కనీస ఉపశమనం కలిగించే అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోకూడదు. ఉపాధి హామీ పథకం లాంటి సామాజిక న్యాయం కోసం ఉద్దేశించబడిన కార్యక్రమంలో ఒక కుటుంబానికి కనీసం 50 రోజులు కూడా పని కల్పించలేకపోవడం ఏమంత గర్వించదగ్గ అంశం కాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ప్రభుత్వానికి కనువిప్పు కావాలి.

చక్రధర్ బుద్ధ 

పల్లె అజయ్ స్వెరో 

గజ్జలగారి నవీన్ కుమార్

Updated Date - 2021-04-20T06:13:06+05:30 IST