అగ్నిప‌ర్వతంపై 'పిజ్జా' త‌యారీ.. లొట్ట‌లేసుకుని తింటున్న ప‌ర్యాట‌కులు!

ABN , First Publish Date - 2021-05-16T21:22:29+05:30 IST

మ‌న‌కు తెలిసి ఎవ‌రైనా పిజ్జా చేయాలంటే ఓవెనే​ వాడుతారు. కానీ, గ్వాటెమాలాలోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అగ్నిపర్వతాన్నే త‌న పిజ్జా తయారీ కోసం వినియోగిస్తూ అంద‌రినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అగ్నిప‌ర్వతంపై 'పిజ్జా' త‌యారీ.. లొట్ట‌లేసుకుని తింటున్న ప‌ర్యాట‌కులు!

గ్వాటెమాలా సిటీ: మ‌న‌కు తెలిసి ఎవ‌రైనా పిజ్జా చేయాలంటే ఓవెనే​ వాడుతారు. కానీ, గ్వాటెమాలాలోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అగ్నిపర్వతాన్నే త‌న పిజ్జా తయారీ కోసం వినియోగిస్తూ అంద‌రినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అగ్నిప‌ర్వతం నుంచి వెలువడే లావాపై పిజ్జా త‌యారు చేస్తూ అక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు రుచి చూపిస్తున్నాడు. ఈ పిజ్జా తయారీకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన‌ నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.  


వివ‌రాల్లోకి వెళ్తే.. గ్వాటెమాలాలో ఉండే డేవిడ్​ గార్సియా(34) అనే వ్యక్తి ఇలా పకాయ అగ్నిప‌ర్వ‌తాన్నే త‌న వంట‌గ‌దిగా మార్చేశాడు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావాపై కూసింత‌ వెరైటీగా పిజ్జా త‌యారీతో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. దీనికి అగ్నిపర్వతం పేరు క‌లిసి వ‌చ్చేలా 'పకాయ పిజ్జా'గా నామకరణం చేశాడు. గ్వాటెమాలా సిటీకి ద‌క్షిణాన‌ 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది ఈ ప‌కాయ అగ్నిప‌ర్వ‌తం. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి లావాను వెద‌జ‌ల్లుతోంది. మూడు నెల‌ల‌ నుంచి గార్సియా ఇలా అగ్నిప‌ర్వతం నుంచి వ‌చ్చే లావాపై పిజ్జా త‌యారు చేస్తున్నాడు.


ఇక అగ్నిపర్వతం నుంచి వ‌చ్చే లావా ఎంత‌టి వేడిని క‌లిగి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌నుక‌ పిజ్జా తయారు చేసేటప్పుడు లావా నుంచి వ‌చ్చే వేడి నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తున్నాడు. అలాగే వంటకు దాదాపు 1,800 ఫారన్​హీట్​ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యేక‌ పాత్రలను వినియోగిస్తున్నాడు. సుమారు 800 ఫారన్​హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లావాపై తాను పిజ్జా త‌యారు చేస్తున్న‌ట్లు గార్సియా తెలిపాడు. దీంతో కేవ‌లం 14 నిమిషాల్లో పిజ్జా రెడీ అవుతుంద‌ట‌. అంతేకాదండోయ్ ఈ పిజ్జా భ‌లే రుచిగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గార్సియా పిజ్జా వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.


ఇక గార్సియా పిజ్జా తయారీ గురించి తెలుసుకున్న పర్యాటకులు చాలా మంది పకాయ అగ్నిపర్వతం వద్దకు విచ్చేసి, లావాపై త‌యారైన ఆ పిజ్జా రుచి చూస్తున్నారు. 23వేల‌ ఏళ్ల కిందట మొదటిసారి పకాయ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. గ్వాటెమాలను స్పెయిన్​ తన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత నుంచి ఇప్పటివరకు 23 సార్లు విస్ఫోటనం చెందిందని తెలుస్తోంది.



Updated Date - 2021-05-16T21:22:29+05:30 IST