ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఎవ్వర్నీ వదలం : అమర్నాథ్

ABN , First Publish Date - 2020-10-24T16:48:09+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కి చెందిన గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఎవ్వర్నీ వదలం : అమర్నాథ్

విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కి చెందిన గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి ఎటువంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి కూల్చడం అనేది జగన్ ఫాసిస్టు ధోరణికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు. మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇల్లు, ఇవాళ గీతం యూనివర్సిటీ అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకొచ్చి విమర్శలను తిప్పికొట్టారు.


ఎవ్వర్నీ వదలం..

విశాఖలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకుంటే కొంతమంది దుష్రచారం చేస్తున్నారు. నారాలోకేష్ తోడొల్లుడు భరత్ దాదాపు 40 ఎకరాల భూమిని తన ఆక్రమణలో పెట్టుకున్నారు. దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయిలు విలువ గల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పని ఎవరైనా చెబితే క్షమాపణ చెప్తాం. విశ్వవిద్యాలయానికి గాంధీ పేరుపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఐదు నెలల క్రితం గీతం యాజమాన్యానికి అధికారులు తెలియజేశారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలో ఉంటే ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడానికి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో అత్యంత అవినీతికి పాల్పిడిన వ్యక్తిని టీడీపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడుని చేసింది. ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎవ్వరిని విడిచిపెట్టేది లేదుఅని అమర్నాథ్ హెచ్చరించారు. కాగా.. ఈ మధ్యనే ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అధిష్టానం నియమించిన విషయం విదితమే.

Updated Date - 2020-10-24T16:48:09+05:30 IST