నా స్టేషన్‌.. నా ఇష్టం

ABN , First Publish Date - 2022-01-24T06:32:04+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో కేసు విచారణలో పోలీసుల తీరు ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది.

నా స్టేషన్‌.. నా ఇష్టం

గుడివాడ వన్‌టౌన్‌ సీఐ తీరే వేరు

టీడీపీ నేతపై దాడి చేసిన వారి మీద కేసు లేదు

ప్రశ్నిస్తే ఏం చేయాలో మాకు తెలుసంటూ హుంకరింపు

మీడియా కెమెరాలు లాక్కుని దౌర్జన్యం


గుడివాడ, జనవరి 23 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో కేసు విచారణలో పోలీసుల తీరు ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం గుడివాడ సబ్‌డివిజన్‌ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, కేసినో వ్యవహారంపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. మరోపక్క నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్పీ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ ఉందోలేదో తెలియదు. డీఐజీ కె.వి.మోహనరావు గుడివాడలో కేసినో నిర్వహణ, శుక్రవారం నాటి ఘటనలపై ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ నేతృత్వంలో విచారణ కమిటీ వేశానని ప్రకటించడమే గందరగోళానికి దారి తీసింది. ఆదివారం నూజివీడు డీఎస్పీ నివేదిక సమర్పిస్తారని అందరూ ఊహించినా, ఆ దిశగా  అడుగులు పడలేదు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా, కేసినోకు అనుమతించే అధికారం సబ్‌డివిజన్‌ స్థాయి అధికారులకు ఉండదని న్యాయనిపుణుల వాదన. మరోపక్క ఉన్నతాధికారుల ఒత్తిడితో స్థానిక పోలీసు అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుడివాడ వన్‌టౌన్‌లో శుక్రవారం నాటి ఘటనలపై నమోదు చేసిన కేసుల ఎఫ్‌ఐఆర్‌ కాపీలు ఇవ్వాలని మీడియా కోరగా, సీఐ గోవిందరాజులు నోరు పారేసుకోవడం విమర్శల పాలైంది. ‘మీ ఇష్టం వచ్చింది రాసుకోండి.. నేను మాత్రం వివరాలు ఇచ్చేది లేదు..’ అనడమే కాక అడిగిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. 

 

కళ్లెదుటే దాడి జరిగినా..

టీడీపీ నాయకుడు ముళ్లపూడి రమేష్‌పై దాడి చేసిన వారిపై కేసు ఎందుకు కట్టలేదని ప్రశ్నించగా, ‘నా స్టేషన్‌... నా ఇష్టం. నేనేం చేయాలో మీరు చెప్తారా?’ అంటూ విరుచుకు పడటం గమనార్హం. దాడికి గురైన రమేష్‌ ఏరియా ఆసుపత్రి పోలీస్‌ అవుట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేసి, చికిత్స పొందుతుంటే, నిందితులు అదే రాత్రి మళ్లీ దాడికి యత్నించడం తెలిసిందే. ఆ రోజు రాత్రి దాడికి వచ్చిన నిందితులు సీఐ గోవిందరాజులు సమక్షంలోనే ‘నీ అంతు చూస్తాం బయటకు రా’ అంటూ రమేష్‌పై సవాళ్లు విసరడం గమనార్హం. ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో రికార్డు చేస్తుంటే అవి ఇవ్వాలంటూ సీఐ దౌర్జన్యానికి దిగారు. అయినా ఇవ్వకపోవడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు నటించి, తరువాత పది నిమిషాల్లోనే స్టేషన్‌ నుంచి బయటకు పంపించివేశారు.


ఆది నుంచీ వివాదాస్పదమే 

గతంలోనూ సీఐ గోవిందరాజులుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో సీఐ గోవిందరాజులు ఒక్కోసారి ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయరని సమాచారం. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఎఫ్‌ఐఆర్‌ల సమాచారం తీసుకోవాలని ప్రయత్నించగా, మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దంటూ వారు పక్కకు తప్పుకోవడం గమనార్హం. దీన్ని బట్టి కేసుల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచి, ఇష్టానుసారం వ్యవహరించేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సీఐ గోవిందరాజులుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలున్నాయి. పట్టణంలోని ఓ ఆసుపత్రి  నిర్వాహకులపై దురుసుగా ప్రవర్తించడంతో ఎస్పీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. స్టేషన్‌లోని కిందిస్థాయి సిబ్బందితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా, పరిస్థితిలో మార్పు రాలేదు. 

Updated Date - 2022-01-24T06:32:04+05:30 IST