ABN Effect: గుడివాడ క్యాసినోపై విచారణ..

ABN , First Publish Date - 2022-01-19T17:31:35+05:30 IST

మంత్రి కొడాలి నాని పుణ్యమా అని గుడవాడ క్యాసినోకు నిలయంగా మారింది.

ABN Effect: గుడివాడ క్యాసినోపై విచారణ..

కృష్ణా జిల్లా: గుడులవాడగా చరిత్రకెక్కిన గుడివాడ ఇప్పుడు అడ్రస్ మార్చుకుంది. మంత్రి కొడాలి నాని పుణ్యమా అని క్యాసినోకు నిలయంగా మారింది. పచ్చని పంట పొలాల మధ్యలో జూదగృహాలకు నిలయంగా మారింది. గుడివాడ క్యాసినో వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలు ప్రకంపనలు రేపడంతో ఈ వ్యవహారంపై విచారణ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


గుడివాడలో జూదక్రీడలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఫిర్యాదులు వెళ్లాయి. రాజకీయ నాయకులు నిర్వహిస్తున్న ఈ జూదాన్ని అరికట్టడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల్లో కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడాలేని విధంగా క్యాసినో సంస్కృతిని తొలిసారి దిగుమతి చేసుకున్న పట్టణంగా చరిత్రలో గుడివాడ నిలిచిపోయింది. ఎందరో మధ్య తరగతి జీవుల జీవితాలను ఛిన్నా భిన్నం చేయడంతోపాటు ధనికులను రోడ్డు రోడ్డుపాలు చేయగల జూద గృహలకు గుడివాడ నిలయంగా మారింది. రాజకీయ ప్రముఖుల అండతో విచ్చలవిడిగా పేకాటలు, గుంటాటలు నిర్వహిస్తున్నారు.


స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని  మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడంకంటే ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడంపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. జూద గృహాల నిర్వహణ అంతా ఆయన అనుచరుల కనుసన్నల్లోనే నడుస్తుందనేది బహిరంగ రహస్యం. ఇలాంటి ఆటలు ఆడి చాలా మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకున్నారని లారీ డ్రైవర్స్, క్లీనర్ అసోషియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-19T17:31:35+05:30 IST