అతిథి అధ్యాపకులు వచ్చేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-10-18T04:33:26+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తాత్కాలికంగా పరిష్కరించేందుకు సర్కారు చర్యలు తీసుకుంది. కళాశాలల్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్‌ పోస్టుల్లో అతిథి అధ్యాపకులతో(గెస్ట్‌ లెక్చరర్స్‌) విద్యా బోధనకు ఇంటర్‌ బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అతిథి అధ్యాపకులు వచ్చేస్తున్నారు!

  ఉమ్మడి జిల్లాలో 241 పోస్టులకు అనుమతి

 ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్‌ బోర్డు


మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 17: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తాత్కాలికంగా పరిష్కరించేందుకు సర్కారు చర్యలు తీసుకుంది. కళాశాలల్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్‌ పోస్టుల్లో అతిథి అధ్యాపకులతో(గెస్ట్‌ లెక్చరర్స్‌) విద్యా బోధనకు ఇంటర్‌ బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు 241 మంది అతిథి అధ్యాపకులు రాబోతున్నారు. గత విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు అతిథి అధ్యాపకులను ఇంటర్‌ బోర్డు నియమించింది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణతో కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా గెస్ట్‌ఫ్యాకల్టీలను నియమించకపోవడంతో బోధన కుంటుపడింది. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమయినా ఉమ్మడి జిల్లాలోని చాలా కళాశాలల్లో పాఠాలు బోధించేందుకు సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రభుత్వం అతిథి అధ్యాపకులను విధుల్లో చేర్చుకునేందుకు అనుమితించలేదు. ఫలితంగా కళాశాలల్లో అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని సంబంధిత ఉన్నతాధికారులు రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇంటర్‌బోర్డు స్పందించి ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతించింది. దీంతో కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత తీరనుంది. కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు మంజూరై ఖాళీగా ఉన్న స్థానాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమించనున్నారు.


గతంలో పనిచేసిన వారి కొనసాగింపు


గతంలో పనిచేసిన వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారు అందుబాటులో లేకపోతే కొత్త వారిని నియమించాలని ఉత్తర్వుల్లో సూచించింది. మెదక్‌ జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలుండగా.. 72 మంది అతిథి అధ్యాపకులు, సిద్దిపేట జిల్లాలో 20 ప్రభుత్వ కళాశాల్లో 77 మంది అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్‌బోర్డు నిర్ణయంతో వీటిని అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నారు.


 సంగారెడ్డి జిల్లాలో 


సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 17: సంగారెడ్డి జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా అందులో 87 మంది పాత గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వారందరూ ఈ నెల 18న నియామకమైన ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా జిల్లాలో మరో ఐదు గెస్ట్‌ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. తాజాగా ఇంటర్‌బోర్డు నిర్ణయంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత తీరనుందని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి(డీఐఈవో) గోవిందరామ్‌ తెలిపారు.  


 

Updated Date - 2021-10-18T04:33:26+05:30 IST